ENGLISH

సమాజంపై 'గన్స్ అండ్ థైస్' ప్రభావం

27 May 2017-14:20 PM

నెల క్రితం వరకు ఆర్జీవీని కలుద్దామనో, దగ్గరౌదామనో, జర్నీ కొనసాగిద్దామనో ప్రయత్నించి విఫలమైన కొందరు "దశాబ్దం క్రితమే ఆయన పని అయిపోయిందండీ" అంటూ నిట్టూరుస్తున్నవారు ఉన్నారు. మరి పదేళ్ల క్రితమే పని అయిపోయినవాడితో నెల క్రితం వరకు నువ్వెందుకు పని చేద్దామనుకున్నవ్? అంటే ఆన్సర్ ఉండదు. అందని ద్రాక్ష పులుపు సామెత గుర్తొచ్చేది ఇక్కడే.

"సర్కార్ 3 ఫ్లాప్ అయ్యింది కదా. ఏంటి పరిస్థితి?" ఇదొక ప్రశ్న. అడిగినవాడు కచ్చితంగా సమాధానంలో బాధో, నిరాశో, నిస్పృహో కోరుకుని ఉంటాడు. నిజమని చెప్తున్నా కొందరు నమ్మరు కానీ అసలు ఆర్జీవీ క్యాంపులో వాటికి స్థానం ఉండదు. అందుకు కారణం "స్థితప్రజ్ఞత" లాంటి పెద్ద పదం వాడను కానీ...ఎప్పుడూ ఏ ఫ్లాప్ కూడా ఆయన కెరీర్ ని ప్రభావితం చెయ్యలేదు. తర్వాతి సినిమాలకి గ్యాప్ రాలేదు. కొత్త ప్రొడ్యూసర్ల తాకిడి ఆగలేదు. కంపెనీలో ఉన్నవాళ్లకి పని తగ్గలేదు. ఈ డైనమిక్స్ ఎకనామిక్స్ కి, ఆవెరేజ్ బ్రెయిన్స్ కి అర్థం కావు. ఆమాట కొస్తే కంపెనీలో కొత్తగా చేరినవాళ్లు కూడా ఆలోచించి అంతు చిక్కక ఆ విషయాలు ఆలోచించడం మానేసారు. కాబట్టి ప్రాక్టికల్ గా చూస్తే ఫ్లాప్ అనేది ఆర్జీవీ కంపెనీలో ఒక పదం మాత్రమే. దానికి రంగు, రూపం, వాసన, చిక్కదనం లాంటివి లేవు. ఎవర్నీ తాకవు. ఆర్జీవీ రిజల్ట్ కంటే ప్రోసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ని ఎంజాయ్ చేస్తారు. నెమ్మదిగా ఆ గుణం ఆయనతో ఎక్కువనాళ్లు పని చేసినవారికి సహజంగా వచ్చేస్తుంది.

అది తీసి పక్కనపెడితే, "అవే కథలు తిప్పి తిప్పి చెబుతున్నాడు" అనేది ఆర్జీవీపై ఇంకో విమర్శ. దానికి ఆన్సర్ ఉంది. ఎవరికి ఏ సెన్సిబిలిటీ ఉన్నా అది వాళ్ల డీ.ఎన్.ఏ ని బట్టి ఉంటుంది. దానిని మార్చడం సాధ్యం కాదు. సెన్సిబిలిటీని బట్టే క్రియేటివిటీ కూడా ఉంటుంది.

"తెలుగులో తీసినవే కాస్త మార్చి హిందీలో తీసాడు..ఏంటి గొప్ప" అని అలనాటి ఒక సుప్రసిధ్ధ దర్శకుడి నుంచి మరో స్టేట్మెంట్. దానికి నా అన్సర్, "మీ కథలు మారనప్పుడు, మీ ఆడియన్స్ ని మార్చుకోగలిగే శక్తి ఉండాలి. అది ఆర్జీవికి ఉంది (మీకు లేదు). తెలుగులో చెప్పేశాక హిందీలో, అదీ అయిపోయాక ఇంగ్లీషులో, బోరు కొడితే జెర్మన్ లో, తిక్కపుడితే రష్యన్లో, చిరాకు పుడితే భోజ్పురీలో అవే కథలు చెప్పి అక్కడి జనం చేత చప్పట్లు కొట్టించుకోగలడు ఆయన" అన్నాను.

ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చింది. ఆర్జీవి తీసిన "గన్స్ అండ్ థైస్" వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చింది. దాని ప్రొడ్యూసర్ జెర్మన్. స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచుల్లో డబ్ అయ్యి నానా ప్రపంచ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఆ ట్రైలర్ని షాక్ ఫ్యాక్టర్తో చూసినవాళ్ల నుంచి, చూసి లబోదిబో మని గుండెలు బాదుకున్నవాళ్లూ ఉంటారు. "ఇంతిలా దిగజారిపోవాలా" అనేది ఒక వర్గం ప్రజల మనోభావం. ఆ అభిప్రాయం వాళ్ల డీ.ఎన్.ఏ ప్రభావం వల్ల వచ్చిందే! అయితే వాళ్లల్లో 90 శాతం మంది 35-45 ఏజ్ గ్రూపులో ఉన్నవాళ్ళే. ఆ ఏజ్ గ్రూప్ ఫ్యాన్స్ ని ఆర్జీవి కోల్పోవచ్చు. కానీ 18-25 ఏజ్ గ్రూపులో ఉన్న కొత్త జెనెరేషన్ కనెక్ట్ అవ్వొచ్చు. ఆర్జీవీకి కావాల్సింది కూడా అదే అని నా ఫీలింగ్.

ఇక ఆశ్చర్యకరంగా "గన్స్ అండ్ థైస్" ట్రైలర్ చూసిన ఒక యువదర్శకుడు, "కామన్ ఆడియన్స్ తాము చెయ్యలేని పనిని తెరమీద హీరో చేస్తుంటే చూసి ఈలలు వేస్తారు. అలాగే మేము చేయలేమనుకున్న పనిని ఆర్జీవీ చేస్తున్నందుకు ఈలలు వేస్తున్నాం" అన్నాడు. ఇది ఇంకో యాంగిల్ మరి!

"అంతలా బూతులు, న్యూడిటీ చూపించేశాడేంటి? ఫిల్మ్ మేకింగ్ ఎటు పోతుందో?" ఇదొక కామెంట్. నిజానికి తెరమీద న్యూడిటీ కొత్తేమీ కాదు. అప్పట్లో రాజ్ కపూర్, ఆ తర్వాత మీరా నాయర్, ఈ మధ్య రాధికా ఆప్తే చేసిన "పార్చెడ్"..ఇలా చాలా చోట్ల న్యూడిటీ అనేది ఉండనే ఉంది. అయితే వారందరికంటే ఆర్జీవీ ప్రభావం యూత్ మీద ఎక్కువ. కాబట్టి ఈ స్టేట్మెంట్ ని పూర్తిగా కొట్టిపారేయలేం.

కళాసాంస్కృతిక రంగాల్లో విప్లవాలు అనివార్యం. శ్రీశ్రీ పొయెట్రీకి అప్పట్లో యూత్ ఊగిపోయినా కూడా ఛాందసులు నిరసించేవాళ్లు. కానీ ఆయన్ని అనుసరించి ఆయన్ని హీరో చేసినవాళ్ళే ఎక్కువ. 

వెబ్ సిరీస్ అనేది మన దేశ సెన్సార్ బోర్డు పరిధిలో లేనిది. కాబట్టి ఎలాగైనా తీయొచ్చు అనేది ఆర్జీవి ఆలోచన. దీనిపై ప్రభుత్వాలు, వ్యవస్థ ఎలా స్పందిస్తాయి? యూత్ ఎలా ప్రభావితమవుతారు? అనేవి ముందుముందు చూడాలి. సినిమా మేకింగ్ విషయంలో, వ్యవస్థ కట్టిన కంచెలో అందరం బతుకుతున్నాం. ఆ కంచెను ఏడాదికి అంగుళం చొప్పున అవతలకి నెట్టుకుంటూ వెళ్తున్నాం. ఆర్జీవీ ఒక్కసారిగా ఆ కంచెను 10 అడుగులు అవతలకి నెట్టాడు. నెమ్మదిగా జరుపుకుంటూ వెళితే ఇవొల్యూషన్. ఒక్కసారిగా అవతలకి తంతే రివొల్యూషన్. ఇది రివొల్యూషన్. అందుకే ఈ డిస్కషన్.

ఇంతకీ గన్స్ అండ్ థైస్ ప్రొడ్యూసర్ పేరు బోరిస్. ఆర్జీవిని పరిశీలించి, పరిశోధించి, సంభాషించి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది:

"If someone in India can take the next step in the evolution of Indian storytelling, then it is RGV" - Boris-Alexander Grönemeye (source: gunsandthighs.com)"

-సిరాశ్రీ.

ALSO READ: Qlik Here For Teaser Of Guns And Thighs