ENGLISH

ఎం.ఎల్‌.ఎ మూవీ రివ్యూ & రేటింగ్

23 March 2018-13:28 PM

తారాగణం: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్, రవి కిషన్, పోసాని, బ్రహ్మానందం, పృథ్వీ తదితరులు
నిర్మాణ సంస్థ: బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ప్రసాద్ మురేళ్ళ
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాతలు: వివేక్ కూచిబొట్ల, భరత్ చౌదరి, MV కిరణ్ రెడ్డి
రచన-దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్ 

రేటింగ్: 2.75/5

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డం అంత ఈజీఏం కాదు. అందులో కొత్త క‌థేం ఉండ‌దు. కానీ మ్యాజిక్ చేయాలి.  తెలిసిన క‌థ‌నే.. తిర‌గేసి మ‌ర‌గేసి చెప్పే టెక్నిక్ తెలియాలి. లాజిక్కులు ఉండ‌వు.. కానీ మ్యాజిక్ చేసి చూపించాలి. ఇదంతా తెలియాలంటే మాస్ ప‌ల్స్ ప‌సి గ‌ట్టాలి. ఒక‌వేళ ఆ ప‌ల్స్ ప‌ట్టేస్తే.... మిగిలిన విష‌యాల్ని ఈజీగా గ‌ట్టెక్కేయొచ్చు. తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ఆ ప‌ల్స్ ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఎం.ఎల్‌.ఎ సినిమాతో. మాస్, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌పై దృష్టి పెట్టిన క‌ల్యాణ్ రామ్ ఇందులో హీరో. మ‌రి వీరిద్ద‌రి కృషి ఫ‌లించిందా???   మంచి ల‌క్ష‌ణాలున్న సినిమాగా... 'ఎం.ఎల్‌.ఎ' నిల‌బ‌డిందా?

* క‌థ‌ 

క‌ల్యాణ్ (క‌ల్యాణ్ రామ్‌) మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి. త‌న చెల్లికి ప్రేమించి వ్య‌క్తి (వెన్నెల కిషోర్‌)తో పెళ్లి జ‌రిపిస్తాడు. నాన్న నో.. అంటే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు తీసుకొచ్చి వేరే కాపురం పెట్టిస్తాడు. అక్క‌డ ఇందు (కాజ‌ల్‌)ని చూసి ప్రేమిస్తాడు. తీరా చూస్తే... తాను ప‌ని చేసే ఆఫీసుకే బాస్ గా వ‌స్తుంది ఇందు. అయితే.. ఇందుకు ఓ స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అందులోంచి త‌న తెలివితేట‌ల్ని ఉప‌యోగించి గ‌ట్టెక్కిస్తాడు క‌ల్యాణ్‌. ఇందుకు అంత‌కంటే పెద్ద స‌మ‌స్య ఉంద‌ని ఆ త‌ర‌వాతే తెలుస్తుంది. మ‌రి ఆ గండం నుంచి ఇందుని ఎలా కాపాడాడు?  త‌న‌దానిగా ఎలా చేసుకున్నాడు?  క‌ల్యాణ్  ఎం.ఎల్‌.ఎ అవ్వాల‌నుకోవ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటి?  ఎలా అయ్యాడు? అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు

క‌మ‌ర్షియ‌ల్ హీరో అని ముద్ర ప‌డిన త‌ర‌వాత ఇలాంటి సినిమాలు చేయ‌డం చాలా తేలిక‌. క‌ల్యాణ్ రామ్ కూడా ఆడుతూ పాడుతూ చేసేశాడు. అత‌ని స్టైలింగ్ బాగుంది. కాజ‌ల్ కాస్త ముదురు ఫేసుతో క‌నిపించింది. ద్వితీయార్థంలో పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. 

లాయ‌ర్‌గా బ్ర‌హ్మానందం పాత్ర ఆక‌ట్టుకుంది. పోసాని ఓకే. వెన్నెల కిషోర్‌, ఫృథ్వీ న‌వ్వులు పంచారు. ర‌వికిష‌న్‌కి మ‌రోసారి రొటీన్ విల‌న్ పాత్రే దొరికింది.

* విశ్లేష‌ణ‌

మంచి క‌మ‌ర్షియ‌ల్ ల‌క్ష‌ణాలున్న సినిమా ఇది. ప్ర‌తీదీ ఓ మీట‌ర్ ప్ర‌కారం సాగిపోయాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్‌, అత‌ని మంచిత‌నం, చెల్లికి పెళ్లి చేయ‌డం.. ఇవ‌న్నీ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ కోసం పెట్టుకున్న స‌న్నివేశాలు. ఆ త‌ర‌వాత ల‌వ్ ట్రాక్ సుదీర్ఘంగా న‌డుస్తుంది. హీరోయిన్‌కి వ‌చ్చిన స‌మ‌స్య‌ని తీర్చ‌డం ఫ‌స్టాఫ్‌లో హీరో ధ్యేయం. 

అందులో క‌థ‌కు సంబంధించిన బ‌ల‌మైన పాయింట్ ఏం ఉండ‌దు. కేవ‌లం టైమ్ పాస్ సీన్లంతే. సీజీ వ‌ర్క్ ఆధారంగా అజ‌య్‌ని బ‌ఫూన్ చేశాడు క‌ల్యాణ్‌. ఆ సీన్ల‌లో లాజిక్‌ని ప‌ట్టించుకోకుండా.. ఎంట‌ర్‌టైన్‌ని మాత్ర‌మే ఆస్వాదిస్తే న‌చ్చేస్తాయి. లేదంటే... ఈ మాత్రం దానికి స‌గం సినిమా ఎందుకు వాడుకున్నాడు? అనిపిస్తుంది.  కాజ‌ల్ పాత్రతో వ‌చ్చే ట్విస్ట్ మ‌రీ గొప్ప‌గా లేక‌పోయినా.. షాక్ ఇచ్చేదే. కాక‌పోతే... ఆ ట్విస్ట్ అన‌వ‌స‌రం అనిపిస్తుంది. 

కాజ‌ల్ పాత్ర‌ని ఎలా ఇంట్ర‌డ్యూస్ చేసినా.. వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు. ద్వితీయార్థం మొత్తం హీరో ఎం.ఎల్‌.ఏ అవ్వ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల స‌మాహారం. ఫృథ్వీ వ‌ల్ల‌... ఆ ఎపిసోడ్ల‌కు కాస్త ఎంట‌ర్‌టైన్ మెంట్ తోడైంది. అయితే అవ‌న్నీ రొటీన్ సీన్లే. హీరో ఎం.ఎల్‌.ఏ అవుతాడ‌ని తెలుసు... విల‌న్‌ని చ‌ట్టానికి అప్ప‌గిస్తాడ‌ని కూడా తెలుసు. అయితే అదెలా? అనేదే కీల‌కం. 

అక్క‌డ‌క్క‌డ బోర్ కొట్టిస్తూ, కొన్ని చోట్ల ఎంట‌ర్‌టైన్ మెంట్ పంచుతూ... సాగాయి ఆ స‌న్నివేశాలు. ఛైల్డ్ లేబ‌ర్ అనే పాయింట్‌ని తీసుకోవ‌డం, దానికి క‌థ క‌నెక్ట్ ఛేయ‌డం బాగుంది. అక్క‌డ‌క్క‌డ శ్రీ‌నువైట్ల మార్క్‌.. అక్క‌డ‌క్క‌డ కొర‌టాల శివ స్టైల్ క‌నిపించాయి ఈ సినిమాలో.

* సాంకేతిక వ‌ర్గం

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న‌ది కొత్త క‌థేం కాదు. స్క్రీన్ ప్లే ప‌రంగానూ వైవిధ్యం లేదు. అయితే ప్ర‌తీదీ క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ ప్ర‌కారం సాగిపోయాయి. పాట‌లు రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అక్క‌డ‌క్క‌డ పంచ్ డైలాగులు పండాయి. తాగుబోతుల స‌న్నివేశం పేలింది. మ‌ణిశ‌ర్మ పాట‌లు బాగున్నా... వాటి ప్లేస్ మెంట్ మాత్రం అతికించిన‌ట్టు అనిపిస్తుంది. తొలి స‌గంలో వెంట వెంట‌నే పాట‌లు వ‌చ్చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌
+ కాజ‌ల్ ట్విస్ట్‌
+ సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌

- రొటీన్ స్టోరీ
- పాట‌ల ప్లేస్ మెంట్‌

* ఆఖరి మాట: మంచి మాస్ ల‌క్ష‌ణాలున్న సినిమా. 

రివ్యూ రాసింది శ్రీ

ALSO READ: ఎం.ఎల్‌.ఎ మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి