ENGLISH

'పద్మావత్‌' రచ్చ: చంపేస్తాం లేదంటే చచ్చిపోతాం

19 January 2018-16:46 PM

మరికొద్ది రోజుల్లో 'పద్మావత్‌' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. డిశంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనలతో విడుదల ఆలస్యమైంది. పలు రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి. 

సుప్రీంకోర్డు ఆయా రాష్ట్రాల నిషేధాన్ని మందలించింది. దాంతో వివాదాలు తొలిగాయన్న తరుణంలో సినిమాని రిలీజ్‌కి సిద్ధం చేసింది చిత్ర యూనిట్‌. అయితే సినిమా విడుదల చేస్తే, దర్శకుడి చితికి నిప్పంటిస్తామంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన మహిళలు ఆందోళనకు దిగారు. ఈ సారి మహిళలు రంగంలోకి దిగడంతో, 'పద్మావత్‌' విడుదల దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా, సినిమా విడుదలయ్యాక సినిమాలో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే ధియేటర్లు తగలబెడతామంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసింది. 

సినిమా యూనిట్‌ మాత్రం కోర్టు అనుమతించింది కాబట్టి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎలాంటి అడ్డంకులు లేకుండా, సినిమాని అనుకున్న టైంకి అంటే ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనీ ప్రకటించింది. రాజ్‌పుత్‌ కర్ణిసేన హెచ్చరికలతో ధియేటర్స్‌కీ, ఈ సినిమా యూనిట్‌కీ, ప్రధాన తారాగణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలనీ సుప్రీంకోర్టు ఆదేశించింది. 

సాధారణంగా సినిమాలపై వ్యతిరేకత ఉన్నప్పుడు చంపేస్తామనే హెచ్చరికలు మామూలే. కానీ ఆత్మాహుతికి పాల్పడతామనే హెచ్చరిక మాత్రం 'పద్మావత్‌' విషయంలో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, చరిత్రలోకి తొంగి చూస్తే, రాజ్‌పుత్‌ రాణి పద్మినీ దేవి, తన భర్త యుద్ధ క్షేత్రంలో మరణించడంతో, తాను, తన అంతపురంలోని మహిళలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడుతుంది. అందుకేనేమో ఈ ఆత్మాహుతి హెచ్చరిక అంతగా భయపెడుతోంది.

ALSO READ: యాంకర్ ప్రదీప్ కి శిక్ష ఏంటో తెలుసా?