ENGLISH

కామెడీ ఎంటర్‌టైనర్‌లో రెజినా

19 May 2017-19:10 PM

తెలుగు, తమిళంతో పాటు, హిందీలో కూడా సినిమాలు చేస్తూ ముద్దుగుమ్మ రెజీనా ఫుల్‌ బిజీగా గడుపుతోంది. తాజాగా 'హరే రామ హరే కృష్ణ' పేరుతో ఓ సినిమా నిర్మితమవుతోంది. ముద్దుగుమ్మ రెజినా ఇందులో హీరోయిన్‌గా ఎంపికైంది. దిలీప్‌ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్నాడు. అర్జున్‌ సాయి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం. పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌ అట ఈ చిత్రం. రొటీన్‌కి భిన్నంగా వెరైటీ కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూనే, రొమాంటిక్‌గా కథ నడిపిస్తానని దర్శకుడు అంటున్నాడు. సినిమా విడుదలకి ముందే సినిమా కథ కోసం ఇంత కొత్తగా చెబుతూ, డైరెక్టర్‌ అర్జున్‌ సాయి సినిమాపై ఇంట్రెస్ట్‌ కల్గిస్తున్నాడు. కామెడీ సినిమాలు ఇంతవరకూ చాలానే వచ్చాయి. వాటన్నింట్లోకీ ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందంటున్నాడు. ప్రకాష్‌రాజ్‌, ఆమని, కృష్ణభగవాన్‌ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. సినిమా ప్రమోషన్‌ కోసం విడుదల చేసిన స్టిల్స్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందాల భామ రెజినా, ఈ సినిమా కథ తనకు చాలా బాగా నచ్చిందని చెబుతోంది. ఎంతో ఇష్టపడి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానంటోంది. ఇంతవరకూ నటించిన పాత్రల్లోకెల్లా ఈ పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని అంటోంది. కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాతోపాటుగా తమిళంలో ఓ సినిమా చేస్తోంది రెజినా. ఈ 'హరే రామ హరే కృష్ణ' సినిమాకి సంబంధించినంతవరకు రెజినానే హైలైట్‌ పాయింట్‌గా చెబుతున్నారు. 

 

ALSO READ: `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M`లో 'జార్జ్'గా కిషోర్