ENGLISH

వెంకటాపురం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్

11 May 2017-19:24 PM

తారాగణం: రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్, కాశి విశ్వనాథ్
నిర్మాణ సంస్థలు: గుడ్ సినిమా గ్రూప్ & బాహోమన్య గ్రూప్
సంగీతం: అచ్చు
కెమెరామెన్: సాయి ప్రకాష్
ఎడిటర్: మధు
నిర్మాతలు: తూము ఫణి కుమార్ &  శ్రేయాస్ శ్రీనివాస్
కథ-కథనం-దర్శకత్వం: వేణు మడికంటి 

థ్రిల్ల‌ర్ క‌థ‌లెప్పుడూ చిన్న పాయింట్ చుట్టూనే న‌డుస్తాయి.  ఆ పాయింట్ ఎంత శ‌క్తిమంతంగా, కొత్త‌గా ఉంటే... ఆ చిత్రాలు అంత బాగా ప్రేక్ష‌కుల‌కు చేరువ అవుతాయి. ఈ సూత్రాన్ని న‌మ్మితే.. థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు తిరుగులేదు. ఎందుకంటే ఈ త‌ర‌హా చిత్రాల్ని ఇష్ట‌ప‌డే వ‌ర్గం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సీట్ల అంచున ప్రేక్ష‌కుల్ని కూర్చోబెట్ట‌గ‌లిగే ద‌మ్ము.. ఆ క‌థ‌కీ, సినిమాకీ ఉంటే స‌రిపోతుంది.  ఈవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌.. `వెంక‌టాపురం` కూడా ఓ థ్రిల్ల‌రే. మ‌రి ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంచుకొన్న పాయింట్ ఏంటి?   దాన్ని ఎంత కొత్త‌గా చూపించగ‌లిగాడు??  ఈ సినిమా ఏ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకొంటోంది?  కాస్త వివ‌రంగా తెలుసుకొంటే....

* క‌థ ఎలా సాగిందంటే..?

భీమిలి బీచ్‌లో అమ్మాయిల్ని వేధించి, వాళ్ల‌పై అత్యాచారం చేసే ఓ ముఠా తిరుగుతుంటుంది. చైత్ర (మ‌హిమ‌) కూడా వాళ్ల చేతుల్లో చిక్కాల్సిందే. కానీ ఎలాగోలా త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డుతుంది. కానీ ఆ ముఠా మాత్రం చైత్ర‌ని వెంబ‌డిస్తూ ఉంటుంది. పిజ్జా డెలివ‌రీ బోయ్ ఆనంద్ (రాహుల్) చైత్ర‌ని ఇష్ట‌ప‌డ‌తాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ అదే ఆనంద్‌.. చైత్ర‌ని మ‌ర్డ‌ర్ చేసిన కేసులో పోలీసుల‌కు దొరుకుతాడు. చైత్ర‌ని చంపాల్సినంత అవ‌స‌రం ఆనంద్‌కి ఏం వ‌చ్చింది?  అస‌లు ఈ క‌థ ఎక్క‌డ మొద‌లైంది?  చివ‌రికి ఎక్క‌డికి చేరింది?  అనేదే వెంక‌టాపురం క‌థ‌.

* ఎవ‌రెలా చేశారంటే..?

హ్యాపీడేస్ లో టైన‌స్ పాత్ర‌లో ఇమిడిపోయిన రాహుల్‌.. వెంక‌టాపురం లో ఆనంద్‌గా ఓ కొత్త పాత్ర‌లో క‌నిపించాడు. త‌న బాడీ లాంగ్వేజ్‌, గెట‌ప్‌, న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ అన్నీ ఈ సినిమాతో మారిపోయాయి. ఇంత ఛేంజ్ నిజంగా ఊహించనిదే. వెంక‌టాపురం సినిమాలో తొలి షాక్‌... రాహుల్ న‌ట‌నే. 

మ‌హిమ కూడా ఉన్నంత‌లో ఆక‌ట్టుకొంటుంది. అందం వ‌ర‌కే కాదు.. న‌ట‌న‌లోనూ త‌న ప్ర‌తిభ నిరూపించుకొంది.

అజ‌య్ ఘోష్‌ని తెలుగు చిత్ర‌సీమ స‌రిగా వాడుకోవ‌డం లేదేమో అనిపిస్తుంది.

పోలీస్ పాత్ర‌లో అజ‌య్ విశ్వ‌రూపం చూపించాడు. అజ‌య్ ఎప్ప‌టిలానే మెప్పిస్తాడు. 

* ఎలా తెర‌కెక్కించారంటే...?

వెంక‌టాపురం అనే పోలీస్ స్టేష‌న్ చుట్టూ న‌డిచే క‌థ ఇది. అందుకే ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. థ్రిల్ల‌ర్ క‌థ‌ని న‌డ‌పాలంటే ఓ ఆసక్తిక‌ర‌మైన పాయింట్ ఉంటే చాలు. కానీ ద‌ర్శ‌కుడు అలాంటి పాయింట్లు చాలా రాసుకొన్నాడు. యువ‌తి శ‌వాన్ని చూపిస్తూ.. క‌థ‌ని మొద‌లెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే... ఆస‌క్తి మొద‌లైపోతుంది. ఆ త‌ర‌వాత ఒక్కో సీన్ చ‌క చ‌క ముందుకు క‌ద‌లుతుంటుంది. తొలి భాగం పాత్ర‌ల ప‌రిచయానికీ, కొన్ని చిక్కు ముడులు వేసుకోవ‌డానికి కేటాయించుకొన్నాడు ద‌ర్శ‌కుడు.  ఎప్పుడైతే అస‌లు క‌థ దాచాల్సివ‌చ్చిందో.. అప్పుడు సినిమా స్లో అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. వెంక‌టాపురం ఫ‌స్టాఫ్‌లోనూ అలాంటి ఫీలింగ్ ఎదురైతే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు. కాక‌పోతే.. ద్వితీయార్థానికి వ‌చ్చే స‌రికి ప‌ట్టు తెచ్చుకోగ‌లిగాడు ద‌ర్శ‌కుడు. ఒక్కో ముడిని విప్పుతూ.. అస‌లేం జ‌రిగిందో చెప్ప‌డం బాగుంది. ఈ క‌థ‌ని ఇలానే చెప్పాలేమో అనిపించేంత‌గా స్క్రీన్ ప్లే సాగింది.  ఏ పాత్ర‌నీ ఒకే దృష్టితో చూడ‌లేం. స‌మ‌యాన్ని బ‌ట్టి, ప‌రిస్థితిని బ‌ట్టి పాత్ర‌ల్లోని గ్రే షేడ్స్ బ‌య‌ట‌ప‌డ‌తాయి. దాన్ని చ‌క్క‌గా వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. కొన్ని కొన్ని చోట్ల‌... ద‌ర్శ‌కుడు ఇచ్చిన ట్విస్టులు బాగున్నాయి. క‌థ‌ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో ఆ మ‌లుపులు దోహ‌దం చేశాయి. ప‌తాక స‌న్నివేశాల్ని చూస్తే.. ద‌ర్శ‌కుడిలో ఉన్న ఇంటెన్సిటీ అర్థం అవుతుంది. ఓ థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎలా ముగించాలో అలానే ముగించాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ‌క్క‌డ స్లోఫేస్ కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ.. దాన్ని కాస్త త‌ట్టుకోగ‌లిగితే.. వెంక‌టాపురం థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే ఫ్యాన్స్‌కి త‌ప్ప‌కుండా న‌చ్చేస్తుంది.

* సంగీతం

ఈ సినిమాని ముందుకు న‌డిపించ‌డంలో ఆర్‌.ఆర్ చాలా దోహ‌దం చేసింది. స‌న్నివేశంలోని తీవ్ర‌త ఆర్‌.ఆర్‌తో మ‌రింత స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. పాట‌లు బాగానే ఉన్నా.. ఇలాంటి సినిమాల‌కు పాట‌ల్ని కుదించుకొంటే మంచిది.

* ఛాయాగ్ర‌హ‌ణం

వెంక‌టాపురం ప్ర‌ధాన‌మైన బ‌లాల్లో కెమెరా ప‌నితీరు ఒక‌టి. విశాఖ అందాల్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. చిన్న సినిమా అయినా క్వాలిటీ పరంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంటుంది.

* బ‌లాలు

+ రాహుల్ న‌ట‌న‌
+ ఫొటోగ్ర‌ఫి
+ నేప‌థ్య సంగీతం

* బ‌ల‌హీన‌త‌లు

- స్లోగా సాగిన ప్ర‌థ‌మార్థం
- పాట‌లు

* వెర్డిక్ట్‌: 

స‌స్పెన్స్ సినిమాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు వెంక‌టాపురం పైసా వ‌సూల్ సినిమానే.

యావరేజ్ యూజర్ రేటింగ్: 3.25/5

రివ్యూ బై: శ్రీ

ALSO READ: వెంకటాపురం ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి