ENGLISH

ఉంగరాల రాంబాబు మూవీ రివ్యూ & రేటింగ్స్

15 September 2017-16:16 PM

తారాగణం: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్ తదితరులు..
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ-కథనం-దర్శకత్వం: క్రాంతి మాధవ్

యావరేజ్ రేటింగ్: 2/5

హీరోగా నిలదొక్కుకునే క్రమంలో భాగంగా సునీల్ చేసిన తాజా ప్రయత్నం - ఉంగరాల రాంబాబు. అయితే ఉంగరాల రాంబాబు చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్ అవ్వడంతో ఈ సినిమా పై పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. అయితే మరి ఆ పాజిటివ్ రెస్పాన్స్ స్క్రీన్ పై వెళ్ళాక ఎలా మారిందో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ..

రాంబాబు (సునీల్)కి చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోవడంతో, తన తాతయ్య పెంపకంలో పెరిగి పెద్దవాడవుతాడు. ఉన్నట్టుండి, ఒక రోజు తన తాతయ్య చనిపోవడం, ఇదే క్రమంలో అప్పటివరకు ఉన్న తన ఆస్తిని కోల్పోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో అదృష్టవశాత్తు మళ్ళీ కోటీశ్వరుడు అవుతాడు, ఈ సమయంలోనే సావిత్రి (మియా జార్జ్)తో పరిచయం ఏర్పడి అది ప్రేమ వరకు దారితీస్తుంది. ఇక తమ ప్రేమను చెప్పి పెళ్ళికి ఒప్పించడానికి హీరోయిన్ తో కలిసి ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) వద్దకు వెళతాడు. మరి వారి ప్రేమను సావిత్రి తండ్రి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఈ చిత్ర కథ...

నటీనటులు..

సునీల్: కామెడీ సన్నివేశాలలో నటించడం మెప్పించడం ఈయనకేం కొత్త కాదు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా హాస్యాన్ని పండించే పాత్రనే కావడంతో కాస్త పర్వాలేదనిపించినా మొత్తంగా చూస్తే మాత్రం ఈ కథకి సునీల్ కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే సునీల్ ని ఒక కమెడియన్ గా ఆదరించినంతగా ఒక హీరోగా ఆదరించలేకపోతున్నారు!

మియా జార్జ్: తన పాత్ర వరకు బాగానే చేసింది. పాటల్లో కూడా సునీల్ కి సరిజోడు అనిపించింది.

ప్రకాష్ రాజ్: రంగ నాయర్ అనే కమ్యూనిస్ట్ లీడర్ పాత్రలో మనకు కనిపిస్తాడు. ఆ పాత్ర పరిది మేరకు ఎంత నటిస్తే సరిపోతుందో అంతే నటనని ప్రదర్శించాడు. ఈ పాత్ర పలికే మాటలు ఈ చిత్రం తాలుకా మూలకథని చెబుతాయి.

వెన్నెల కిశోర్, పోసాని తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ..

ఈ సినిమాని చూడాలని ఆశపడ్డ వారిలో సగం మంది సునీల్ కోసం అయితే మరో సగం శాతం దర్శకుడు క్రాంతి మాధవ్ కోసం. కాకపోతే ఈ చిత్రం తను ఇంతకముందు తీసిన ఓనమాలు & మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రాల స్థాయికి చాలా తక్కువలో ఉండడం ఒకరకంగా ఆయన పైన నమ్మకంతో ఈ ‘రాంబాబు’ని చూడడానికి వచ్చినవారికి నిరాశే అని చెప్పక తప్పదు.

భూసేకరణ చట్టం అమలవుతున్న తీరుతెన్నుల పైన ప్రశ్నించడం ఈ కథకి మూల విషయమైతే, అది తెరపైన చూపెట్టే పద్దతి, ప్రయత్నంలో ఆయన విఫలమయ్యాడు. ఇటువంటి కథకి ఎంటర్టైన్మెంట్ ని జోడించి చెప్పే ప్రయత్నంలో ఆయన దర్శకత్వం ఎందుకో వెనకపడిపోయింది.
ఇటువంటి కథకి సునీల్ వంటి హీరోని ఎంచుకొని తప్పు చేశాడా అని కూడా అనిపించిన సందర్బాలు ఈ చిత్రం చూస్తుంటే మనకి అన్పించక మానవు. ఇక కథా వస్తువుగా కమ్యునిజాన్ని వాడుకోవడం అలాగే అది తెరపైన చూపెట్టడానికి కేరళ రాష్ట్రాన్ని ఎంచుకోవడం కూడా కథకుడిగా క్రాంతి మాధవ్ ప్రతిభని మెచ్చుకోవాల్సిందే.

భూసేకరణ వళ్ళ రైతులు ఎదురుకుంటున్న సమస్యలు అదే విధంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ కమర్షియల్ సినిమాలో చెప్పే ప్రయత్నం చేసిన క్రాంతి మాధవ్ ని అభినందించాల్సిందే.

చివరగా...

ఉంగరాల రాంబాబు బోరుకోట్టిస్తాడు...

రివ్యూ బై సందీప్

 

 

ALSO READ: ఈ చిత్రం ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి