ENGLISH

ఏ మంత్రం వేసావె మూవీ రివ్యూ & రేటింగ్స్

09 March 2018-15:25 PM

తారాగణం: విజయ్ దేవరకొండ, శివాని సింగ్
నిర్మాణ సంస్థ: గోలిసోడ ఫిలిమ్స్
కథ-కథనం: శ్రీధర్
నిర్మాత-దర్శకుడు: శ్రీధర్

రేటింగ్: 1.75/5

అర్జున్ రెడ్డి చిత్రంతో ఎంతోమంది కలలుగనే స్టార్ డంని సొంత చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ప్రేక్షకుల పైన చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇక విజయ్ కి అంతటి క్రేజ్ వచ్చాక విడుదలవుతున్న చిత్రం- ఏ మంత్రం వేసావె. ఇక ఈ చిత్రాన్ని హీరో విజయ్ ప్రచారం చేయకపోయినప్పటికీ దీనిపైన అయితే కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలని ఈ చిత్రం అందుకుండా లేదా అనేది ఈ క్రింద సమీక్షలో చూద్దాం..

కథ:

నిక్కి (విజయ్) బయట ఉన్న ప్రపంచం కన్నా వీడియో గేమ్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ లోనే కిక్ దొరుకుతుంది అని 24 గంటలు ఇంటర్నెట్ లోనే గడిపే కుర్రాడు. క్లుప్తంగా చెప్పాలంటే- సోషల్ మీడియా, వీడియో గేమ్స్ కి బానిస.

ఇతనికి సోషల్ మీడియాలో ర్యాగ్స్ (శివాని సింగ్) తారసపడుతుంది. ఆమెతో స్నేహం చేయాలని చాలా ప్రయత్నాలే చేస్తాడు. అయితే వీటిని అస్సలు పట్టించుకోకుండా నిక్కిని దూరంపెడుతుంది. ఇక ఒకరోజు నువ్వంటే ఇష్టం, నీతో స్నేహం చేయాలి అని పట్టుపడతాడు నిక్కి. ఈ సమయంలోనే నిక్కికి ఒక రియల్ టైం గేమ్ పెడుతుంది ర్యాగ్స్.

మరి ఆ గేమ్ లో నిక్కి గెలుస్తాడా? నిక్కిని కలుస్తాడా? వీటికి సమాధానం వెండితెర పైన చూడాలి..

నటీనటుల పనితీరు: 

విజయ్ దేవరకొండ: ఇతని నుండి ఎంతో ఆశించి వెళ్ళిన ప్రేక్షకులకి కచ్చితంగా నిరాశకి గురవుతారు. అతను పోషించిన పాత్రలో పెద్దగా అభినయించడానికి అవకాశం లేకపోవడం, కథనంలో బలం లేకపోవడం పెద్ద మైనస్ గా మారిపోయింది. ఒక్కోసారి అర్జున్ రెడ్డి పాత్ర చేసింది ఇతనేనా అనే డౌట్ కూడా రావొచ్చు.

శివాని సింగ్: ఈ అమ్మాయి నటనపరంగానే కాకుండా తెరపైన కనిపించడంలో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక మిగతా తారాగణం ఉన్నా కూడా లేనట్టే అని చెప్పొచ్చు.

విశ్లేషణ:

ఈ చిత్రానికి రచయత-దర్శకుడు అయిన శ్రీధర్, ఈ రెండు శాఖలలోను ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలు అలాగే దాని ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయి అన్న అంశాన్ని తెరపైన చూపెట్టే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇది ప్రేక్షకులకి చూపెట్టే విధానంలో విఫలమయ్యాడు.  

బలహీనమైన కథనం దీనికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దీనివల్ల నటీనటులకి కూడా నటించేందుకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. పాటలు గాని, కెమెరా పనితనం గాని ఏమి కనపడలేదు. జనరల్ సబ్జెక్ట్ ని కమర్షియల్ గా చెప్పాలనుకునే ప్రయత్నంలో దర్శకుడు చాలా పొరపాట్లు చేశాడు. ఇక బలహీనమైన కథనం వల్ల కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల ఓపికకి పరీక్ష పెడతాయి.

ప్లస్ పాయింట్:

+ చెప్పాలనుకున్న పాయింట్

మైనస్ పాయింట్స్:

- చాలా ఉన్నాయి

ఆఖరి మాట: నిరాశ పరుస్తుంది.

రివ్యూ రాసింది సందీప్.

 

ALSO READ: Qlik Here For Ye Mantram Vesave English Review