ENGLISH

ఇంద్రసేన మూవీ రివ్యూ & రేటింగ్స్

30 November 2017-17:44 PM

తారాగణం: విజయ్‌ ఆంటోనీ, డయానా చంపిక, మహిమ, జ్యుయెల్‌ మ్యారీ, రాధా రవి, కాళీ వెంకట్‌ తదితరులు.
సంగీతం: విజయ్‌ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: దిల్‌ రాజ్‌
దర్శకత్వం: జి.శ్రీనివాసన్‌
నిర్మాతలు: ఫాతిమా విజయ్‌ ఆంటోనీ, రాధికా శరత్‌కుమార్‌
నిర్మాణం: విజయ్‌ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్‌, ఆర్‌ స్టూడియోస్‌

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

విలక్షణమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకుల్నీ అలరిస్తున్న నటుడు విజయ్‌ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడైన విజయ్‌ ఆంటోనీ, నటుడిగా మారి చేస్తున్న సినిమాలు మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. 'నకిలీ' నటుడిగా ఆయనకు మంచి గుర్తింపునిస్తే, 'బిచ్చగాడు' కమర్షియల్‌గా అద్భుతమైన సక్సెస్‌ని విజయ్‌ ఆంటోనీకి అందించింది. అలాంటి విజయ్‌ ఆంటోనీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.


కథా కమామిషు..

కథేంటో చూద్దామిప్పుడు. ఇంద్రసేన, రుద్రసేన (విజయ్‌ ఆంటోనీ ద్విపాత్రాభినయం) కవలలు. ఇంద్రసేన, ఎలిజిబెత్‌ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించినమ్మాయి కళ్ళముందే చనిపోవడంతో మద్యానికి బానిసవుతాడు. రుద్రసేన ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తుంటాడు. రుద్రసేనకు రేవతి (డయానా చంపిక)తో పెళ్ళి కుదురుతుంది. తన స్నేహితుడి కోసం ఇంద్రసేన 6 లక్షలు అప్పు చేస్తాడు. ఆ అప్పు కారణంగా ఇంద్రసేన కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఇంద్రసేన జైలుపాలవుతాడు. ఏడేళ్ళ జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన ఇంద్రసేనకు ఎదురయ్యే పరిస్థితులేంటి? రుద్రసేన ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.

నటీనటులెలా చేశారు..

ఇంద్రసేన, రుద్రసేన పాత్రల్లో విజయ్‌ ఆంటోనీ బాగా చేశాడు. గత సినిమాల్లోలానే విజయ్‌ ఆంటోనీ ఇందులోనూ గంభీరమైన పాత్రల్లోనే కనిపించాడు. నటీనటులెవరూ తెలుగు తెరకి పరిచయం లేనివారే. ఉన్నంతలో వారి వారి పాత్రలకు బాగా చేశారు. 

హీరోయిన్‌ డయానా చంపిక తెలుగు నేటివిటీకి కష్టమే. 

విశ్లేషణ..

తమిళ సినిమాల్ని తెలుగులోకి డబ్‌ చేసి హీరోగా తెలుగునాట కూడా గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ ఆంటోనీ, ఈ సినిమాకొచ్చేసరికి పూర్తిగా తమిళ నేటివిటీనే నమ్ముకున్నట్టున్నాడు. తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఉందీ సినిమా. వినోదం లేకపోవడం ప్రధానమైన మైనస్‌పాయింట్‌. అక్కడక్కడా ఇంట్రెస్టింగ్‌ అనిపించే సన్నివేశాలు సినిమాకి కొంత బలం. భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా 'ఇంద్రసేన' ఫర్వాలేదన్పిస్తుంది.

సాంకేతిక వర్గం పనితీరు

అన్నదమ్ముల కథలో కొత్త కోణం చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. విజయ్‌ ఆంటోనీ సహజంగానే సంగీత దర్శకుడు కావడం అతనికి పెద్ద ప్లస్‌ పాయింట్‌. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌ కూడా ఓకే. అయితే అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త బాగా పని చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

ఫైనల్‌ వర్డ్‌..

ఇంద్రసేన - కొత్త తరహా అన్నదమ్ముల కథ

ALSO READ: 'ఆక్సిజన్' మూవీ రివ్యూ & రేటింగ్స్