ENGLISH

చెలియా తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్

07 April 2017-15:54 PM

తారాగణం: కార్తీ, అదితి రావ్ హైదరి
బ్యానర్: మద్రాస్ టాకీస్
సంగీతం: రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
రచన్-నిర్మాత-దర్శకత్వం: మణిరత్నం

మణిరత్నం సినిమా వస్తోంది అంటే చాలు, చూసేయాలి అనుకునేవారి సంఖ్య తెలుగునాట కూడా తక్కువేమీ కాదు. అలనాటి గీతాంజలి నుంచి నిన్న మొన్నటి ఓకె బంగారం వరకు హిట్ లు అయినా, ఫట్ లు అయినా, ఆసక్తి మాత్రం ఒకటే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈవారం విడుదలైన చెలియాకు ప్రచారం తక్కువైనా, జనాల ఆసక్తి అంత తక్కువేమీ కాదు. తొలిరోజు ఉదయాన్నే థియేటర్లకు వచ్చిన జనమే దీనికి సాక్ష్యం. కానీ అలా వచ్చిన జనాన్ని దర్శకుడు మణిరత్నం కాస్త నిరుత్సాహ పర్చారు. ముఖ్యంగా కామన్ ఆడియన్ కు అందనంత ఎత్తులో సినిమాను నడిపించారు. మల్టీ ఫ్లెక్స్ ఆడియన్స్ కు కూడా మణిరత్నం సినిమాల్లో కనిపించే విజువల్స్, నేపథ్య సంగీతం, నటుల హావ భావాలు చూసి మురిసిపోవడం తప్ప, ఆ సినిమా ఏంటో, ఆ కథేంటో, కళ్ల ముందు ఏం నడుస్తోందో, ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నది కామన్ ఆఢియన్ ఒక్కరికైనా అర్థమయితే ఒట్టు. 

* కథ ఎలా ఉందంటే...

ఇంతకీ ఈ సినిమా కధేంటీ అంటే, మణిరత్నం కూడా చెప్పలేడేమో? ఓ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఓ మిలటరీ డాక్టర్. ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ ఎయిర్ ఫోర్స్ ఆపీసర్, ఎందుకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంటాడో ప్రేక్షకుడికి అర్థం కాదు. అంతలోనే లవ్ అంటాడు. అంతలోనే బరస్ట్ అవుతుంటాడు. అలా బరస్ట్ అయినపుడల్లా ఆ అమ్మాయి దూరం జరుగుతుంది. కానీ మళ్లీ ఆ అబ్బాయి రాగానే దగ్గరవుతుంటుంది. నిజానికి ఆ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, పాక్ సైనికలకు చిక్కి అక్కడి జైల్లో మగ్గుతున్నపుడు ఫ్లాష్ బ్యాక్ లా సాగుతుందీ కథంతా. చివరకు జైలు నుంచి తప్పించుకు వస్తాడు ఆ ఎయిర్ ఫోర్స్ ఆపీసర్. అప్పుడు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

* ఎలా చేసారంటే...

మామూలుగానే కార్తీ, అదితి రావ్ లాంటి వాళ్లు మంచి నటులు. మరి మణిరత్నం లాంటి డైరక్టర్ తోడయితే. ఇంక చెప్పాలా? నటన పరంగా ఎవరికీ వంకపెట్టడానికి ఉండదు. కానీ ఆ నటనకు తగ్గ కథ ఉండి ఉంటే అది వేరుగా వుండేది. అలాగే రెహమాన్ నేపథ్య సంగీతం బాగానే అందించాడు ఎప్పటిలాగే. పాటలు మాత్రం ఒక్కటి మినహా మిగిలినవి గుర్తుకురావు. నోటికి పట్టవు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం కనువిందు చేస్తుంది. హిమాలయాలు, పాక్, భారత్ సరిహద్దు ప్రాంతాలు, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు అన్నీ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఆ సినిమాటోగ్రఫీ, ఆ లోకేషన్లు లేకుంటే సినిమాలో ప్రేక్షకుడు పట్టుమని పది నిమషాలు కూడా కూర్చోలేని పరిస్థితి వుండేది.

* ఎలా తీసారంటే...

సినిమా అనువణువునా మణిరత్నం స్టయిల్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద తెలుగు ప్రేక్షకులు చూడని లోకేషన్లు కనువిందు చేస్తాయి. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకోవడంలో మణిరత్నం ప్రతిభ సంగతి కూడా తెలిసిందే. ఇలా అన్నీ అమరి కూడా, జనాలు థియేటర్లలో కూర్చోలేని పరిస్థితి. మణిరత్నం తన స్థాయిని పెంచుకోవాలన్న తపనలో పడి, కామన్ ప్రేక్షకుడిని పూర్తిగా విస్మరించారు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర చిత్రణ మన ప్రేక్షకుల స్థాయికి అందదు. దానికి కారణం, తీసిన సన్నివేశాల్లో క్లారిటీ మిస్ కావడమే. ఉన్నట్లుండి ఎందుకు రైజ్ అవుతాడో, ఆ రైజ్ అయిన సమయంలో జరిగిన సంభాషణలేమిటో? అన్నవి క్లారిటీగా ఉండవు.

పైగా అక్కర్లేని సన్నివేశాలు, స్థాయికి మించిన సన్నివేశాలు చాలా వచ్చి వెళ్లిపోతుంటాయి. ఆఫ్ కోర్స్ హై ఫై కుటుంబాలు, వాళ్ల సంభాషణలు, వాళ్ల ఇళ్లు, వాళ్ల మద్య వ్వవహారాలు అలాగే ఉంటాయి అని సరిపెట్టుకుందామనుకున్నా, సినిమా అన్నది సామాన్యుడి మాధ్యమం కూడా అన్నది విస్మరించలేం. ఆసుపత్రి సీన్ కానీ, హీరోయిన్ ఇంట్లో హీరో సీన్ కానీ జనాలకు అర్థం కావు.

అసలు సినిమా ఎత్తుగడే చిత్రంగా ఉంటుంది. ఉన్నట్లుండి కథానాయిక హీరో వైపు మొగ్గుతుంది. హీరో వైఖరి ఇలాంటిది అని తెలిసిన తరువాత కూడా ఓ అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కు వేస్తూ వుంటుంది. అప్పటికీ కథానాయకుడు తనకు తాను తప్ప, వేరే వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వని టైపు అని దర్శకుడు ఈ సీన్ డైలాగు ద్వారా చెప్పిస్తాడు. ఆ ఒక్క సంభాషణ ద్వారా తప్పిస్తే, జనానికి కథానాయకుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థంకాదు. పైగా మణిరత్నం ఈ సినిమాకు ఓ స్థాయి అంటూ ఉండాలని, కవిత్వం, తమిళ, తెలుగు, హిందీ సంభాషణలు ఇలా ఒకటి కాదు, చాలా రంగరించిపోసేసాడు. అవన్నీ కలిపి ఏదేదో అయింది తప్ప, మంచి సినిమా కాలేకపోయింది. పాకిస్థాన్ జైళ్లలో భారతీయఖైదీలు నరకయాతన అనుభవిస్తారన్నది వాస్తవం. ఈ సినిమాలో కూడా ప్రారంభంలో అలాగే చూపిస్తారు. కానీ తరువాత తరువాత ఆరుబయట తిరిగేస్తూ, సింపుల్ గా కన్నం వేసి బయటకు వచ్చేస్తాడు హీరో.

సినిమా టేకింగ్ విషయంలో కూడా మణిరత్నం చాలా చాదస్తానికి పోయారనుకోవాలి. కాంటెంపరరీ ప్రేక్షకులు ఇంత స్లో, క్లారిటీ నెరేషన్ ను భరించలేరు. అనవసరపు సీన్లు, సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అలాగని హీరో, హీరోయిన్ కు తప్ప మరెవరికైనా సినిమాలో ప్రాధాన్యత వుందా అంటే అదీ లేదు.

ఇలా మొత్తం మీద మణిరత్నం మేథావితనం అంతా రంగరించి పోయడంతో, కామన్ ఆడియన్స్ సుదూరంగా నిల్చునపోయేలా తయారైంది చెలియా.

* ఫైనల్ వెర్డిక్ట్

చెలియా సినిమా మణిరత్నం రోజా లెవెల్ లో వుంటుంది అనుకుంటే, కనీసం అందులో పదో వంతుకు కూడా చేరలేదు. చదవేస్తే ఉన్నమతి పొవడం, వయసు మీద పడితే చాదస్త పెరగడం అంటే ఇదే నేమో?

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.25/5

రివ్యూ బై: శ్రీ

 

ALSO READ: చెలియా ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి