ENGLISH

గాయత్రి మూవీ రివ్యూ & రేటింగ్స్

09 February 2018-12:48 PM

తారాగణం: మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియా శరన్,విమల, అనసూయ  
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
ఎడిటర్: MR వర్మ
సంగీతం: తమన్
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం: మదన్ 

రేటింగ్: 2.5/5 

మోహ‌న్ బాబు విల‌క్ష‌ణ న‌టుడు. త‌న‌కు త‌గిన పాత్ర ప‌డాలే గానీ చెల‌రేగిపోతాడు. అయితే గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ప్ర‌యాణం ఆచితూచి సాగుతోంది. పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు, చేసినా అవేం గొప్ప ఫ‌లితాల్ని తీసుకురావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్నుంచి వ‌చ్చిన సినిమా 'గాయ‌త్రి'. ఇందులో మోహ‌న్ బాబు ద్విపాత్రాభిన‌యం చేయ‌డం, విష్ణు, శ్రియ‌లు జంట‌గా న‌టించ‌డంతో... ప్రేక్ష‌కుల దృష్టి ప‌డింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  'గాయ‌త్రి'లో మోహ‌న్ బాబు న‌ట విశ్వ‌రూపం ఏ స్థాయిలో బ‌య‌ట‌ప‌డింది? 

* క‌థ‌..  

దాస‌రి శివాజీ (మోహ‌న్ బాబు) ఓ స్టేజీ ఆర్టిస్టు. ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేసి మంచి పేరు సంపాదించాడు. త‌న భార్య శార‌ద (శ్రియ‌) మ‌ర‌ణంతో ఒంట‌రివాడు అవుతాడు. క‌న్న‌బిడ్డ గాయ‌త్రి (విమ‌ల‌) కూడా చిన్న‌ప్పుడే త‌ప్పిపోతుంది. త‌న భార్య జ్ఞాప‌కాల‌తో శార‌ద స‌ద‌న్ స్థాపించి అనాథ‌ల‌ని చేర‌దీస్తుంటాడు. ఎవ‌రో త‌ప్పు చేస్తే, వాళ్ల స్థానంలో, వాళ్ల వేషంలో జైలుకి వెళ్లి శిక్ష అనుభ‌వించి వ‌చ్చి, ఆ డ‌బ్బుతో అనాథల్ని పెంచుతుంటాడు.  అనుకోకుండా త‌న బిడ్డ ఎదుర‌వుతుంది. తెల్లారితే క‌న్న‌బిడ్డ‌ని చూస్తాడ‌న‌గా... త‌న జీవితం త‌ల్ల‌కిందుల‌వుతుంది. గాయ‌త్రి ప‌టేల్ (మోహ‌న్ బాబు) మ‌నుషులు శివాజీని కిడ్నాప్ చేస్తారు. అస‌లు గాయ‌త్రి ప‌టేల్ ఎవ‌రు?  శివాజీకీ త‌న‌కీ ఉన్న సంబంధం ఏమిటి?  అనేది మిగిలిన క‌థ‌. 

* న‌టీన‌టులు 

మోహ‌న్‌బాబు అటు శివాజీగా, ఇటు గాయ‌త్రి ప‌టేల్‌గా మెప్పిస్తాడు. అయితే గాయ‌త్రి ప‌టేల్‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆయ‌న గెట‌ప్, డైలాగ్ డెలివ‌రీ ఆక‌ట్టుకున్నాయి. 

విష్ణు కూడా మెప్పించాడు. శ్రియ క‌నిపించింది కాసేపే.. అయినా ఆక‌ట్టుకుంటుంది. 

బ్ర‌హ్మానందం, అలీల‌ను స‌రిగా వాడుకోలేదు. పోసాని కాస్త బెట‌ర్‌. మోహ‌న్‌బాబు డామినేష‌న్ అన్ని చోట్లా క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా గాయ‌త్రి ప‌టేల్ గా ఆయ‌న గుర్తుండిపోతారు. 

అన‌సూయ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో క‌నిపించింది. త‌న ప‌ద్ధ‌తికి విరుద్ధంగా సీరియెస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది

* విశ్లేష‌ణ‌

త‌ప్పిపోయిన కూతురు, వెదికే క్ర‌మంలో తండ్రి... క‌లుసుకోబోతున్నార‌నగా ఓ ట్విస్టు.. ఇలాంటి లైన్లు చాలాసార్లు చూశాం. దాదాపుగా గాయ‌త్రి కూడా అదే క‌థ‌. కాక‌పోతే... ద్వితీయార్థంలో గాయ‌త్రి పటేల్ అనే పాత్ర వ‌చ్చి.... ఈ క‌థ‌లో కొత్త ట్విస్టులు తీసుకొచ్చింది.  అయితే అప్ప‌టి వ‌ర‌కూ క‌థ‌, క‌థ‌నాలు చాలా స్లోగా సాగుతాయి. తొలి స‌గం అయితే నీర‌సం రావ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసుకోవ‌డానికి, శివాజీలోని మంచిత‌నాన్ని ఎలుగెత్తి చాట‌డానికీ ఆ స‌గ భాగం స‌రిపోయింది. తండ్రీ కూతుర్ల మ‌ధ్య మ‌రో అడ్డుగోడ వేశాక ఇంట్ర‌వెల్ ప‌డుతుంది. 

ద్వితీయార్థంలో కొంత భాగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ న‌డిచింది. మోహ‌న్ బాబు పాత్ర‌లో విష్ణు క‌నిపించ‌డం మిన‌హా... ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనూ కొత్త‌ద‌నం ఉండ‌దు. తండ్రీ కూతుర్లు ఓ రొటీన్ కార‌ణంతోనే విడిపోతారు. గాయ‌త్రి ప‌టేల్ రాక‌తో క‌థ‌లో జీవం వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ  వేసుకున్న చిక్కుముడుల‌కు అక్క‌డ స‌మాధానం దొరుకుతుంది. గాయ‌త్రి ప‌టేల్ ఆడిన ఆట‌లో.. శివాజీ ఎలా ఆట‌బొమ్మ అయ్యాడ‌న్న‌ది అర్థం అవుతుంది. ఆ స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగానే సాగాయి. గాయ‌త్రి ప‌టేల్‌ని మ‌ళ్లీ చ‌ట్టానికి అప్ప‌గించి శుభం కార్డు వేశారు. మొత్తానికి ఓ రొటీన్ స్టోరీకి... గాయ‌త్రి ప‌టేల్ అనే క్యారెక్ట‌ర్ అండ‌తో న‌డిపించేద్దాం అనుకున్నారు. అయితే ఆ ప్ర‌యత్నం కొంత వ‌ర‌కే స‌ఫ‌లీ కృతం అయ్యింది. తొలి స‌గం ఇంకాస్త ప‌క‌డ్బందీగా రాసుకుని, ఫ్లాష్ బ్యాక్‌లో ఎమోష‌న్ పండిస్తే బాగుండేది.

* సాంకేతికంగా

త‌మ‌న్ నేప‌థ్య సంగీతం ఓమాదిరిగా అనిపిస్తుంది. ఆర్‌.ఆర్‌లో టెంపో మిస్ అయ్యింది. పాట‌లు ఓకే. పొలిటిక‌ల్ పంచ్‌లు బాగా పేలాయి.

నారా చంద్ర‌బాబు నాయుడు పై కొన్ని సెటైర్లు ప‌డ్డాయి. స్పెష‌ల్ స్టేట‌స్ పై కూడా ఓ డైలాగ్ వ‌దిలారు. క‌థ‌లో ఓ కొత్త పాయింట్ ఉంది. దాన్ని స‌రిగా వాడుకోవ‌డంలో మ‌ద‌న్ విఫ‌ల‌య్యాడు. వినోదం పండించ‌డానికి ఛాన్స్ ఉన్నా.. దాని గురించి మ‌ర్చిపోయాడు.  

* ప్ల‌స్ పాయింట్స్‌

+ మోహ‌న్ బాబు న‌ట‌న‌
+ ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్టులు

* మైన‌స్ పాయింట్స్‌

- స్లో నేరేష‌న్‌
- కామెడీ పండ‌క‌పోవ‌డం

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: గాయ‌త్రి ప‌టేల్ వ‌ర‌కూ ఓకే..! 

రివ్యూ బై శ్రీ