ENGLISH

భూమి రివ్యూ & రేటింగ్స్

22 September 2017-16:19 PM

తారాగణం: సంజయ్ దత్, అదితి రావు
నిర్మాణ సంస్థలు: T- సిరీస్ & లెజెండ్ స్టూడియోస్
కథ: సందీప్
కథనం: రాజ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, సందీప్ సింగ్, ఓమంగ్ కుమార్
దర్శకత్వం: ఓమంగ్ కుమార్

యావరేజ్ రేటింగ్: 2.75/5

అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు అన్న ఆరోపణల పైన తనకు విధించిన జైలు శిక్షని పూర్తిగా అనుభవించి బయటకి వచ్చాక బాలీవుడ్ హీరో సంజయ్ దత్ చేసిన చిత్రం ‘భూమి’. దీనితో ఈ చిత్రం పైన అంచనాలు పెరిగాయి అలాగే ఈ చిత్రం ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిచ్చగలిగింది.

కథ...

అరుణ్ సచదేవ్ (సంజయ్ దత్) ఆగ్రాలో ఒక చెప్పులు షాపుని నడుపుతుంటాడు, ఆయన కూతురే భూమి (అదితి రావు). భూమి చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తన కూతురుని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు అరుణ్. ఈ నేపధ్యంలోనే నీరజ్ (సిద్ధాంత్) తో భూమి ప్రేమలో పడడం వారి ప్రేమను పెద్దలు ఒప్పుకొని పెళ్ళి తేదీ నిశ్చయిస్తారు. సరిగ్గా పెళ్ళి రోజు ముందే భూమి రేప్ కి గురవుతుంది, దీనితో పెళ్ళి ఆగిపోతుంది. ఇక రేప్ చేసిన వారికి శిక్ష వేయించేందుకు కోర్టుకి వెళ్ళిన ఫలితం దక్కదు.

ఈ పరిస్థితుల్లో ఈ తండ్రి-కూతురు ఏం చేసారు? అత్యాచారానికి పాల్పడిన వారికి ఎలా బుద్ధి చెప్పారు అన్నది తెరపైన చూడాలి...

నటీనటుల పనితీరు...

సంజయ్ దత్: ఈ పాత్రలో సంజయ్ ని తప్ప ఎవరిని ఊహించలేము అన్న విధంగా అభినయించాడు. అలాగే తన నటనతో ప్రేక్షకులని తనవైపుకి తిప్పేసుకుంటాడు. ఈ చిత్రానికి ఈయన నటన ఒక ఆయువుపట్టు అని చెప్పొచ్చు.

అదితి రావు: ‘భూమి’ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పొచ్చు. తన బాధని, కోపాన్ని తెరపైన చూపెట్టడమే కాదు తన నటనతో మనల్ని కదలించేస్తుంది అని చెప్పాలి. ఈ పాత్రకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసింది.

శరద్ కేల్కర్ తనలోని విలనిజాన్ని పండించడంలో సక్సెస్ అయ్యాడు.

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో ‘అత్యాచారాల’ పైన చాలానే చిత్రాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో మనం కథా రచయతలని, దర్శకులని అభినందించాల్సిందే. ఎందుకంటే ఇటువంటి కథాంశాల పైన చిత్రాలని తీస్తూ ‘అత్యచారాలని ఆపడం’ పైన ఎంతోకొంత తమవంతు ప్రయత్నం చేస్తున్నారు అనే చెప్పాలి.

ఇక దర్శకుడు ఓమంగ్ కుమార్ తన రచయతలైన సందీప్-రాజ్ లతో కలిసి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలనే కొన్ని సన్నివేశాలుగా రాసుకున్నారు. ఉదాహరణకి- భూమిని అత్యాచారం చేసిన వారిలో 18 ఏండ్ల లోపు వాడు కూడా ఉండడం అతన్ని సరిగ్గా 18 ఏళ్ళు నిండిన తరువాతే ఈ చిత్రంలో శిక్షించడం వంటివి చూస్తాం. ఇక ఇదే తరహాలో నిర్భయ కేసులో ప్రధాన నిందితుడిని మైనర్ అని చెప్పి వదిలేయ్యడం అప్పట్లో సంచలనంగా మారింది.

అయితే ఇటువంటి కథల్లో సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా ప్రతీకారం అనే పాయింట్ పైనే కథనాన్ని నడపాల్సి వస్తుంది. ఈ చిత్రం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కాకపోతే ఇటువంటి చిత్రాలు ఈ మధ్య ప్రేక్షకులు తరచుగా చూస్తుండడం ఈ చిత్రానికి కొంత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది.

మొత్తంగా ఈ చిత్రంలో సంజయ్, అదితిల నటన తప్ప మిగతావన్ని రొటీన్ గా సాగడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

+ సంజయ్ దత్
+ అదితి రావు
+ కోర్టు సీన్

మైనస్ పాయింట్:

- రొటీన్ కథ & కథనం

ఆఖరి మాట: సంజయ్ దత్-అదితి రావుల కోసం చూడొచ్చు. లేదంటే లైట్..

రివ్యూ బై సందీప్

 

ALSO READ: భూమి ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి