ENGLISH

MCA మూవీ రివ్యూ & రేటింగ్స్

21 December 2017-13:01 PM

తారాగణం: నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, నరేష్, ఆమని, ప్రియదర్శి తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
రచన-దర్శకత్వం: శ్రీరామ్ వేణు

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

నాని రేంజ్ సినిమా సినిమాకీ పెరిగిపోతోంది. దిల్ రాజు ది ల‌క్కీ హ్యాండ్‌. వీరిద్ద‌రూ క‌లిస్తే.. ఎలా ఉంటుందో నేను లోక‌ల్‌లో చూసేశారు సినీ జ‌నాలు. ఆ సినిమా మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చేసింది. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్ నుంచి ఓ సినిమా వ‌చ్చేసింది. అదే మిడిల్ క్లాస్ అబ్బాయి. అంద‌రికీ రీచ్ అయ్యే టైటిల్ ఇది. దానికి తోడు నాని - సాయి ప‌ల్ల‌విల జోడీ. దాంతో..  ఈసినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ పెరిగిపోయాయి. మ‌రి ఈ కాంబో ఎలా ఉంది?  నానికి మ‌రో హిట్ ద‌క్కిందా, దిల్ రాజు డ‌బుల్ హ్యాట్రిక్ అందుకున్నాడా??  

క‌థ‌.. 

నాని, రాజీవ్ క‌న‌కాల ఇద్ద‌రూ అన్నాద‌మ్ములు. వీళ్ల‌దో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.  రాజీవ్ భ‌ర్త‌గా, నాని వ‌దిన‌గా భూమిక ప్ర‌వేశిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఇంట్లో రారాజులా ఉన్న నానికి వ‌దిన వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ తిప్ప‌లు మొద‌ల‌వుతాయి. భూమిక పెత్త‌నం.. కాస్త ఇబ్బందిగా మారుతుంటుంది. అప్ప‌టి నుంచీ.. వ‌ద‌న మరిదిల పోరు మొద‌ల‌వుతుంది. భూమిక‌కు వ‌రంగ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. వ‌దిన‌కు తోడుగా నాని కూడా వ‌రంగ‌ల్ వెళ్తాడు. అక్క‌డ సాయి ప‌ల్ల‌విని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. వ‌రంగ‌ల్‌లో భూమిక ప‌నిచేసే ఆర్టీవో ఆఫీసులో కొన్ని స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆర్టీవో ఆఫీసుని అడ్డాగా చేసుకొని అక్ర‌మాలు సాగిస్తున్న ఓ గ్యాంగ్.. భూమిక‌పై ప‌గ‌ప‌డుతుంది. వాళ్ల బారీ నుంచి మిడిల్ క్లాస్ మ‌రిది... త‌న వ‌దిన‌ని ఎలా కాపాడుకున్నాడన్న‌ది క‌థ‌.

న‌టీన‌టులు పనితీరు..

నో డౌట్‌... ఇది మ‌రో నాని సినిమా.  తెర ముందు వెనుక ఎంతో మంది ఉన్నా సినిమా మొత్తం నానినే క‌నిపిస్తాడు. నాని  కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఇంకా బాగా క‌నిపించింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో కూడా బాగా న‌టించాడు. 

ఫిదాలో భానుమ‌తిలా ఈసారీ సాయి ప‌ల్ల‌వి రెచ్చిపోతుంది అనుకుంటే జ‌స్ట్ ఓకే అనిపించింది. నాని - సాయి ప‌ల్ల‌వి కెమిస్ట్రీ బాగుంది. 

వ‌దిన పాత్ర‌కు భూమిక‌ని ఎంచుకుని మంచి ప‌ని చేశారు. ఆమె ఈ సినిమాకి క‌రెర్ట్ ఆప్ష‌న్‌.  

విల‌న్ పాత్ర‌ధారి మ‌రీ పీల‌గా క‌నిపించి తేలిపోయాడు. అత‌నికి చెప్పిన డ‌బ్బింగ్ కూడా సెట్ అవ్వ‌లేదు. రాజీవ్‌, ప్రియ‌ద‌ర్శి ఓకే అనిపిస్తారంతే

 

విశ్లేష‌ణ‌.. 

ఈమ‌ధ్య కాలంలో నాని త‌న ఒంటి చేత్తో ఎన్నో సినిమాల‌కు విజ‌యాలు అందించాడు. యావ‌రేజ్ క‌థ‌ సైతం.. నాని  మ్యాజిక్ వ‌ల్ల హిట్లుగా మారిపోయాయి. ఆ న‌మ్మ‌కంతోనే మ‌రో యావ‌రేజ్ క‌థ‌ని నానికి సెట్ చేసేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.  క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌ని
మిడిల్ క్లాస్ అబ్బాయికి నానినే దిక్క‌య్యాడు. తొలి స‌న్నివేశాలు... జోరుగా హుషారుగా నాని స్టైల్‌లో సాగిపోతాయి. అచ్చ‌మైన మిడిల్ క్లాస్ మెంటాల్టీ ఎలా ఉంటుందో నాని త‌న పాత్ర‌తో చూపించాడు. ఆయా స‌న్నివేశాల‌న్నీ మాస్‌కి మ‌రీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ల‌కు బాగా న‌చ్చేస్తాయి.  వ‌దిన మ‌రిదిల గొడ‌వ‌... సాయి ప‌ల్ల‌వితో ల‌వ్ ట్రాక్‌... ఇవ‌న్నీ క‌ల‌సి వినోదానికి ఢోకా లేకుండా చేశాయి. 

ద్వితీయార్థంలో కాన్‌ఫ్లిట్‌ పాయింట్ మిస్ అయ్యింది. ఎప్పుడైతే వ‌దిన మ‌రిదిల మ‌ధ్య విల‌న్ ప్ర‌వేశించాడో అక్క‌డ క‌థ ప‌లుచ‌న ప‌డిపోయింది. విల‌న్ పాత్ర‌, దాని చుట్టూ న‌డిపించిన స‌న్నివేశాలు పేల‌వంగా ఉన్నాయి. పిల్లి, ఎలుక గొడ‌వ‌లా మారిపోయింది. ఆధిప‌త్య పోరుకి సంబంధించిన సన్నివేశాల్ని తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడి స్టామినా స‌రిపోలేదు. ప్ర‌ధ‌మార్థంలో ఉన్న ఫ‌న్ ద్వితీయార్థానికి వ‌చ్చే స‌రికి మిస్ అయ్యింది. సీన్ సీన్‌కీ... సినిమాపై ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంది.  క్లైమాక్స్‌లో ఏదో ట్రై చేసిన‌ట్టు క‌నిపించినా... అది సెకండాఫ్‌కి మ‌ళ్లీ జీవం పోయ‌లేక‌పోయింది. అయితే.. ఇక్క‌డ కూడా నాని న‌ట‌నే కాస్త ఊపిరి పోసేందుకు ప్ర‌య‌త్నించింది. నాని కాకుండా మ‌రో హీరో అయితే... ఈ సినిమా గురించి ఇంత మాట్లాడే అవ‌కాశం కూడా ఉండేది కాదు. పాట‌లు బాగున్నాయి.. అది ఇంకో రిలీఫ్ పాయింట్‌. మొత్తానికి ఓ అరిగిపోయిన క‌థ‌ని.. నాని ఇమేజ్‌తో గట్టెక్కించే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌బృందం.

సాంకేతిక వ‌ర్గం.. 

దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు బాగున్నాయి. టైటిల్ సాంగ్ అదిరింది. ఏవండీ నాని గారు క్యాచీగా ఉంది. రీ రికార్డింగ్ మాత్రం దేవి మ‌న‌సు పెట్టి చేయ‌లేదేమో అనిపించింది. కెమెరా వర్క్‌. డైలాగులు అన్నీ బాగున్నాయి. కాక‌పోతే క‌థ‌, క‌థ‌నం విష‌యంలో ద‌ర్శ‌కుడు త‌ప్పులు చేశాడు.
దిల్‌రాజు సినిమా అంటే ఏదో ఓ కొత్త‌ద‌నం ఉంటుంద‌ని ఆశించి థియేట‌ర్ల‌కు వెళ్లేవాళ్లు క‌చ్చితంగా నిరాశ ప‌డ‌తారు.

ప్ల‌స్ పాయింట్స్‌

+ నాని న‌ట‌న‌
+ భూమిక‌
+ ఫ‌స్టాఫ్‌
+ పాట‌లు

మైన‌స్ పాయింట్స్‌

- విల‌నిజం
- సెకండాఫ్‌

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: మ‌ధ్య‌త‌ర‌గ‌తి చిత్రం. 

రివ్యూ బై శ్రీ

ALSO READ: ఈ చిత్రం ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి