ENGLISH

నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ & రేటింగ్స్

11 August 2017-12:21 PM

తారాగణం: రానా, కాజల్‌ అగర్వాల్‌, కేథరీన్‌, నవదీప్‌, అశుతోష్‌ రాణా, ప్రదీప్‌ రావత్‌, తనికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి దిలీప్‌
దర్శకత్వం: తేజ
నిర్మాత: సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  

యావరేజ్ యూజర్ రేటింగ్: 3/5

కథా కమామిషు...

చాలాకాలం తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజ రూపొందించిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్‌, మళ్ళీ ఇన్నాళ్ళకు తేజ దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. ఇవే కాదు, 'భళ్ళాల దేవుడిగా' 'బాహుబలి'లో నెగెటివ్‌ రోల్‌ పోషించిన రానా, మళ్ళీ ఆ షేడ్స్‌ ఉన్న పాత్రని ఇష్టంగా ఎంచుకుని చేసిన సినిమా. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కథలోకి వెళితే, రాజకీయాల్లోకి వచ్చి, నాయకుడిగా ఎదిగి, అత్యున్నత శిఖరాల్ని అందుకోవాలని కలలు కనడమే కాదు, ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేసే జోగేంద్ర (రానా) కథ ఇది. ఈ క్రమంలో అతనికి భార్య రాధ నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించింది? రాజకీయాల్లో ఎలాంటి కుట్రల్ని అతను ఎదుర్కొన్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే తెరపై చూడాల్సిందే.

నటీనటులెలా చేశారు?

నటుడిగా రానా గురించి కొత్తగా చెప్పేదేముంది? 'బాహుబలి' సినిమాలో రానా నట విశ్వరూపం చూసేశాం. కాబట్టి నటన పరంగా రానాకి వంక పెట్టడానికేమీ లేదు. ఈ తరహా సినిమా రానా ఇంతకు ముందే చేశాడు. అదే రానా తొలి చిత్రం 'లీడర్‌'. దానికీ దీనికీ పోలికలు లేవుగానీ, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ అయితే కామన్‌. అందుకేనేమో కొట్టిన పిండి అన్నట్లుగా జోగేంద్ర పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిజం ఎలివేట్‌ చేస్తూనే, అక్కడక్కడా నెగెటివ్‌ షేడ్స్‌ చూపించగలిగాడు. ఓవరాల్‌గా రానా తనకు టైలర్‌ మేడ్‌ లాంటి పాత్రలో ఒదిగిపోయాడని చెప్పవచ్చు.
గురువు తేజ దర్శకత్వంలో చాలాకాలం తర్వాత సినిమా చేసిన కాజల్‌, ఈ సినిమాలో చాలా అందంగా కన్పించింది. రానాతో తొలిసారి జతకట్టినా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండింది. కేథరీన్‌ గ్లామర్‌ సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పడం నిస్సందేహం. తనికెళ్ళభరణి, ప్రదీప్‌ రావత్‌ తమ పాత్రల్లో రాణించారు. నవదీప్‌, జోగేంద్ర స్నేహితుడిగా కనిపిస్తాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

విశ్లేషణ... 

కొన్ని సీన్స్‌ సినిమాటిక్‌గా అనిపించినా, చాలావరకు సహజంగా అనిపిస్తుంటుంది. రాజకీయాలకు సంబంధించిన ప్రతి సన్నివేశం, ప్రస్తుత రాజకీయాల్లో ఏదో ఒక సందర్భాన్ని గుర్తుకు తీసుకొస్తుంది. అది సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. అయితే ఫస్టాఫ్‌ అంతా సహజంగా సాగిపోతూ, సెకెండాఫ్‌లోనూ అదే కంటిన్యూ అయినా చివరికొచ్చేసరికి వాస్తవ దూరంగా అనిపించడం ఇబ్బందికరమైన విషయం. ఓవరరాల్‌గా సినిమా మంచి పొలిటికల్‌ థ్రిల్లర్‌ని తలపిస్తుంది. కాజల్‌ కన్పించినంతసేపూ, డిఫరెంట్‌ ఫీల్‌ కలుగుతుంది. రాజకీయాల్లో రానాకి సహకరించే పాత్రలో కేథరీన్‌ న్యూ ఫీల్‌ని ఇస్తుంది ఆడియన్స్‌కి. పొలిటికల్‌ డ్రామా, కొంత రొమాంటిక్‌ టచ్‌ వెరసి ప్రేక్షకుడికి మంచి అనుభూతినే మిగుల్చుతుంది.  

సాంకేతిక వర్గం పనితీరు...

ఇలాంటి సినిమాలకి డైలాగ్స్‌ ప్లస్‌ పాయింట్‌ అవుతుంటాయి. తేజ సినిమాల్లో డైలాగుల గురించి కొత్తగా చెప్పేదేముంది? రానా కోసం పొలిటికల్‌ పంచ్‌లు బాగానే పేల్చారు. వాటికి రానా తనదైన మాడ్యులేషన్‌తో మరింత ఎలివేషన్‌ ఇచ్చాడు. సంగీతం సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథ పరంగా చూస్తే మోహన్‌బాబు గతంలో నటించిన 'ఎం ధర్మరాజు ఎంఎ' సినిమాని గుర్తుకు తెస్తుంది. కథనం ఓకే. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులుంటాయి గనుక, ట్విస్ట్‌ల్ని బాగా ప్లాన్‌ చేశారు. అవి బాగా వర్కవుట్‌ అయ్యాయి.

ఫైనల్‌ వర్డ్‌..

నేను రాజు నేనే మంత్రి ఎత్తుకి పై ఎత్తులు బాగానే పేలాయ్‌ 

రివ్యూ బై శేఖర్