ENGLISH

'మెంటల్ మదిలో' మూవీ రివ్యూ & రేటింగ్స్

22 November 2017-14:27 PM

తారాగణం: శ్రీవిష్ణు, నివేథా పేతురాజ్, అమృత, శివాజీరాజా తదితరులు
నిర్మాణ సంస్థ: ధర్మపాథ క్రియేషన్స్
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: వేదారామన్
ఎడిటర్: విప్లవ్
నిర్మాత: రాజ్ కందుకూరి
రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
షో వివరాలు: స్పెషల్ ప్రీమియర్ షో

యావరేజ్ యూజర్ రేటింగ్:3.5/5

గత ఏడాది జూలై 29న విడుదలైన పెళ్ళి చూపులు చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అలాగే చిత్రపరిశ్రమ ఆలోచనా గమనాన్ని కొద్దిగా పక్కకి చూసేలా చేసిన చిత్రంగా కూడా అభివర్ణించవచ్చు. ఇంత గొప్ప చిత్రాన్ని మనకి అందించిన నిర్మాత రాజ్ కందుకూరి మలి ప్రయత్నమే ఈ ‘మెంటల్ మదిలో’.. ఈ సారి కూడా ఒక యువ దర్శకుడిని పరిచయం చేస్తూ అతడికి తోడుగా ఒక యంగ్ టీంని ప్రోత్సహించడం విశేషం. మరి ఈ ‘మెంటల్ మదిలో’ ఎలా మన మదిని మీటిందో ఈ క్రింద సమీక్షలో చూద్దాం..

కథ...

అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు)- ఇతడికి చిన్నతనం నుండి ఒక మానసిక సమస్య ఉంటుంది. అదేంటంటే- అతని ముందు ఏవైనా రెండు ఆప్షన్స్ పెడితే అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక సతమతమవడం. అలాంటి ఇతనికి స్వేచ్చ (నివేథా పేతురాజ్) తో పెళ్ళి చూపులు జరగడం, ఇద్దరు ఒకరికిఒకరు నచ్చడం జరిగిపోతాయి. ఇక ఈ కన్ఫ్యూజ్ కింగ్ ని ఆ కన్ఫ్యూజ్ నుండి బయటపడేసే ప్రయత్నాల్లో స్వేచ్చ ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి ఎంగేజ్మెంట్ వాయిదా పడుతుంది.

ఆ తరువాత అరవింద్ కృష్ణ ఆఫీస్ పని మీద ఒక నెల ముంబై వెళతాడు, ఒకరోజు అకస్మాత్తుగా స్వేచ్చకి ఫోన్ చేసి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పేస్తాడు అరవింద్. ఇలా ఒక్కసారిగా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ముంబైలో ఏం జరిగింది? ఈ ప్రశ్నలకి సమాధానం వెండి తెరపైన చూడాల్సిందే...

నటీనటుల ప్రతిభ:

శ్రీ విష్ణు: డబల్ మైండ్ తో ఇబ్బంది పడే ఒక సగటు పక్కింటి కుర్రాడిలా శ్రీ విష్ణు చాలా బాగా నటించాడు. ఇక ఈ కథని అతని నిజంగానే తన భుజాల పై మోసాడు అన్నది అక్షరాల నిజం. తనలోని ఒక క్లీన్ నటుడుని ఈ చిత్రంలో చూడొచ్చు.

నివేథా పేతురాజ్: స్వేచ్చ పాత్రలో చాలా స్వేచ్చగా నటించేసింది అని చెప్పాలి. దర్శకుడు ఆలోచనలో ఉన్న పాత్రకి నూటికి నూరుశాతం న్యాయం చేసింది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు తప్పక ఒప్పుకుంటారు.

శివాజీ రాజా: హీరో తండ్రిగా ఈయన చేసిన పాత్రకి థియేటర్లో కచ్చితంగా చప్పట్లు వినిపిస్తాయి. మంచి హాస్యాన్ని అంతకంటే మంచిగా పండించగలిగాడు.

అమృత: సినిమాలో ఈ పాత్రకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. తన వైపు నుండి ఈ పాత్రకి బెస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు.

విశ్లేషణ:

ఒకప్పుడు హీరో అంటే ఎవరినైనా ఎదిరించిగలడు, ఏదైనా సాధించగలడు అన్న దాని నుండి ఇప్పుడిప్పుడే భయపడుతున్న తరుణంలో, యువ దర్శకులు ఆ మారుతున్న గమనాన్ని, ప్రేక్షకుల అభిరుచిని చక్కగా అందిపుచ్చుకుంటున్నారు. ఈ కోవకే చెందిన వాడు ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ.

లైఫ్ లో కన్ఫ్యూజ్ అవ్వడం అనేది చాలా సాధారణమైన అంశం. అలాంటి ఓ చిన్న అంశం పైన సినిమా కథ మొత్తాన్ని నడిపే అంత ధైర్యం చేసిన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయకి అంతటి ధైర్యాన్ని నూరిపోసిన నిర్మాత రాజ్ కందుకూరికి ఒక క్లోజ్ అప్ సెల్యూట్ కొట్టాల్సిందే.

 

కథనంలో ఎక్కడా కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ నుండి పక్కకి జరగకుండా అలాగే తన నటీనటులను సైతం పాత్రలకి ఎంత మేరకు నటన అవసరమో అంతవరకే చేయించుకోవడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.

ఇక మాటల రచయతగా ఈ క్రింది రెండు డైలాగ్స్ చదివితే మీకే తెలిసిపోతుంది-

“రెండిట్లో ఒకటి తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ నిర్ణయం వల్ల ఏది దక్కుతుందో కాదు ఏది కోల్పోవాల్సి వస్తుందో అని చూసుకోవాలి”.

 

“ఎవరు ఇంకొకరి లైఫ్ లో ఆప్షన్ లా ఉండాలని కోరుకోరు”.

ఒక సినిమా చూస్తూ అందులోని పాత్రలని మనతో పోల్చుకోవడం మొదలుపెడితే ఆ సినిమా సగం విజయంతం అయినట్టే! మెంటల్ మదిలో కూడా అలా అందరు అనుకునే చిత్రమే.

సాంకేతిక వర్గం పనితీరు:

ప్రశాంత్ విహారి అందించిన సంగీతం-బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆక్సిజన్ అని చెప్పొచ్చు, అలాగే వేదా రామన్ ఛాయాగ్రహణం ఈ కథకే రంగులు అద్దింది అని చెప్పొచ్చు.

ఆఖరి మాట:

మెంటల్ మదిలో- ‘మది’ ఉన్న వారు అందరు చూడవలసిన సినిమా...

రివ్యూ బై సందీప్

 

ALSO READ: మెంటల్ మదిలో ఇంగ్లిష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి