ENGLISH

ఛ‌లో మూవీ రివ్యూ & రేటింగ్స్

02 February 2018-10:25 AM

తారాగణం: నాగ శౌర్య, రష్మిక, నరేష్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ: IRA క్రియేషన్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: ఉషా ముల్పూరీ
రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల  

రేటింగ్: 3/5

కథ‌ని బ‌ట్టి క్యారెక్ట‌ర్ అన్న‌ది పాత మాట‌ క్యారెక్ట‌ర్‌ని బ‌ట్టి క‌థ అన్న‌ది నేటి ద‌ర్శ‌కుల సిద్దాంతం.

ఔను... క్యారెక్ట‌రైజేష‌న్ బాగుంటే చాలు. దాని చుట్టూ క‌థ అల్లేస్తున్నారు. అదృష్ట‌వ‌శాత్తూ ప్రేక్ష‌కులూ దీనికే అల‌వాటు ప‌డిపోయారు. దాంతో ద‌ర్శ‌కులు లైన్లు ప‌ట్టుకుని రంగంలోకి దిగిపోతున్నారు. `ఛ‌లో` కూడా అలాంటి క‌థే. గ‌మ్మ‌త్తైన హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ని రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. దాని చుట్టూ రెండు ఊర్ల గొడ‌వ క‌థ క‌లిపాడు. ఓ ప్రేమ క‌థ జోడించాడు. దాంతో `ఛ‌లో` పూర్త‌యిపోయింది. మ‌రి ఈ క్యారెక్ట‌రైజేష‌న్‌, దాని చుట్టూ అల్లుకున్న క‌థ ఎలా ఉన్నాయి?  నాగ శౌర్య ఎలా చేశాడు?  కొత్త ద‌ర్శ‌కుడు ఎలా తీశాడు?  

* క‌థ‌

హ‌రి (నాగ‌శౌర్య‌)కి చిన్న‌ప్ప‌టి నుంచీ గొడ‌వ‌లంటే ఇష్టం. త‌న్న‌డంలోనూ, త‌న్నులు తిన‌డంలోనూ ఆనందం వెదుక్కునే ర‌కం. వాడి గోల భ‌రించ‌లేక ఇంట్లో వాళ్లు తిరుప్పురం త‌రిమేస్తారు. అక్క‌డ ఇంకా పెద్ద పెద్ద గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఆంధ్రా, త‌మిళ‌నాడు బోర్డ‌ర్ అది. అటో ఊరు, ఇటో ఊరు. ఈ ఊరి వాళ్లు అక్క‌డ‌కి వెళ్ల‌కూడ‌దు, అక్క‌డి వాళ్లు ఇక్క‌డికి రాకూడ‌దు. ఇలాంటి చోట‌... హ‌రి.. కార్తీక (ర‌ష్మిక‌)ని ప్రేమిస్తాడు. త‌న‌తో పెళ్లి జ‌ర‌గాలంటే ఒక్క‌టే మార్గం. గొడ‌వ‌లు ప‌డుతున్న రెండు ఊర్ల‌నీ క‌లిపేయాలి. మ‌రి హీరో అది చేయ‌గ‌లిగాడా?  లేదా??  అనేది తెర‌పై చూడాలి. 

* నటీనటుల పనితీరు 

నాగ‌శౌర్య‌:  నాగ‌శౌర్య సొంత సినిమా ఇది. అందుకే మ‌రింత జాగ్ర‌త్త‌గా చేశాడేమో అనిపిస్తుంది. అత‌ని ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇదివ‌ర‌క‌టి కంటే అందంగానూ క‌నిపించాడు. ఇలాంటి పాత్ర‌లు శౌర్య‌కి భ‌లే సెట్ట‌వుతాయి. త‌న కెరీర్‌లో ఈ సినిమా మ‌రో మ‌లుపు.

ర‌ష్మిక‌: త‌న‌కు ఇదే తొలి సినిమా. అందంగా క‌నిపించింది. చ‌క్క‌గా న‌టించింది. హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ బాగుండ‌డంతో... ఈ పాత్ర కూడా గుర్తుండిపోతుంది.

స‌త్య‌, వెన్నెల కిషోర్‌: ఈ సినిమాని న‌డిపించిన మ‌రో రెండు కీల‌క‌పాత్ర‌లు ఇవి. స‌త్య అమాయ‌క‌త్వం, వెన్నెల కిషోర్ `రివైంజ్‌` బాగా న‌వ్విస్తాయి. తొలి స‌గం స‌త్య చూసుకుంటే, ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్ చెల‌రేగిపోయాడు.

* ఎలా ఉంది?

గొడ‌వ‌లంటే ఇష్ట‌ప‌డే హీరో.. ఓ ఊరి గొడ‌వ‌ని ఆపాలి. ఇది క‌చ్చితంగా ఇంట్ర‌స్ట్రింగ్ పాయింటే. కాక‌పోతే ఇక్క‌డ ఈ పాయింటే కొత్త‌ది. రెండు ఊర్లు గొడ‌వ ప‌డ‌డం, అందులోంచి ఓ ప్రేమ క‌థ పుట్ట‌డం చాలా సినిమాల్లో చూశాం.  ద‌ర్శ‌కుడి బ‌లం క‌థ కాదు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌.  గొడ‌వ‌లంటే ఇష్ట‌ప‌డేలా హీరో పాత్ర‌ని డిజైన్ చేసుకోవ‌డం, ఈ పిచ్చి... దాదాపుగా హీరోయిన్‌కీ ఉండ‌డంతో వాళ్ల క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూ వినోదం పండించాడు. హీరోయిన్ పాత్ర కూడా రొటీన్ కి భిన్నంగా.. కొత్త‌గా ఉంటుంది. త‌ను వీలైనంత కామెడీ చేసింది. కాలేజీ నేప‌థ్యంలో సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. ఇందులో తొలి స‌గం అంతా కాలేజీ నేప‌థ్యంలోనే సాగుతుంది. క్లాస్ రూమ్ అల్ల‌రి యూత్ కి న‌చ్చేస్తుంది.  ఫ‌న్ పండించ‌డానికి వీలు లేని చోట కూడా... ద‌ర్శ‌కుడు వినోదం సృష్టించుకున్నాడు. దాంతో తొలి స‌గం న‌ల్లేరు మీద న‌డ‌క‌లా హాయిగా సాగిపోయింది.

ద్వితీయార్థంలో ఆ ఊరి గొడ‌వ ఎందుకు? అనే డిటైల్స్‌లోకి వెళ్లాడు. హీరో, హీరోయిన్‌ల మ‌ధ్య విర‌హం మొద‌ల‌వుతుంది. అవ‌న్నీ సీరియెస్ విష‌యాలే. అయితే ద‌ర్శ‌కుడు దాన్ని కూడా వీలైనంత కామెడీ ట‌చ్ ఇచ్చి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. వెన్నెల కిషోర్ రాక‌తో సినిమా టెంపో పూర్తిగా మారిపోతుంది. త‌న కామెడీని బండి ముందుకు సాగుతుంది. ద‌ర్శ‌కుడు కామెడీ కోసం ప్ర‌యత్నించిన ప్ర‌తి సారీ స‌ఫ‌లం అయ్యాడు. ఊరి గొడ‌వ‌లోకి వెళ్లిన ప్ర‌తీసారీ త‌డ‌బడ్డాడు. ఊరి వెనుక ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని ప్రేక్ష‌కుడు ఫీల‌వుతుంటే... దాన్ని చాలా సిల్లీగా చూపించి.. నిరాశ ప‌రుస్తాడు ద‌ర్శ‌కుడు. అదొక్క‌టి మిన‌హాయిస్తే... ఈ క‌థ‌లో, క‌థ‌నంలో పెద్ద‌గా లోపాలేం లేవు. క్లైమాక్స్‌ని సిల్లీగా
తీర్చిదిద్ద‌డం వెనుక ఆంతర్యం అర్థం కాదు. బ‌హుశా.. లైట‌ర్ వేలోనే క‌థ‌ని ముగించాల‌ని ద‌ర్శ‌కుడు భావించి ఉంటాడు.

సంగీతం:

చూసీ చూడంగానే న‌చ్చేశావే పాట విడుద‌ల‌కు ముందే.. అంద‌రికీ న‌చ్చేసింది. ఆ పాట థియేట‌ర్లోనే మోత మోగిస్తుంది. మిగిలిన‌వ‌న్నీ ఫ‌ర్వాలేదు. నేప‌థ్య సంగీతం కూడా బాగుంది.

కెమెరా:

ఈ సినిమాకి మ‌రో ప్ల‌స్ పాయింట్ కెమెరా.  కాలేజీ నేప‌థ్యాన్ని చాలా అందంగా చూపించింది. పాట‌ల్ని తెర‌కెక్కించిన విధానం కూడా న‌చ్చుతుంది. ఫ్లాష్ బ్యాక్ చెబుతున్న‌ప్పుడు ఓ చోట‌ కెమెరా మూమెంట్స్ మ‌రీ ఎక్కువ‌య్యాయి.

ద‌ర్శ‌క‌త్వం:

వెంకీకి  ఇదే తొలి సినిమా. క్లైమాక్స్ మిన‌హాయిస్తే ఎక్క‌డా పొర‌పాటు చేయ‌లేదు. త‌న రైటింగ్ స్కిల్స్‌కూడా పూర్తి స్థాయిలో బ‌య‌ట‌ప‌డ్డాయి.  నాగ‌శౌర్య సొంత సినిమా. నిర్మాణ విష‌యంలో రాజీ ప‌డ‌ర‌ని ఇక చెప్పేదేముంది?

* ప్ల‌స్ పాయింట్స్‌

+ నాగ‌శౌర్య పాత్ర‌
+ వినోదం
+ డైలాగ్స్‌
+ పాట‌లు

* మైన‌స్‌ పాయింట్స్

- క్లైమాక్స్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  యూత్‌+ ఫ‌న్‌.. 

రివ్యూ బై శ్రీ

 

ALSO READ: Qlik Here To Read Chalo Movie English Review