ENGLISH

'2.O' మూవీ రివ్యూ & రేటింగ్

29 November 2018-13:17 PM

తారాగణం: రజనికాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్, సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్ & తదితరులు
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
సంగీతం:  ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: నీరవ్ షా
ఎడిటర్: అంటోనీ
నిర్మాతలు: ఎ. సుభస్కరన్, రాజు మహలింగం
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శంకర్

రేటింగ్: 3.5/5

వెండితెర‌పై భారీద‌నం కుమ్మ‌రించాల‌ని తాప‌త్ర‌యప‌డే ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. అయితే.. ఆ భారీద‌నానికి తోడు ఓ మంచి క‌థ కూడా చెప్ప‌డం అల‌వాటు చేసుకున్నాడు. అందుకే శంక‌ర్ సినిమాలు చిర‌స్థాయిగా మిగిలిపోతుంటాయి. రెండేళ్ల‌కు ఒక్క సినిమా తీసినా.. `భ‌లేటి సినిమా తీశాడ్రా` అనిపించుకుంటుంటాడు.  `రోబో`తో అద్భుతాలు సృష్టించిన శంక‌ర్‌.. ఇప్పుడు దానికి కొత్త వెర్ష‌న్‌ని రంగంలోకి దింపాడు. అదే.. 2.ఓ. దాదాపుగా నాలుగేళ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటూనే ఉందీ సినిమా. దానికి తోడు ఏకంగా ఆరొంద‌ల కోట్ల బ‌డ్జెట్‌. దాంతో... 2.ఓపై అంచ‌నాలు ఆకాశానికి తాకాయి. మ‌రి ర‌జ‌నీ - శంక‌ర్‌ల ద్వ‌యం వాటిని అందుకుందా?  2.ఓ.  ఎంత అల‌రించింది?

క‌థ‌

చెన్నైలో ఓ కుదుపు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ మాయ‌మైపోతుంటాయి. సెల్ ఫోన్ల‌న్నీ వింత ఆకారంలోకి మారి.. ఏకంగా రాష్ట్ర‌మంత్రినే పొట్ట‌న‌పెట్టుకుంటాయి. సెల్‌ఫోన్లు మాయ‌మ‌వ్వ‌డానికి కార‌ణ‌మేంటో తెలీక అటు ప్ర‌భుత్వం, ఇటు అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటారు. వీటి వెనుక ఓ నెగిటీవ్ శ‌క్తి ఉంద‌ని గ్ర‌హిస్తాడు వ‌శీక‌ర‌ణ్ (ర‌జ‌నీకాంత్‌). దాన్ని అదుపులో పెట్టాలంటే... చిట్టి (ర‌జ‌నీ)ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని ప్ర‌భుత్వానికి సూచిస్తాడు.కానీ. ఎవ్వ‌రూ ఒప్పుకోరు. దానికి చ‌ట్టం, కోర్టు అడ్డుప‌డ‌తాయ‌ని వాదిస్తారు. కానీ ఈలోగా పక్షిరాజు సృష్టించే అరాచ‌కాలు ఎక్కువ‌వుతాయి. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో చిట్టిని మ‌ళ్లీ రీ లోడ్ చేసి బ‌య‌ట‌కు తీసుకొస్తారు. అక్క‌డి నుంచి చిట్టీకి, ప‌క్షిరాజుకీ మ‌ధ్య ఏం జ‌రిగింది?  ఈ పోరాటం ఎలా ముగిసింద‌న్న‌దే 2.ఓ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు..

ర‌జ‌నీ ఎన‌ర్జీ ఈ సినిమాలోనూ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 2.ఓగా వ‌చ్చినప్పుడు త‌న‌దైన శైలిలో.. హుషారు పంచాడు. వ‌శీక‌ర్‌ని చూస్తే రోబోలో ర‌జ‌నీకాంత్‌ని చూసిన‌ట్టే అనిపించింది. వ‌య‌సు పెరిగిన‌ట్టు కూడా ఎక్క‌డా అనిపించ‌లేదు. అక్ష‌య్ కుమార్ ఫేస్‌ని గ్రాఫిక్స్ మింగేశాయి. అయితే.. ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మాత్రం త‌న శైలికి భిన్నంగా వృద్ధ పాత్ర‌లో క‌నిపించి, మెప్పించాడు. అమీజాన్స‌న్ కూడా  ఓ రోబోనే. ఐష్ పాత్ర ఉంద‌న్న భ్ర‌మ క‌ల్పిస్తూ... ఆ పాత్ర‌ని కేవ‌లం వాయిస్‌కే ప‌రిమితం చేశాడు శంక‌ర్‌.

విశ్లేష‌ణ‌...

ప్ర‌పంచం మ‌న గుప్పెట్లోకి వ‌చ్చేసింది. చిట్టి సెల్ ఫోన్‌తోనే ఎన్నో ప‌నుల్ని చ‌క్క‌బెడుతున్నాం. అయితే.. ఈ సెల్‌ఫోన్ తో ఎంత ప్ర‌యోజ‌నం ఉందో, అంత ప్ర‌మాద‌మూ ఉంది. ఎందుకంటే... ఈ సెల్ ఫోన్ సృష్టించే రేడియేష‌న్ త‌రంగాల వ‌ల్ల ప‌క్షులు అంత‌రించిపోతున్నాయి. వాటి వ‌ల్ల మాన‌వ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంది. ఈ పాయింట్‌ని ప‌ట్టుకుని రెండు గంట‌ల క‌థ‌గా మ‌ల‌చి, దాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా  తీర్చిదిద్దాల‌నుకున్నాడు శంక‌ర్‌.  పక్షిరాజుకీ - చిట్టీ కి మ‌ధ్య జ‌రిగే పోరు వెండి తెర‌పై చూసి త‌రించాల్సిందే. తొలి స‌న్నివేశం నుంచే ద‌ర్శ‌కుడు క‌థ‌లోకి వెళ్లిపోయాడు.

పాట‌లు, కామెడీ ట్రాక్ అంటూ డిస్ట్ర‌బ్ చేయ‌కుండా కేవ‌లం తాను చెప్పాల‌నుకున్న పాయింట్‌పైనే ఫోక‌స్ చేశాడు. ప‌క్షిరాజుగా అక్ష‌య్ సృష్టించే విధ్వంసం.. సెల్‌ఫోన్ల‌న్నీ వింత రూపం సంత‌రించుకోవ‌డం ఇవ‌న్నీ విజువ‌ల్‌గా బాగున్నాయి. చిట్టి ఎప్పుడైతే రంగంలోకి దిగుతుందో.. అప్పుడు క‌థ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. విశ్రాంతి త‌ర‌వాత‌.. అక్ష‌య్ ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. అదంతా పక్షులు, రేడియేష‌న్ త‌రంగాల వ‌ల్ల జ‌రిగే అన‌ర్థం చుట్టూ సాగుతుంది. ఆ వెంట‌నే మ‌ళ్లీ చిట్టి - ప‌క్షిరాజు మ‌ధ్య పోరాటం మొద‌ల‌వుతుంది. చివ‌రి 30 నిమిషాలూ.. ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దాడు శంక‌ర్‌. స్టేడియం లో రోబోలు, చిట్టి రోబోలు, ప‌క్షిరాజు.. వీటి మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్... క‌నుల పండుగ‌లా, థ్రిల్లింగ్‌లా ఉంటుంది. మినీ రోబోలు.. 2.ఓలో ప్ర‌త్యేక‌త‌. వాటికి సంబంధించిన స‌న్నివేశాలు చిన్న పిల్ల‌ల‌కు బాగా న‌చ్చుతాయి.

అయితే.. 2.ఓలో ఎమోష‌న్స్‌కీ, ల‌వ్ ట్రాక్‌కీ తావు లేదు. కామెడీ,  పంచ్ డైలాగులు వీటి గురించి కూడా శంక‌ర్ ప‌ట్టించుకోలేదు. ఆ మాట‌కొస్తే.. పాట‌లే లేకుండా చేశాడు. చివ‌ర్లో ఎండ్ కార్డ్స్ ప‌డుతున్న‌ప్పుడు ఓ పాట వ‌దిలాడంతే. అక్క‌డ‌క్క‌డ క‌త్తెర్లు ప‌డిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే జంపింగ్‌లు ఎక్కువ‌గా క‌నిపించాయి. మొత్తానికి ఓ మామూలు క‌థ‌ని, శంక‌ర్ త‌న‌దైన శైలిలో న‌డుపుతూ, దానికి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ని జోడించాడు. రోబో ని పోల్చ‌కుండా.. 2.ఓని కేవ‌లం 2.ఓగానే చూస్తే.. త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

సాంకేతిక వర్గం...

విజువ‌ల్‌గా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్‌లో తీశాడు శంక‌ర్‌. మ‌రీ ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఆక‌ట్టుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాల్లో వాటిదే రాజ్యం. అవి ఎంత వ‌ర‌కూ ఎక్కుతాయి అన్న‌దానిపైనే.. ఈసినిమా వ‌సూళ్లు ఆధార‌ప‌డి ఉంటాయి. త్రీడీలో ర‌జ‌నీని చూడ‌డం ఓ కొత్త అనుభూతి. రెహ‌మాన్ నేప‌థ్య సంగీతం మ‌రింత బ‌లం చేకూర్చింది. రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప‌దే ప‌దే చెప్పారు. ఆ ఖ‌ర్చు తెర‌పై క‌నిపించింది. శంక‌ర్ మ‌రోసారి త‌న సృజ‌నాత్మ‌క‌త‌ను రోబో 2 రూపంలో చాటుకున్నాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌ 
విజువ‌ల్  ఎఫెక్ట్స్‌

మినీ ర‌జ‌నీ

నేప‌థ్య సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌ 

బ‌ల‌హీన‌మైన క‌థ‌
ర‌జ‌నీ శైలి పంచ్ డైలాగులు లేక‌పోవ‌డం

పైన‌ల్ వ‌ర్డిక్ట్‌: వీఎఫ్ఎక్స్ మాయాజాలం

రివ్యూ రాసింది శ్రీ.

ALSO READ: '2.O' ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి