ENGLISH

కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌ మూవీ రివ్యూ & రేటింగ్స్

03 March 2017-14:39 PM

తారాగణం: రాజ్ త‌రుణ్‌,అను ఇమ్మానియేల్‌, నాగ‌బాబు, ఫృథ్వీ, అర్బాజ్ ఖాన్
బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: ఏం ఆర్ వర్మ
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
దర్శకుడు: వంశీ కృష్ణ

క్రైమ్ + కామెడీ.. ఓ సూప‌ర్ ఫార్ములా అని మ‌న‌వాళ్లు ఇంకా ఇంకా న‌మ్ముతూనే ఉన్నారు.  ఓ దొంగ‌త‌న‌మో, కిడ్నాపో.. మ‌ర్డ‌రో తీసుకొని.. దాని చుట్టూ కాస్త క‌న్‌ఫ్యూజ‌న్‌ని, కాస్త కామెడీని మిక్స్ చేస్తే.... ఇలాంటి క‌థ‌లు త‌యారైపోతున్నాయి. బ‌డ్జెట్ త‌క్కువ‌, బిజినెస్ ఎక్కువ‌. సో.. లాభ‌దాయ‌క‌మైన వ్య‌వ‌హార‌మే. అందుకే ల‌వ్ స్టోరీలు చేసుకొనే రాజ్ త‌రుణ్‌తో కూడా.. ఓ క్రైమ్ కామెడీ సినిమాని తీసేశారిప్పుడు. అదే కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. మ‌రి ఈ కిట్టు ఎలా ఉన్నాడు??  ఈ బెట్టులో గెలిచాడా??  క్రైమ్ కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యిందా, లేదా?   చూద్దాం.. రండి.

* క‌థ‌

కిట్టు (రాజ్ త‌రుణ్‌). బెసిగ్గా ఓ మెకానిక్‌. అయితే అనుకోకుండా కుక్క‌ల కిడ్నాప‌ర్ అవ‌తారం ఎత్తాల్సివ‌స్తుంది. ధ‌న‌వంతుల ఇళ్ల నుంచి కుక్క‌ల్ని ఎత్తుకు రావ‌డం, ఆ త‌ర‌వాత ఫోన్లు చేసి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ఇదే వాళ్ల దందా.  కిట్టు ల‌క్ష్యం.. డ‌బ్బులు సంపాదించ‌డ‌మే. అయితే కిట్టు వెనుక ఓ ల‌వ్ స్టోరీ ఉంది. జాను (అను ఇమ్మానియేల్‌) అనే అంద‌మైన అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. జాను డ‌బ్బు రూ.25 ల‌క్ష‌లు కిట్టు స్నేహితుడు ఎత్తుకెళ్లిపోతాడు. జాను ముందు త‌ల దించుకోవ‌డం ఇష్టం లేక‌... ఆ డ‌బ్బు కోస‌మే ఇలా కిడ్నాప‌ర్ అవుతాడు.  తాను ప్రేమించిన అబ్బాయి ఓ కుక్క‌ల కిడ్నాప‌ర్ అని తెలుసుకొని, అస‌హ్యించుకొని వెళ్లిపోతుంది జాను. అయితే.. స‌రిగ్గా అదే స‌మ‌యంలో జానుని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. అత‌నెవ‌రు??  జాను ఎలాంటి ప‌రిస్థితుల్లో చిక్కుకొంది?  వీళ్లిద్ద‌రూ ఎలా క‌లిశారు?  అనేదే సినిమా క‌థ‌.

* ఎవ‌రెలా?

రాజ్ త‌రుణ్ ఏం మార‌లేదు. అదే జోష్‌.. అదే న‌ట‌న‌.  బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ.. వీటిలో కొత్త ద‌నం ఏం చూపించ‌లేదు. అయితే త‌న ఎన‌ర్జీతో మాత్రం సినిమాని లాగించేశాడు. ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా బాగా కోప‌రేట్ చేసింది. అను మ‌రింత గ్లామ‌ర్‌గా క‌నిపించింది. ఓ లిప్ లాక్‌తో వేడి పుట్టించింది. స‌ల్మాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ విల‌నా?  లేదంటే... గెస్ట్ ఆర్టిస్టా??  అనిపిస్తాడు. ఫ‌స్ట్ సీన్‌లో క‌నిపించి.. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌ళుక్కుమంటాడంతే. ఆ పాత్ర‌ని స‌రిగా వాడుకోలేదు. నాగ‌బాబు, ఫృథ్వీ ఓకే అనిపిస్తారు. న‌వ్వులు పంచే బాధ్య‌త మ‌రోసారి ఫృథ్వీ తీసుకొన్నాడు.

*  విశ్లేష‌ణ‌

కిడ్నాప్ వ్య‌వ‌హారం చుట్టూ ఓ క‌థ‌ని న‌డ‌ప‌డం కొత్తేం కాదు. అందునా.. కామెడీ జోడించి.  ఇదీ అలాంటి క‌థే. కాక‌పోతే కుక్క‌ల కిడ్నాప్ అనే కొత్త అంశం తెర‌పైకి తీసుకురావ‌డంతో పాత క‌థ‌కి కొత్త ఫ్లేవ‌ర్ అద్దిన‌ట్టైంది. కుక్క‌ల్ని కిడ్నాప్ చేసే విధానం, అందులోంచి పుట్టుకొచ్చిన కామెడీ... టైమ్ పాస్ కి ఢోకా లేకుండా చేస్తాయి. హీరో - హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ ముందు బాగానే ఉన్నా... ఆ త‌ర‌వాత మ‌రీ బోర్ కొట్టించేలా సాగింది. మ‌ధ్య‌లో రేచీక‌టి ఎఫెక్ట్‌తో ఫృథ్వీ, దొంగ బాబాగా ర‌ఘుబాబు న‌వ్వుల్ని పంచేందుకు ప్ర‌య‌త్నించారు. వాళ్ల పాత్ర‌ల నుంచి కామెడీ పిండుకొన్నా.. ఆయా సీన్లు కూడా లెంగ్తీగానే సాగాయి. అయితే ఇంట్ర‌వెల్ ముందు హీరోయిన్ కిడ్నాప్ అవ్వ‌డంతో క‌థ‌లో ట్విస్టు వ‌స్తుంది. అయితే ఈ కిడ్నాప్ చేసిందెవ‌రు? అనే సంగ‌తి ఆ క్ష‌ణ‌మే ప్రేక్ష‌కుడు ఊహించ‌గ‌ల‌డు. ద్వితీయార్థంలో క‌న్‌ఫ్యూజ్ డ్రామా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఆ క‌న్‌ఫ్యూజ‌న్‌తో అర‌డ‌జ‌ను సీన్లు లాగించేశారు. అయితే ఆ త‌ర‌వాత‌.. మ‌ళ్లీ క‌థ‌, క‌థ‌నాలు రొటీన్‌గానే సాగాయి. మ‌ధ్య‌లో ఓ ఐటెమ్ గీతం క‌థా వేగాన్ని మ‌రింత త‌గ్గిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రీ సిల్లీ చేసేశారు. ముందు విల‌న్‌ని భారీ బిల్డ‌ప్పుల‌తో చూపించి.. చివ‌రికి అత‌న్నీ కూడా జోక‌ర్‌గా మార్చేశారు. విల‌న్ డెన్‌లో.. కామెడీ పండించాల‌నుకోవ‌డం ఈ సినిమాకి ప్ర‌ధాన మైన‌స్‌. పైగా క్లైమాక్స్ దాదాపు అర‌గంట సాగింది. క్లైమాక్స్‌లో ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది ముందే ఆడియ‌న్‌కి అర్థ‌మైపోతుంది. అలాంట‌ప్పుడు వీలైనంత త్వ‌ర‌గా శుభం కార్డు వేయాల్సింది. ఐటీ ఆఫీసు నుంచి లాక‌ర్ ఎత్తుకు రావ‌డం  మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది.

* బలాలు

- వినోదం
- రాజ్ తరుణ్
- ఫృథ్వీ కామెడీ

*బలహీనతలు

- లవ్ ట్రాక్
- విలన్
- క్లైమ్యాక్స్

* సాంకేతిక వ‌ర్గ ప‌నితీరు:

అనూప్ అందించిన పాట‌లు అంత క్యాచీగా లేవు. మెలోడీ ఒక్క‌టే ఆక‌ట్టుకొంటుంది. ఆర్‌.ఆర్‌లో మెరుపులూ త‌క్కువే. ఫొటో గ్ర‌ఫీ చ‌క్క‌గా అమ‌రింది. బుర్రా సాయిమాధ‌వ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ డైలాగులూ రాయ‌గ‌ల‌డు అని నిరూపించాడు. కొన్ని కొన్ని ఛ‌మక్కులు అక్క‌డ‌క్క‌డ విసిరాడు.  పాత క‌థ‌నే కొత్త‌గా ప్యాక్ చేసి అందించాడు ద‌ర్శ‌కుడు. ఎంట‌ర్ టైన్‌మెంట్‌కి ఢోకా లేక‌పోవ‌డంతో ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర పాసైపోతుంది. ప‌తాక స‌న్నివేశాల ద‌గ్గ‌ర ఇంకాస్త జాగ్ర‌త్త ప‌డినా.. విల‌న్ పాత్ర‌పై దృష్టి పెట్టినా.. కిట్టు మ‌రింత‌గా న‌చ్చేవాడు.

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌

కిట్టుగాడు.. న‌చ్చేస్తాడు!

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

రివ్యూ బై: శ్రీ