ENGLISH

కాటమరాయుడు మూవీ రివ్యూ & రేటింగ్స్

24 March 2017-12:42 PM

తారాగణం: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, అలీ, శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ
బ్యానర్: నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: గౌతంరాజు
చాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిశోరే కుమార్ పార్ధసాని

కథ పాతదే అయినా కానీ పవన్‌ కళ్యాణ్‌ తెరపై కనిపించే సరికి ఫ్యాన్స్‌లో ఉండే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్కే ఈ సినిమాతో మరోసారి పవన్‌ తన ఫ్యాన్స్‌కి కల్గించారు.

*కథా కమామిషు

ఊరి పెద్దగా ఉంటూ, పేదవాళ్లకు అండగా నిలబడే కాటమరాయుడు (పవన్‌ కళ్యాణ్‌)కి నలుగురు తమ్ముళ్లు. జనార్ధన్‌ (కమల్‌ కామరాజు), శివ (శివ బాలాజీ), కొండ బాబు (అజయ్‌), చైతన్య (చైతన్య కృష్ణ). వీళ్లంటే కాటమరాయుడికి ప్రాణం. అయితే కాటమరాయుడికి ఒక వీక్‌నెస్‌ ఉంది. అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి కాటమరాయుడు లైఫ్‌లోకి అవంతిక (శృతిహాసన్‌) ప్రవేశిస్తుంది. మరో పక్క తమ్ముళ్లు నలుగురూ ప్రేమలో పడతారు. వాళ్ల ప్రేమ కోసం తన అన్నయ్యకి అవంతికని దగ్గర చేసేందుకు ప్రయత్నం చేస్తారు తమ్ముళ్లు. అసలీ అవంతిక ఎవరు? ఆమె కథేంటి? ఆమె కాటమరాయుడి జీవితంలోకి అడుగుపెట్టాక రాయుడి లైఫ్‌ ఎలా టర్న్‌ అవుతుంది? తమ్ముళ్ల ప్రేమకథలు ఏమవుతాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

*నటీనటులెలా చేశారు

పవన్‌ కళ్యాణ్‌ ఎలా చేశారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్‌ తెరపై కనిపించారంటే చాలు ఫ్యాన్స్‌కి పూనకం వచ్చేస్తుంది. అలాంటిది ఈ సినిమాలో కాటమరాయుడిగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి పూనకం వచ్చే పాత్రలో కనిపించారు. అది కూడా పంచెకట్టులో చాలా కొత్తగా కనిపించాడు. పవన్‌ పంచెకట్టుకే అందమొచ్చింది పవన్‌ కడితే. అలాగే తన బాడీ లాంగ్వేజ్‌తో పవన్‌ చాలా వినోదం పండించారు. అలాగే ఎమోషనల్‌ సీన్స్‌లో అదరగొట్టేశారు. చాలా చలాకీగా, ఎప్పటిలా కన్నా మరింత అందంగా పవన్‌ కనిపించారు.

హీరోయిన్‌ శృతిహాసన్‌ సినిమాలో అందంగా కనిపించింది. పాత్ర పరిధి మేరకు తన వంతు నటన కనబరిచింది. లవ్‌ సీన్స్‌లో ఆమె అందం మరింత మురిపించింది. నలుగురు తమ్ముళ్లుగా శివబాలాజీ, అజయ్‌, కమల్‌ కామరాజు, చైతన్య కృష్ణ తమ తమ పాత్రల పరిధి వరకూ నటించారు. ఈ నలుగురిలో అజయ్‌కి, శివబాలాజీ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.

టీ కొట్టు బాబాయ్‌ పాత్రలో రావు రమేష్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. రాయలసీమ యాసలో సాగే డైలాగులతో రావు రమేష్‌ అలరిస్తాడు. విలన్‌గా తరుణ్‌ అరోరా ఫర్వాలేదనిపించాడు. పాత్ర పరంగా గంభీరంగా కనిపించాడు. ఇక మిగతా నటీనటుల్లో అలీ వినోదం బాగా పండింది. నాజర్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 
 

*విశ్లేషణ 
 

రీమేక్‌ సినిమానే అయినప్పటికీ పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగా డాలీ కొన్ని కొన్ని మార్పులు చేశాడు. వాటితో పెద్దగా తేడా తెలియనప్పటికీ, లవ్‌ సీన్స్‌లో ఈ మార్పు బాగా తెలుస్తోంది. అలాగే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా పవన్‌ స్టార్‌డమ్‌కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారు డైరెక్టర్‌ డాలీ. ముఖ్యంగా డాలీ పవన్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రథమార్ధం అంతా సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌ కొంచెం స్లోగా అనిపించినప్పటికీ లాస్ట్‌కి వచ్చేసరికి పుంజుకుంటుంది. పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీన్స్‌తో, పాటు బలమైన ఎమోషన్‌ సీన్స్‌తో పతాక సన్నిశేశాలు సూపర్బ్‌ అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో అన్నదమ్ముల మధ్య బలమైన ఎమోషన్స్‌ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మొత్తానికి ఈ సినిమా పవన్‌ ఫ్యాన్స్‌ మెచ్చే సినిమాగా ఫుల్‌ మార్కులేయించుకుంటుంది.
 

*సాంకేతిక వర్గం పనితీరు
 

కథ తెలిసినదే. ఒరిజినల్‌ స్టోరీ నుంచి పెద్దగా డీవియేట్‌ అవలేదు. కథనం పరంగానూ కొత్తదనం ఏమీ చూపించలేదు. సంభాషణలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పల్లెటూరి అందాలను చూపించడంలో ప్రసాద్‌ మూరెళ్ల కెమెరా పనితనం చాలా బాగుంది. పల్లెటూరి వాతావరణం, అందుకు తగ్గ గ్రీనరీ అంతా సినిమాకి తగ్గట్లుగా చూపించడంలో తన ప్రతిభ చూపించారు. అలాగే అనూప్‌ మ్యూజిక్‌ ఒకే. టైటిల్‌ సాంగ్‌కి, జివ్వు జివ్వు సాంగ్‌కీ ధియేటర్లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.
 

*ఫైనల్‌ వర్డిక్ట్:
 

అభిమానులను మెప్పించే కాటమరాయుడు!

యావరేజ్ యుజర్ రేటింగ్: 2.75/5

రివ్యూ బై: శేఖర్

 

 

ALSO READ: Click Here For English Review