ENGLISH

ద్వారక మూవీ రివ్యూ & రేటింగ్స్

03 March 2017-13:34 PM

చిత్రం: ద్వారక
తారాగణం: విజయ్‌ దేవరకొండ, పూజా ఝవేరి, ప్రకాష్‌ రాజ్‌, మురళీ వర్మ, పృద్వీరాజ్‌ తదితరులు
నిర్మాణం: లెజెండ్‌ సినిమా
సంగీతం: సాయి కార్తీక్‌
నిర్మాత: ప్రద్యుమ్న చంద్రపాటి & గణేష్ పెనుబోతు
దర్శకత్వం: శ్రీనివాస్‌ రవీంద్ర

కథా కమామిషు:

చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ స్నేహితులతో కలిసి సరదాగా లైఫ్‌ని గడిపేస్తుంటాడు శీను (విజయ్‌ దేవరకొండ). హీరోగారు ద్వారక అనే అపార్ట్‌మెంట్‌లో దొంగతనానికి వెళ్ళి, నాటకీయ పరిణామాల మధ్య బాబాగా మారాల్సి వస్తుంది. అతనికి అదే అపార్ట్‌మెంట్‌లో గుడి కూడా కట్టేస్తారు. బాబా గెటప్‌లో నాటకం కొనసాగిస్తే డబ్బులొస్తాయనుకుంటాడు. సరిగ్గా ఈ టైమ్‌లోనే తాను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి కోసం తనవద్దకే తీసుకొస్తారు ఆమె తల్లిదండ్రులు. ఇంకోవైపున బాబాని అడ్డంపెట్టుకుని 2 వేల కోట్ల రూపాయల్ని దోచెయ్యడానికి ఓ ముఠా ట్రై చేస్తుంది. అసలు మనోడు బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు ట్రై చేస్తాడు. ఇన్ని సమస్యల మధ్య హీరో ఎలా తన హీరోయిన్‌ని రక్షించుకున్నాడన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

నటీనటులెలా చేశారు:

'ఎవడే సుబ్రహ్మణ్యం', 'పెళ్ళిచూపులు' సినిమాల్లో మన పొరుగింటి కుర్రాడిలా కన్పించాడు విజయ్‌ దేవరకొండ. నటనలో ఈజ్‌ సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాలో వినోదాన్ని, ఎమోషన్స్‌నీ ఇంకా బాగా పండించగలిగాడు. దొంగ శీనుగా, బాబాగా రెండు విభిన్నమైన గెటప్స్‌లో ఆకట్టుకుంటాడు.

హీరోయిన్‌కి పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఉన్నంతలో బాగానే చేసింది. నేచురల్‌ గ్లామర్‌ హీరోయిన్‌ పూజా జవేరి సొంతం. ప్రకాష్‌రాజ్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. మురళీశర్మ బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

విశ్లేషణ:

చిల్లర  దొంగతనాలు చేసే హీరో బాబాగా మారిన తర్వాత చేసే కామెడీ ఇంకా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాని కామెడీ నేపథ్యంలోనే దర్శకుడు ఎక్కువగా ఆలోచించాడు. దాంతోపాటుగా అక్కడక్కడా ట్విస్ట్‌లు, కొంచెం ఇంటెలిజెన్స్‌ని ప్రదర్శిస్తూ జోడించిన సీన్స్‌ ఇలా ఆడియన్స్‌ సరదాగా నవ్వుకునేలా చేయడంతోపాటుగా, సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు దర్శకుడు. చిన్న సినిమానే అయినా కాస్టింగ్‌ బాగా కుదరడం మరో ప్లస్‌ పాయింట్‌. ఇంటర్వెల్‌ వరకూ సినిమా సరదాగా సాగిపోతుంటుంది. ఇంటర్వెల్‌ తర్వాత ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అయితే అక్కడక్కడా స్లో అయిన భావన కలుగుతుంది. ట్విస్ట్‌లు మరీ ఎక్కువగా ఏమీ లేకపోవడంతో తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓవరాల్‌గా ఎంటర్‌టైనింగ్‌ సినిమా చూశామన్న భావన అయితే సినిమా పూర్తయ్యాక ఆడియన్స్‌లో కలుగుతుంది.

సాంకేతిక వర్గం పనితీరు:

సరదా లైన్‌ని తీసుకుని, ఆకట్టుకునే విధంగా సినిమాని తీర్చిదిద్దడంలో దర్శకుడు తన టాలెంట్‌ని చూపించేందుకు ప్రయత్నించాడు. కథ పరంగా, కథనం పరంగా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా సినిమా స్లో అయినట్లనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సినిమాని సరదాగా నడిపించేయడంలో దర్శకుడు తన సమర్థతను చాటుకున్నాడు. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌. చిన్న సినిమా అనే ఫీల్‌ కలగదు. అంత రిచ్‌గా చూపించాడు సినిమాటోగ్రఫీ. నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.

ఫైనల్‌ వర్డిక్ట్:

చిలిపి చేష్టల 'ద్వారక' పైసా వసూల్‌.

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

రివ్యూ బై: శేఖర్

 

ALSO READ: గుంటురోడు మూవీ రివ్యూ కోసం క్లిక్ చేయండి