ENGLISH

రామ్‌గోపాల్‌ వర్మ 'కడప' రక్త చరిత్ర చూశారా?

15 December 2017-18:07 PM

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాని మర్చిపోలేము. రాయలసీమ ఫ్యాక్షన్‌ని రెండు పార్ట్‌లుగా విడుదల చేసి ఈ సినిమాతో సంచలనం సృష్టించాడు వర్మ. మళ్లీ ఇలాంటి ఫ్యాక్షన్‌ కథాంశంతోనే రామ్‌ గోపాల్‌ వర్మ ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించారు. ఆ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇటీవల 'గన్స్‌ అండ్‌ థైస్‌' పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించిన వర్మ, ఆ తర్వాత తీస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇదే. వర్మ తీసిన తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. తాజాగా వచ్చిన ఈ సిరీస్‌ ట్రైలర్‌ ఇప్పుడు హాట్‌ న్యూస్‌ అయ్యింది.

ఈ సిరీస్‌లో నూటికి నూరు శాతం నిజాలే చెబుతానంటూ వర్మ వెల్లడించారు. ఫ్యాక్షన్‌ చావులు ఎంత ఘోరంగా ఉంటాయో ట్రైలర్‌లో చూపించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే, ఇక సిరీస్‌ మొత్తం చూస్తే ఇంకెంత జుగుప్సాకరంగా ఉండనుందో. ఇందులో అందర్నీ కొత్త నటీనటులనే తీసుకున్నారు వర్మ. ఓ లేడీ పాత్రతో చెప్పించిన డైలాగ్‌ మరీ ఘోరంగా ఉంది. అయినా వర్మ సినిమాల్లో ఇలాంటివి కొత్తేమీ కాదు. మరో పక్క వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నాగార్జున 'హలో' సినిమా ప్రమోషన్స్‌లో ఉండడంతో ఈ సినిమా షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. వర్మ సొంత బ్యానర్‌ 'కంపెనీ'లో ఈ సినిమా నిర్మితమవుతోంది. మరో పక్క 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా కూడా వర్మ తెరకెక్కించాల్సి ఉంది. ఈ సినిమా నటీనటుల వివరాలు వర్మ ఇంకా వెల్లడించలేదు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభం కానుందని వర్మ గతంలోనే చెప్పారు. చూడాలి మరి.

ALSO READ: Qlik Here Kadapa Web Series Trailer