ENGLISH

గెటప్పే కాదు, అంతకు మించి

04 August 2017-16:55 PM

అగ్రహీరోలు కొత్తదనం కోరుకోవడమంటే ముందుగా గెటప్‌ మీద ఫోకస్‌ పెడ్తారు. అయితే ఎంత కష్టపడ్డా అలాంటి ప్రయత్నాలు అన్ని సందర్భాల్లోనూ సక్సెస్‌ అవవు. దానికి అనేక కారణాలుంటాయి. అగ్రహీరోలు కాబట్టి వారికున్న కమర్షియల్‌ స్టామినా నేపథ్యంలో దర్శకులు 'సినిమాటిక్‌ లిబర్టీ' తీసుకుంటుంటారు. అలాగే హీరోలూ తమ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవకూడదని కోరుకోవడం సహజం. అయితే కొందరు మాత్రం అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ లిస్ట్‌లోకే బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ వస్తాడు. చేసే సినిమా, అందులో పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాడు. పాత్ర కోసం ఏమైనా చేయడం అమీర్‌ఖాన్‌ ప్రత్యేకత. అందుకే ఆయన్నుంచి అత్యంత ప్రత్యేకమైన చిత్రాలొస్తాయి. మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అనే మాట ఊరికినే వచ్చేయలేదు అమీర్‌ఖాన్‌కి. 'సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌' సినిమా కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్రని ఎంచుకున్నప్పుడు ఆ పాత్రలో ఒదిగిపోవడంపైనే దృష్టిపెట్టాడు. దీనికోసం బరువు బాగా తగ్గడమే కాకుండా గెటప్‌లో చాలా ఛేంజెస్‌ చేసేశాడు. అవేనా, ఆహార్యం కూడా మారిపోయింది. ప్రతి సినిమాకీ అమీర్‌ఖాన్‌ ఇలాంటి ప్రయోగాలు చెయ్యడం, ఆ సినిమాలు సక్సెస్‌ కావడం చూస్తున్నాం. అమీర్‌ఖాన్‌ నుంచి 'దంగల్‌' వచ్చినా, 'పికె' వచ్చినా ఇంకే సినిమా వచ్చినా ప్రతిదీ ప్రత్యేకం. గెటప్‌ మాత్రమే కాదు అంతకు మించి అని ఆలోచించడమే అమీర్‌ఖాన్‌ విజయాలకు కారణం.

ALSO READ: దర్శకుడు మూవీ రివ్యూ & రేటింగ్స్