ENGLISH

రోగ్ మూవీ రివ్యూ & రేటింగ్స్

31 March 2017-14:45 PM

తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెల్‌
బ్యానర్: తన్వీ ఫిలిమ్స్
ఎడిటర్: జునైద్
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: సీఆర్ మనోహర్
రచన-దర్శకత్వం: పూరి జగన్నాధ్

* క‌థ ఎలా సాగిందంటే...

చంటి (ఇషాన్‌) క‌మీష‌న‌ర్ కూతురు అంజ‌లి (ఏంజెల్‌)ని మ‌న‌సారా ప్రేమిస్తాడు. కానీ అంజ‌లి మాత్రం ఇంట్లో చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొంటుంది. ఆ పెళ్లిలో జ‌రిగిన గొడ‌వ వ‌ల్ల చంటి జైలు పాల‌వుతాడు. అమ్మాయిలంటే అస‌హ్యం పెంచుకొంటాడు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత మ‌రో అంజ‌లి (మ‌న్నారా)  వ‌స్తుంది?  ఈ అంజ‌లిపై ఓ సైకో (అనూప్ సింగ్‌) మ‌న‌సు ప‌డ‌తాడు. అంజ‌లి కోసం చంటి.. ఆ సైకోతో త‌ల‌ప‌డ‌తాడు. వారిద్ద‌రి మ‌ధ్య పోరాటం ఏ స్థాయిలో సాగింది??   ఓ అంజ‌లి వ‌ల్ల విరిగిన చంటి మ‌న‌సు... మ‌రో అంజ‌లి వ‌ల్ల ఎలా క‌లిసింది?  అనేదే 'రోగ్‌' క‌థ‌. 

* ఎలా చేశారంటే..?

ఇషాన్ కి ఇదే తొలి సినిమా. అయితే తెర‌పై చూస్తుంటే ప‌ది సినిమాల అనుభ‌వం ఉన్న న‌టుడిలా కనిపించాడు. కుర్రాడిలో మంచి ఈజ్ ఉంది. కాస్త షైన్ చేస్తే త‌ప్ప‌కుండా మంచి హీరోగా ఎదుగుతాడు. ఇంత‌కంటే బెట‌ర్ లాంచ్‌.. ఈమ‌ధ్య కాలంలో ఏ హీరోకీ దొర‌క‌దంటే... అది అతిశ‌యోక్తి కాదు. 

ఏంజెల్ చూడ్డానికి బాగుంది. అయితే త‌న‌కంటే మ‌న్నార్‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. పాట‌ల్లో ఇద్ద‌రూ సెక్సీగానే ఉన్నారు. ఇక సైకోగా న‌టించిన అనూప్ సింగ్ అద‌ర‌గొట్టేశాడు. ఢీ.. అంటే ఢీ త‌ర‌హ పాత్ర కావ‌డంతో అనూప్ న‌ట‌న ర‌క్తి క‌ట్టింది. 

పూరి సినిమాల్లో ఎప్పుడూ న‌వ్వులు పండించే అలీ.. ఈసారీ అదే ప‌ని చేశాడు. త‌న కామెడీ అక్క‌డ‌క్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యింది.

* ఎలా తీశారంటే...?

పూరి ఎప్ప‌ట్లా క‌థ‌ని న‌మ్ముకోలేదు. త‌న టేకింగ్‌నీ, త‌న హీరోయిజాన్నీ త‌ప్ప‌!  ఈ సినిమాలోనూ అంతే. పూరి ఎక్కువ‌గా సంఘ‌ట‌న‌లు, సంఘ‌ర్ష‌ణ‌ల‌మీద బేస్ అయ్యాడు. అయితే ఓ మామూలు క‌థ సైతం.. పూరి వ‌ల్ల కొత్త‌గా, అందంగా క‌నిపిస్తుంటుంది. ఫ‌స్ట్ ఆఫ్ చూస్తే క‌చ్చితంగా పూరి మారాడు, త‌న నుంచి మంచి సినిమా వ‌స్తోంద‌న్న న‌మ్మ‌కం క‌లుగుతుంది. ఫ‌స్ట్ ఆఫ్ ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. ప్ర‌తీ స‌న్నివేశం చ‌క‌చ‌క సాగుతుంది. ఇషాన్ పాత్ర‌ని ఎలివేట్ చేయ‌డం కోసం చాలా స‌న్నివేశాల‌నే వాడుకొన్నా... అవి బాగా పండాయి. పూరి మార్క్ డైలాగులు పేల‌డం వ‌ల్ల మాస్ సెంట‌ర్ల‌లో... వర్క‌వుట్ అయ్యే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇంట్ర‌వెల్‌కి ముందు సైకో పాత్ర ఎంట‌ర్ అవుతుంది. విల‌న్‌తో.. హీరో త‌ల‌ప‌డే ఎపిసోడ్‌ని పూరి త‌న‌దైన స్టైల్‌లో తీశాడు. ఇవ‌న్నీమాస్‌కి న‌చ్చేవే. అయితే.. ద్వితీయార్థం మ‌ళ్లీ రొటీన్ అయిపోయింది.  పాత పూరీ సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తొచ్చేస్తాయి. ఫ‌స్ట్ ఆఫ్‌లో చూపించిన క‌మిట్‌మెంట్‌, కొత్త‌ద‌నం రెండో స‌గానికి ఎక్క‌డ‌కి పోయాయో అర్థం కాదు. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు రాసుకొంటే.. థ్రిల్ క‌లిగించే స‌న్నివేశాలు ఉంటే.. నిజంగానే ఈ సినిమా మ‌రో ఇడియ‌ట్‌గా మిగిలిపోయేది. ఈ క‌థ‌ని క‌ల‌కత్తా బ్యాక్ డ్రాప్ లో తీయ‌డం కాస్త క‌లిసొచ్చే విష‌య‌మే. ఎందుకటే అక్కడి లొకేష‌న్ల వల్ల‌.. పాత క‌థ‌కు సైతం కొత్త లుక్ వ‌చ్చింది. దాంతో పాటు ఈసారి పూరి క‌థ‌, క‌థ‌నాల‌పై కాస్త దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే 'జ్యోతిల‌క్ష్మి', 'లోఫ‌ర్‌'ల కంటే బెట‌ర్ అవుట్ పుట్ వ‌చ్చింది.  

పూరి త‌క్కువ రోజుల్లో సినిమా తీసినా, క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌డు. `రోగ్`ని సూప‌ర్ క్వాలిటీతో తీశాడు. సినిమా చాలా చాలా రిచ్‌గా వ‌చ్చింది. సునీల్ కాశ్య‌ప్ పాట‌లు ఓకే అనిపించినా ఇంకాస్త శ్ర‌ర్ధ పెట్టాల్సింది అనిపిస్తుంది. పూరిలో ద‌ర్శ‌కుడి కంటే మాట‌ల ర‌చ‌యిత‌కే ఈసారి ఎక్కువ మార్కులు వేయొచ్చు. చాలా చోట్ల మాస్‌తో ఈల‌లు వేయించే డైలాగులు రాశాడు. మొత్తానికి పూరి నుంచి వ‌చ్చిన బెట‌ర్ అవుట్ పుట్ ఇది. ఇషాన్‌కి మంచి బ్రేక్ దొరికిన‌ట్టే.

*ప్ల‌స్ పాయింట్స్

- ఇషాన్‌
- పూరి డైలాగులు
- మేకింగ్‌

*మైన‌స్ పాయింట్స్

- రొటీన్ క‌థ‌
- ద్వితీయార్థం

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: రోగ్‌... ఓ సారి చూసేయొచ్చు!

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

రివ్యూ బై: శ్రీ

 

ALSO READ: రోగ్ మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి