ENGLISH

విన్నర్ మూవీ రివ్యూ & రేటింగ్స్

24 February 2017-15:21 PM

తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, అనూప్‌ సింగ్‌, ముఖేష్‌ రుషి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృధ్వీ, అలీ, అనసూయ తదితరులు.
నిర్మాణం: లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
సంగీతం: తమన్‌
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2017

కథా కమామిషు:

హార్స్‌ రేసింగ్‌ వ్యాపారంలోలో ఆరితేరిన మహేంద్రరెడ్డి (జగపతిబాబు) తనయుడు సిద్దార్ధ (సాయిధరమ్‌ తేజ). తండ్రిపై ధ్వేషంతో చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు సిద్ద్ధా. ఓ పత్రికకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తున్న సిద్దార్ధ, సితార (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇంకో వైపున సితార తండ్రి రాజీవ్‌ రెడ్డి (సురేష్‌), నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన ఆది (అనూప్‌సింగ్‌)తో పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ఆ పెళ్ళిని ఆపేందుకు వెళతాడు సిద్దార్ధ. ఇంతకీ సిద్దార్ధ, సితార పెళ్ళిని ఆపి, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడా? తండ్రిని సిద్దార్ధ ఎందుకు ధ్వేషిస్తాడు? వంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెరపైనే దొరుకుతుంది.

నటీనటులెలా చేశారు:

సాయిధరమ్‌ తేజ తెరపై ఇంకోసారి హుషారైన పాత్రలో కనిపించాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ పరిణతి సాధించాడు. డాన్సులు, ఫైట్స్‌ విషయంలో చెలరేగిపోయాడు. డాన్సుల్లో 'మెగా' బ్రాండ్‌ని కొనసాగిస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా డాన్సుల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమా సినిమాకీ తన అందాన్నీ, గ్లామర్‌నీ పెంచుకుంటూ పోతోంది. ఈ సినిమాలో ఇంకా అందంగా, గ్లామరస్‌గా కనిపించింది. నటన పరంగానూ మార్కులేయించుకుంటుంది.

జగపతిబాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయన పాత్ర బావుంది. పృధ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ నవ్వులు పూయించారు.

విలన్‌ పాత్రలో అనూప్‌ సింగ్‌ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవడం తప్పనిసరి. సినిమాని చాలా రిచ్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ తన ముద్ర వేశాడు. సంగీతం ఆకట్టుకుంటుంది, నేపథ్య సంగీతమూ బాగుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. ఫైట్స్‌, హార్స్‌ రేసింగ్‌ కోసం చాలా ఎఫర్ట్‌ పెట్టారు. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా వర్క్‌ చేశాయి. ఓవరాల్‌గా టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌ సపోర్ట్‌ దర్శకుడికి బాగానే లభించింది.

విశ్లేషణ

ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, కొంచెం యాక్షన్‌ అన్నీ సమపాళ్ళలో మిక్స్‌ చేశాడు దర్శకుడు. సెకెండాఫ్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గుతుంది. దాంతో పేస్‌ తగ్గినట్లనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంది గనుక, ఉత్కంఠ కూడా పెద్దగా ఉండదు. సెంటిమెంట్‌ సీన్స్‌ కొంచెం సాగదీసినట్లున్నాయనే భావన కలుగుతుంది. సెకెండాఫ్‌లో ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ జొప్పించి ఉంటే సినిమాకి ఇంకా బెటర్‌ రిజల్ట్‌ వచ్చి ఉండేది. విలన్‌కీ హీరోకీ మధ్య కాన్‌ఫ్రంటేషన్‌ ఇంకొచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా సినిమా పైసా వసూల్‌ అనే చెప్పవలసి ఉంటుంది. సినిమాకి జరిగిన పబ్లిసిటీ, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, హీరోయిన్‌ గ్లామర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవన్నీ సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేవే.

ఫైనల్‌ వర్డ్‌:

బాక్సాఫీస్‌ 'విన్నర్‌' అయ్యే అవకాశాలున్నాయ్‌

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

రివ్యూ బై: శేఖర్