ENGLISH

ఒక్కడు మిగిలాడు రివ్యూ రేటింగ్స్

10 November 2017-12:49 PM

తారాగణం: మంచు మనోజ్, అనిశా ఆంబ్రోస్, పోసాని కృష్ణమురళి, అజయ్ ఆండ్రూస్
నిర్మాణ సంస్థ: SNR ఫిలిమ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
ఛాయాగ్రహణం: VK రామరాజు
సంగీతం: శివ నందిగామ
నిర్మాతలు: SN రెడ్డి & లక్ష్మీకాంత్
రచన-దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.5/5

ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పుడే ప్రేక్షకులకి ఇది ఒక రెగ్యులర్ చిత్రం కాదనే ఫీలింగ్ వచ్చేసింది. ఇక చిత్రంలోని పాత్ర కోసం మంచు మనోజ్ బరువు పెరగడం, శ్రీలంకలోని తమిళుల కోసం పోరాటం చేసిన ప్రభాకరన్ పోలిన పాత్ర అవ్వడం, ఈ చిత్ర షూటింగ్ జరిగే సమయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడడం, ఇక విడుదలకి ముందు సరిపడా థియేటర్లు ఇవ్వలేదు అని దర్శకడు ఆవేదన వ్యక్తం చేయడం ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాన్ని ఒక హాట్ టాపిక్ గా మార్చాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది అన్నది ఈ క్రింద సమీక్షలో చూద్దాం..

కథ...

ఒక్కడు మిగిలాడు కథ విషయానికి వస్తే, ఒక యూనివర్సిటీలో ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్యకి పాల్పడతారు. అలా వాళ్ళ మరణానికి కారణం అయిన వారికి శిక్ష పడేందుకు ఆందోళన నిర్వహిస్తుంటాడు అక్కడి విద్యార్ధి నాయకుడు సూర్య (మంచు మనోజ్). ఈ సందర్భంలోనే వారికి న్యాయం జరిగేందుకు చేస్తున్న ప్రయత్నంలో పోలిసుల చేత ఇబ్బందులు పడుతుంటాడు.

ఈ ఆందోళనకి రిపోర్టర్ స్వర్ణ (అనీషా అంబ్రోస్) కూడా సూర్యకి తోడుగా నిలుస్తుంది. ఈ తరుణంలోనే కానిస్టేబుల్ శివాజీ (పోసాని కృష్ణమురళి) కి తాను ఎవరు తన నేపధ్యం ఏంటి అనే విషయాలని పంచుకుంటాడు. అయితే తనకి ఎక్కడో శ్రీలంకలో అక్కడి తమిళ ప్రజలకోసం పాటుపడుతూ ప్రాణాలు విడిచిన పీటర్ (మంచు మనోజ్) కి ఇతనికి ఏంటి సంబంధం అనేది తెరపైన చూడాలి..


నటీనటుల ప్రతిభ...

మంచు మనోజ్: ఈ చిత్రం కోసం బరువు పెరగడం అలాగే తమిళ టైగర్ కమాండర్ పాత్ర కోసం తనని తాను మలుచుకున్న తీరు బాగా ఆకట్టుకుంటుంది. ఇక అదే సమయంలో విద్యార్ధి నాయకుడిగా కూడా తన పరిది వరకు బాగానే చేశాడు.

అనిశా అంబ్రోస్: ఈ పాత్రకి పెద్ద నిడివి లేకపోయినప్పటికీ, ఉన్న సమయంలో బాగానే నటించింది.

పోసాని కృష్ణమురళి: తన పాత్ర పరిది మేరకు బాగానే చేశాడు.

ఇక ఈ చిత్ర దర్శకుడు అజయ్ ఆండ్రూస్, విక్టర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాత్ర చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. దర్శకుడిగా కన్నా నటుడిగానే ఎక్కువ మార్కులు ఈ చిత్రంతో కొట్టేశాడు అని చెప్పొచ్చు.

విశ్లేషణ:

‘శరణార్ధి’ లేక శరణార్ధులు తమ ప్రాణాలు భవిష్యత్తుని కాపాడుకునే ప్రయత్నంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే సమయంలో పడే కష్టాలు, నరకయాతనని దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి చూపెట్టే ప్రయత్నం చేశాడు.

అదే సమయంలో మనిషిలో స్వార్ధం పెరిగిపోవడమే ప్రజలు శరణార్ధులు అవ్వడానికి కారణం అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సినిమాకి తీసుకున్న పాయింట్ కి చాలా స్కోప్ ఉన్నప్పట్టికీ ఆ పాయింట్ ని తెరపై చూపే ప్రయత్నంలో అంతగా విజయవంతం కాలేకపోయాడు. సినిమా ప్రధమార్దంలో ప్రేక్షకులని బాగానే ఎంగేజ్ చేయగలిగిన దర్శకుడు ద్వితీయ భాగానికి వచ్చేసరికి ప్రేక్షకులని చిత్రంతో కనెక్ట్ చేయలేకపోయాడు.

ఇక ఈ చిత్రం మొత్తంలో దర్శకుడు ముఖ్యంగా మనకు చూపెట్టాలి అని అనుకున్న ‘పడవ ప్రయాణం’ ఎపిసోడ్ ఇంకా బాగా తెరకెక్కించాల్సింది. రెండవ భాగం బాగా ల్యాగ్ అవ్వడం కూడా ప్రేక్షకులని ఇబ్బంది పెట్టే అంశం.

అయితే ఇటువంటి చిత్రం కోసం తనకున్న కమర్షియల్ హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి మరీ దర్శకుడు చెబుదామనుకున్న ఒక సీరియస్ టాపిక్ కి తోడు నిలవడం అనేది నిజంగా మనోజ్ కే చెల్లింది. తన పాత్ర చుట్టూ కాకుండా వేరే పాత్ర చుట్టూ కథ తిరిగే కథాంశానికి ఒకే చెప్పిన మనోజ్ గట్స్ కి మెచ్చుకోవలిసిందే.


ప్లస్ పాయింట్స్: 

+ చెప్పాలనుకున్న పాయింట్
+ మనోజ్
+ విక్టర్ పాత్ర
+ నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

- కథనం

ఆఖరి మాట: ‘ఒక్కడు మిగిలాడు’- ఈ చిత్రాన్ని ఇంకా బాగా తీసి ఉండొచ్చు... 

రివ్యూ బై సందీప్