ENGLISH

లై తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్

12 August 2017-18:08 PM

తారాగణం: నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్‌, శ్రీరామ్‌, అజయ్‌, నాజర్‌, రవికిషన్‌, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్‌, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర
నిర్మాణం: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5

కథా కమామిషు..

నితిన్‌ ఈ మధ్యకాలంలో విభిన్న కథాంశంతో తెరకెక్కే సినిమాలవైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలోనే హను రాఘవపూడితో సినిమా చేయడం కూడా ఓ ప్రయోగమే. ఇద్దరి ఆలోచనలూ భిన్నంగా సాగాయి. టీజర్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్‌ అయ్యారు. మేకర్స్‌ రిచ్‌గా ఆలోచించడంతో సినిమా మరింతగా ఎట్రాక్ట్‌ చేసింది. ఇంతకీ 'లై' సినిమాలో ఏముంది? కథలోకి వెళితే, అమెరికాలో ఉండే ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పద్మనాభం (అర్జున్‌) కోసం ఇండియన్‌ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఓ సందర్భంలో దొరికినట్టే దొరికి తప్పించుకున్న పద్మనాభంని పట్టుకునేందుకు దాదాపు 19 ఏళ్ళ తర్వాత పోలీసులకి అవకాశం లభిస్తుంది. పద్మనాభం సంగతలా ఉంచితే, ఎ.సత్యం (నితిన్‌) అమెరికాలో సెటిలైపోవాలనుకునే కుర్రాడు. అలాంటి ఆలోచనలతోనే ఉండే చైత్ర (మేఘా ఆకాష్‌)తో కలిసి సత్యం అమెరికా వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పద్మనాభం, సత్యం మధ్య ఏం జరిగింది? పోలీసులకు పద్మనాభం దొరికాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపై చూస్తేనే తెలుస్తుంది.

నటీనటులెలా చేశారు?

నితిన్‌ తనను తాను స్టైలిష్‌గా మౌల్డ్‌ చేసుకున్న తీరు అద్భుతం. 'ఇష్క్‌' సినిమా నుంచి నితిన్‌లో ఏదో కొత్త మ్యాజిక్‌ కన్పిస్తోంది. ఈ సినిమాలోనూ అదే మ్యాజిక్‌ చూపించాడు. హావభావాల దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ నితిన్‌ని కొత్తగా చూస్తాం. ఎ.సత్యం పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన నితిన్‌, ఈ సినిమాకి పెర్‌ఫెక్ట్‌గా అనిపిస్తాడు. అతని పాత్రలో వంకపెట్టడానికేమీ లేదు.

హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ తొలి చిత్రమైనా బాగా చేసింది. అందంగానూ కనిపించింది, గ్లామర్‌ ఒలకబోసింది, నటనలోనూ మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలున్నాయని తొలి సినిమాతోనే అన్పించుకుంటుంది. తెరపై నితిన్‌ - మేఘా ఆకాష్‌ జంట ముచ్చటగా అనిపిస్తుంది.

ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్స్‌లో అర్జున్‌ గురించి చెప్పుకోవాలి. సీనియర్‌ నటుడు అర్జున్‌ నెగెటివ్‌ రోల్‌లో చాలా బాగా చేశాడు. నటుడిగా తాను ఇన్నేళ్ళలో సాధించిన అనుభవాన్నంతా రంగరించేసి, సరికొత్తగా కనిపించి మెప్పించాడు. మిగతా పాత్రధారులంతా ఓకే.

విశ్లేషణ..

కథ కొత్తగా ఉంటే సరిపోదు, కథనం పరంగానూ ప్రత్యేకత చూపాల్సి ఉంటుంది. ఈ విషయంలో 'లై'కి మంచి మార్కులే పడతాయి. అనుకున్న కథని, అనుకున్నట్టుగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటే బాగుండేదనిపించినా, అది తేడా కొడితే మెయిన్‌ స్టోరీ మీద ఇంపాక్ట్‌ గట్టిగా పడుతుందనుకున్నాడో ఏమో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కాస్త తగ్గించేశాడు. ఆ ఒక్కటీ మినహాయిస్తే, 'లై' ఓ డిఫరెంట్‌ సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులూ అందరూ సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు అనిపిస్తుంది. కథలో లీనమైపోయి, అందులోంచి బయటకు రావడానికి కొంచెం కష్టంగా ఫీలవుతాడు ప్రేక్షకుడు. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నం, స్టైలిష్‌ అప్రోచ్‌తో ఆడియన్స్‌ని మెప్పించారనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు..

సాంకేతిక విభాగం నుంచి ఎంత మంచి సపోర్ట్‌ దొరికితే, దర్శకుడి నుంచి అంత మంచి ఔట్‌ పుట్‌ వస్తుందనడానికి ఈ సినిమాని నిదర్శనంగా చెప్పుకోవచ్చేమో. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరాయి. పాటలు తెరపై చూడ్డానికీ, వినడానికీ బాగున్నాయి. సరికొత్త లొకేషన్స్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్‌ కూడా బాగుంది.

ఫైనల్‌ వర్డ్‌: థ్రిల్లింగ్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌

రివ్యూ బై శేఖర్

ALSO READ: నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ & రేటింగ్స్