ENGLISH

యమన్ మూవీ రివ్యూ & రేటింగ్స్

24 February 2017-15:59 PM

తారాగణం: విజయ్ ఆంటోనీ, మియా జార్జ్, త్యాగరాజన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్ & విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పోరేషన్
మ్యూజిక్: విజయ్ ఆంటోనీ
ఎడిటర్: వీర సెంథిల్ రాజ్
ప్రొడ్యూసర్స్: సుభాస్కరన్ & ఫాతిమా విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ-రైటర్-డైరెక్టర్: జీవ శంకర్

విజయ్ ఆంటోనీ... బిచ్చగాడు సినిమాతో తెలుగులో పాపులర్ అయిపోయిన కథానాయకుడు. అంతకు ముందు విజయ్ నుంచి నకిలీ, డా.సలీమ్ లాంటి సినిమాలొచ్చాయి. కాన్సెప్టులు బాగానే  వున్నా బాక్సాఫీసు దగ్గర మాత్రం సరిగా  ఆడలేదు.  బిచ్చగాడుతో తాను కూడా కమర్షియల్ హీరో అయిపోయాడు. విజయ్ నుంచి  ఓ సినిమా వస్తోందంటే కచ్చితంగా అది కొత్త పాయింటే అయ్యి  వుంటుందని తెలుగు  ఆడియన్స్ ఫిక్సయిపోతున్నారు.  ఈ నేపథ్యంలో తన నుంచి వచ్చిన మరో సినిమా..  ఈ  యమన్.  మరి  ఈ సారీ విజయ్  ఆంటోనీ తన నమ్మకాన్ని నిలబెట్టుకొన్నాడా?   ఈ సినిమా  ఎలా వుంది?

- కథ:

అసోక్ చక్రవర్తి ( విజయ్ ఆంటోనీ)  తన తాతని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో చేయని నేరానికి జైలుకి వెళ్తాడు.  అక్కడే తన భవితవ్యం మారిపోతుంది. కొత్త స్నేహితులు, ప్రత్యర్థులు పుట్టుకొస్తుంటారు.  స్థానిక మాజీ  ఎమ్మెల్యే  కరుణా కరన్ (త్యాగరాజన్)  అండతో రాజకీయంగానూ  ఎదుగుతాడు. చివరికి అతన్నే తొక్కేసి...  ఎమ్మెల్యే అయిపోతాడు.   ఈ ప్రయాణం  ఎలా సాగింది?  అసలు అశోక్  చక్రవర్తి రాజకీయాల్లోకి  ఎందుకు రావాలనుకొన్నాడు??  అనేది తెర పై చూసి తెలుసుకోవాల్సిందే.

- విశ్లేషణ:

ఇదో పొలిటికల్ థ్రిల్లర్.   ఓ సామాన్యుడు అంచెలంచెలుగా  ఎలా  ఎదిగాడు..??  తాను  ఎదుగుతూ తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం  ఎలా తీర్చుకొన్నాడు?   అనేదే కథ.  అయితే  ఈ తరహా కథ, కథనాలు తెలుగు  ఆడియన్స్ కి కొత్తేం కాదు.  ఇదే స్క్రీన్ ప్లేతో,  ఇలాంటి టేకింగ్ తోనే చాలా కథలు వచ్చేశాయి. అయితే విజయ్  ఆంటోనికి మాత్రం  ఇది కొత్త కథే.  ఓ ఆసక్తికరమైన పాయింట్ తో సినిమా ప్రారంభం అవుతుంది. జైల్లో సన్నివేశాలు, అక్కడి నుంచి బయటకు వచ్చిన తరవాత... కథానాయకుడు  ఎదిగే క్రమం  ఇవన్నీ  ఆసక్తి గొలిపేవే.  అయితే.. రాను రాను కథ పట్టు తప్పుతుంది.  సింగిల్ పాయింట్ మీద కథంతా నడవడంతో చూసిన సన్నివేశాలే మళ్లీ చూసినట్టు అనిపిస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అని చెప్పడానికి చాలా చాలా సన్నివేశాలు వాడేశాడు దర్శకుడు.
యే పాత్ర  ఎప్పుడు  ఎలా ప్రవర్తిస్తుంది?  ఎప్పుడు  ఎలా మాట్లాడుతుంది?  అనేది  ఎవ్వరూ  పసిగట్టలేరు. దాంతో  కథ, కథనాల్లో  ఆసక్తి మొదలైనా.. దాన్ని చివరికంటూ కంటిన్యూ చేయలేకపోయాడు దర్శకుడు. అప్పుడప్పుడూ హీరోలోనే విలన్ ఛాయలు కనిపిస్తుంటాయి.  ద్వితీయార్థం పూర్తిగా పట్టు తప్పింది.  పాటలు  కథాగమనానికి అడ్డు తగులుతుంటాయి.  పతాక సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం బాగుంది. 

-  నటీనటులు:

విజయ్  ఆంటోనీ  సింగిల్  ఎక్స్ ప్రెషన్ తో  సినిమాలు చేసుకొస్తున్న కథానాయకుడు. అయితే అందుకు తగిన కథల్ని,  పాత్రల్నీ  ఎంచుకోవడం అతని ప్లస్ పాయింట్. తన వరకూ  ఎప్పటిలా  ఆకట్టుకొన్నాడు.

కథానాయిక  మియా జార్జ్ చేసిందేం లేదు. తన పాత్ర పరిధి చాలా తక్కువ.  త్యాగరాజన్ నటన చాలా సహజంగా వుంది. తన నటన  ఆ పాత్రకు ప్రాణం పోసింది. రాజకీయ నాయకులుగా కనిపించిన ప్రతీ  ఒక్కరూ...  తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

- సాంకేతిక వర్గం:

విజయ్  ఆంటోనీ అందించిన  నేపథ్య సంగీతం తప్పకుండా  ఆకట్టుకొంటుంది. అయితే  పాటలే వినసొంపుగా లేవు.  పాటల ప్లేస్ మెంట్ కూడా కథా గమనానికి అడ్డు తగిలాయి. కెమెరా వర్క్ సూపర్బ్ గా వుంది. సినిమా అంతా  ఒకే టోన్ లో చూపించింది.  మాటలు  ఆకట్టుకొంటాయి.  అయితే పొలిటికల్ పంచ్ లు  ఇంకా పడాల్సింది.  దర్శకుడు  పాత పాయింట్ నే పట్టుకొన్నా,  దాన్ని పూర్తి స్థాయిలో  ఆకట్టుకొనే సినిమాగా మలచలేకపోయాడు.

ప్లస్ పాయింట్స్:

- విజయ్  ఆంటోనీ
- కథా నేపథ్యం
- సంభాషణలు

మైనస్ పాయింట్స్:

- స్లో నేరేషన్
- లాజిక్ వదిలేయడం

ఫైనల్ వర్డ్:

ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో పాలిటిక్స్ ఎక్కువగా థ్రిల్ తక్కువ.

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.25/5

రివ్యూ బై: శ్రీ
 

 

 

 

ALSO READ: Qlik Here To Read The English Review of Yaman