ENGLISH

అక్షయ్‌ కుమార్‌ నిజంగా 'గ్రేట్ మ్యాన్‌'

15 December 2017-17:41 PM

మగవారు ఆ మాట ఎత్తడానికే ఇష్టపడరు. ఇష్టపడడం ఏంటి. అదో పాపంలా పరిగణించే దేశం మనది. అదే మహిళల సాధారణ సమస్య 'రుతుక్రమం'. సమాజంలో ప్రతీ మహిళ ఎదుర్కొనే అతి సాధారణ సమస్య ఇది. ఈ సమస్య కథాంశంగా ఓ సినిమా తెరకెక్కుతోందంటే ఆశ్చర్యకరమైన విషయమే కదా. అందులో బాలీవుడ్‌ అగ్రకధానాయకుడు అక్షయ్‌ కుమార్‌ నటిస్తుండడం మరో గొప్ప విశేషం అని చెప్పక తప్పదు. మొన్నీ మధ్యనే మహిళల మరుగుదొడ్ల సమస్యపై 'టాయిలెట్‌ - ఏక్‌ ప్రేమ్‌కథ' చిత్రంలో నటించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు.

అలాంటిదే ఇప్పుడు చేస్తున్న మరో ప్రయోగం. అదే 'ప్యాడ్‌మాన్‌' చిత్రం. ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 'అమెరికాలో స్పైడర్‌ మ్యాన్‌, బ్యాట్‌ మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌..' ఉన్నారు. కానీ మా ఇండియాలో 'ప్యాడ్‌మ్యాన్‌' ఉన్నాడు..' అంటూ అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌తో ఈ సినిమా ట్రైలర్‌ స్టార్ట్‌ అయ్యింది. దేహ ధారుడ్యం ఉంటే దేశం బలంగా మారదు. ఓ మహిళ, అమ్మ, సోదరి బలంగా ఉంటేనే దేశం బలంగా మారుతుంది.. అని అక్షయ్‌ కుమార్‌ చెప్పే డైలాగ్‌ అందర్నీ ఆలోచించేలా చేస్తుంది. అరుణాచలం మురుగనాధమ్‌ అనే తమిళనాడుకు చెందిన సామాజిక వేత్త జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది.

సమాజంలో సినీ ప్రముఖులకే సామాజిక బాధ్యత కాస్త ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మొదటి స్థానం సినిమాకే ఉంటుంది. కానీ కమర్షియల్‌ ముసుగులో పడి సామాజిక బాధ్యతని సినీజనం విస్మరిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి ప్రయోగాలతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ తరహా కధాంశాన్ని ఎంచుకోవడం, అందులో నటించేందుకు ఒప్పుకోవడంతోనే విజయాన్ని పొందాడు అక్షయ్‌కుమార్‌. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Qlik Here Padman Official Trailer