ENGLISH

మహానుభావుడు రివ్యూ & రేటింగ్స్

29 September 2017-13:46 PM

తారాగణం: శర్వానంద్, మేహ్రీన్, వెన్నెల కిషోర్
నిర్మాణ సంస్థ: UV క్రియేషన్స్
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: నజీర్
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
రచన-దర్శకత్వం: మారుతీ 

యూజర్ రేటింగ్: 3.25/5 

చిన్న పాయింట్ ప‌ట్టుకొని క‌థ‌లు అల్లుకోవ‌డం ఇప్ప‌టి ట్రెండ్‌. అయితే ఆ పాయింట్ కొత్త‌గా ఉంటే స‌రిపోదు... దాని చుట్టూ అల్లుకొన్న క‌థ కూడా ఆస‌క్తిక‌రంగా సాగాలి. లేదంటే పాయింట్ మాత్ర‌మే మిగులుతుంది. సినిమా షార్ట్ ఫిల్మ్స్‌కి ఎక్కువ‌.. వెండి తెర‌కు త‌క్కువ అన్న‌ట్టు త‌యార‌వుతుంది. మ‌హానుభావుడు కూడా ఓ పాయింట్ చుట్టూ తిరిగేదే. అతి శుభ్ర‌త ఉన్న ఓ ప్రేమికుడి క‌థ ఇది. అత‌ని పాట్లూ, చేసే ఫీట్లతో రెండు గంట‌ల క‌థ న‌డిపించారు. పాయింట్ చూస్తే భ‌లే బాగుంది. మ‌రి సినిమా ఎలా ఉంది??  ఆ పాయింట్‌కి క‌థ‌గా తీర్చిదిద్ద‌డంలో మారుతి ఎంత స‌క్సెస్ అయ్యాడు?  చూద్దాం.. ప‌దండి.

* క‌థ‌..

ఆనంద్ (శ‌ర్వానంద్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. కుర్రాడికి ఓసీడీ ఉంది. అంటే.. అతిశుభ్ర‌త అనే జ‌బ్బు.  శుభ్రంగా లేని చోట క్ష‌ణం కూడా ఉండ‌లేడు. ఏదీ క్లీన్ చేస్తే గానీ ముట్టుకోడు. ఆఖ‌రికి అమ్మ అయినా స‌రే, ఒంట్లో బాగోలేక‌పోతే ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డు. త‌న‌లాంటి ల‌క్ష‌ణాలున్న అమ్మాయినే పెళ్లి చేసుకొందామ‌నుకొంటాడు. ఓ చూయింగ్ గ‌మ్ కోసం పీకిన క్లాస్ చూసి మేఘ‌న (మెహ‌రీన్‌) అనే అమ్మాయి ప్రేమ‌లో ప‌డిపోతాడు ఆనంద్‌.  మేఘ‌న‌కీ.. ఆనంద్ న‌చ్చుతాడు. కానీ త‌న‌కు కుటుంబం అంటే ప్రాణం. నాన్న రామ‌రాజు (నాజ‌ర్‌) అంటే మ‌రీనూ. మా నాన్న‌కి న‌చ్చితే.. నిన్ను నేను చేసుకొంటా అనే కండీష‌న్ పెడుతుంది. మ‌రి రామ‌రాజుకి ఆనంద్ న‌చ్చాడా?  లేదా??  త‌న ప్రేమ‌కోసం ఆనంద్ ఏం చేశాడు?? అనేదే మిగిలిన క‌థ‌.

* న‌టీన‌టులు..

శ‌ర్వానంద్‌కి ఇది మ‌రో మంచి పాత్ర‌. త‌న‌లో కామెడీ టైమింగ్ మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు నీట్‌గా, క్లాస్‌గా కనిపించాడు. అయితే అక్క‌డ‌క్క‌డ నానిని ఇమిటేట్ చేస్తున్నాడా అనిపించింది. మెహ‌రీన్ అందంగా, చ‌లాకీగా క‌నిపించింది. క‌థానాయిక పాత్ర‌కీ క‌థ‌లో ప్రాధాన్యం ఉండ‌డంతో త‌న‌కీ స్కోప్ ద‌క్కింది. నాజ‌ర్ గురించి చెప్ప‌క్క‌ర్లెద్దు. వెన్నెల కిషోర్ మ‌రోసారి న‌వ్విస్తాడు.

* విశ్లేష‌ణ‌..

క‌థ ప్ర‌కారం చూస్తే.. చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. ఓ అమ్మాయి ప్రేమ‌ని గెలుచుకోవ‌డం కోసం అబ్బాయి ఓ ప‌ల్లెటూరు వెళ్ల‌డం, అక్క‌డ ఇంటిల్లిపాదీకి న‌చ్చే ప్ర‌య‌త్నం చేయడం, కుస్తీ పోటీల్లో గెలిచి ప్రేమ‌ని ద‌క్కించుకోవ‌డం.. ఇవ‌న్నీ ఎయిటీస్ కాలం నాటి పాయింట్‌. దాంట్లో అతి శుభ్ర‌త అనే జ‌బ్బున్న కుర్రాడి ని మిక్స్ చేయ‌డం వ‌ల్ల ఈ క‌థ‌కు కొత్త క‌ల‌రింగ్ వ‌చ్చింది. శ‌ర్వానంద్ చుట్టూ, అతని అతి శుభ్ర‌త చుట్టూ న‌డిపిన స‌న్నివేశాలు హాయిగా న‌వ్వించేస్తాయి. కామెడీని బేస్ చేసుకొని రాసుకొన్న ప్ర‌తీ స‌న్నివేశం న‌విస్తుంది. ఫ‌స్టాఫ్ కూల్‌గా సాగితే... సెకండాఫ్ ప‌ల్లెటూరికి షిఫ్ట్ అయ్యింది. అక్క‌డ శ‌ర్వానంద్ చుట్టూ న‌డిపిన సన్నివేశాలు అల‌రిస్తాయి. స్నానం చేయ‌డానికి హీరో ప‌డే పాట్లు, చెరువు ద‌గ్గ‌ర స‌న్నివేశాలు, అన్నం క‌లిపి అంద‌రికీ ముద్ద క‌లిపే సీన్‌... ఇవ‌న్నీ హిలేరియ‌స్‌గా సాగాయి. క‌థానాయ‌కుడు మారాడా?  మారితే ఎందుకు?  బ‌ల‌మైన కార‌ణ‌మేంటి? అనేది రిజిస్ట‌ర్ చేసేలా చెప్ప‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. కుస్తీ పోటీలో గెల‌వ‌డం అనేది మ‌రీ రొటీన్ కాన్సెప్ట్ అయిపోయింది. అక్క‌డ కూడా ఏదైనా కొత్త‌గా ఆలోచిస్తే బాగుండేది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగానే న‌డిచింది. పాట‌లు అడ్డుగోడ‌ల్లా అనిపిస్తాయి. హ్యూమ‌న్ యాంగిల్ వైపు ఆలోచించే అవ‌కాశం ఈ క‌థ‌కు ఉంది. దాన్ని ద‌ర్శ‌కుడు విస్మ‌రించాడు. లేదంటే మ‌రిన్ని బ‌ల‌మైన స‌న్నివేశాలు ప‌డే అవ‌కాశం ఉండేది.

* సాంకేతిక వ‌ర్గం..

త‌మ‌న్ పాట‌లు ట్రెండీగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకొంటుంది.  సినిమా చాలా రిచ్‌గా లావీష్‌గా ఉంది. యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు అడుగ‌డుగునా క‌నిపించాయి. మారుతి క‌థ కొత్త‌ది కాదు. కానీ.. అందులో క‌థానాయ‌కుడి పాత్ర కొత్త‌ది. దాంతో కొత్త స‌న్నివేశాల్ని రాసుకొనే అవ‌కాశం చిక్కింది. కామెడీ పండించే విష‌యంలో మారుతి మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ని చాటుకొన్నాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌..

+ శ‌ర్వానంద్‌
+ ఓసీడీ
+ సంగీతం

* మైన‌స్ పాయింట్స్

- కథంతా ఒకే పాయింట్ చుట్టూ తిర‌గ‌డం
- క్లైమాక్స్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:   క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌

రివ్యూ బై శ్రీ

ALSO READ: ఈ చిత్రం ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి