ENGLISH

చాణక్య మూవీ రివ్యూ & రేటింగ్!

05 October 2019-16:00 PM

నటీనటులు: గోపీచంద్, మెహ్రిన్ పిర్జా, సునీల్,అలీ, జరీన్ ఖాన్, నాజర్, ఆదర్శ్, రాజా చెంబూరు తదితరులు.
దర్శకత్వం: తిరు
నిర్మాత‌: రామ బ్రహ్మం సుంకర 
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సినిమాటోగ్రఫర్: వెట్రి
విడుదల తేదీ: అక్టోబర్ 05, 2019
 

రేటింగ్‌: 3/5

 
గోపీచంద్ కి ఓ హిట్టు పడి చాలా కాలం అయ్యింది. కొత్త కథల కోసం తనది కాని రూటులో వెళ్లి ఫ్లాపులు కొని తెచ్చుకున్నాడు. మాస్ కథల కోసం రొటీన్ దారిలో వెళ్లి భంగపడ్డాడు. యువతరం కథానాయకులు జోరు చూపిస్తున్న ఈ తరుణం లో.. గోపి మళ్లీ తన తడాఖా చూపించాలంటే.. దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాలంటే ఓ హిట్టు కొట్టడం అత్యవసరం. ఈ దశలో గోపీచంద్ నుంచి వచ్చిన సినిమా... చాణక్య. మరి ఈ సినిమా ఎలా వుంది..? గోపీచంద్ దాహం తీర్చిందా..? గోపి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడా..?


* క‌థ‌

 
అర్జున్ (గోపిచంద్) రా లో పనిచే స్తుంటాడు. తనకు రెండో జీవితం కూడా వుంది. అది రామ కృష్ణ అనే బ్యాంకు ఉద్యోగిగా. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే అర్జున్ కి పాకిస్థాన్ లో వుండి.. మన దేశాన్ని వణికించాల ని కుట్ర పన్నే సొహైల్ కీ మధ్య పోరు మొదలవుతుంది.


'రా' లో పనిచేస్తున్న అర్జున్ స్నేహితుల్ని కిడ్నాప్ చేసి.. కరాచీ తీసుకెళ్ళి పోతాడు సోహైల్. మరోవైపు తన ఉద్యోగాన్ని కోల్పోతాడు అర్జున్. ఈ దశలో తానొక్కడే కరాచీ వెళ్లి.. సోహెల్ తో తాలపడతాడు. మరి ఆ ప్రయాణం లో తనకు ఎదురైన అనుభవాలు ఏమిటి..? కరాచీలో అర్జున్ చేసిన సాహసాలు ఏమిటి..? తన స్నేహితులని కాపాడాడా లేదా..? అనేదే కథ.
 

* న‌టీన‌టులు


గోపీచంద్ ఎప్ప‌టిలానే త‌న పాత్ర‌లో ఇమిడిపోయాడు. కొత్త ఛాలెంజులేం లేవు. త‌న పాత్ర‌లో రెండు ర‌కాల ఛాయ‌లున్నా.. రెండు చోట్లా ఒకేలా న‌టించాడు. మెహ‌రీన్ మరోసారి బ‌ల‌హీన‌మైన క‌థానాయిక పాత్ర‌లో క‌నిపించింది. అలీ కామెడీ వెగ‌టు పుట్టిస్తుంది.


సునీల్ కాసేపు న‌వ్వించాడు. అయితే అది స‌రిపోదు. జ‌రీన్‌ఖాన్‌కు మంచి పాత్ర ద‌క్కింది. ఓర‌కంగా త‌నే హీరోయిన్ అనుకోవొచ్చు. విల‌న్ గ్యాంగ్ వేస్ట్‌. తెలుగువాళ్ల‌కు తెలిసిన న‌టులు కాక‌పోవ‌డం మ‌రింత పెద్ద మైన‌స్‌
 

* సాంకేతిక వ‌ర్గం


టెక్నిక‌ల్‌గా ఈ సినిమా బాగుంది. బాగా ఖ‌ర్చు పెట్టారు. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. పాట‌లు మైన‌స్‌. పోరాట స‌న్నివేశాలు బాగా తీర్చిదిద్దారు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న నేప‌థ్యం బాగున్నా - దాన్ని ఆస‌క్తిగా మ‌ల‌చ‌డంలో విఫ‌లం అయ్యాడు. అక్క‌డ‌క్క‌డ కొన్ని మెరుపులు, క్లైమాక్స్ మిన‌హాయిస్తే... ఈ సినిమా  పెద్ద‌గా ఆక‌ట్టుకోదు.


* విశ్లేష‌ణ‌


ఇదో స్పై ద్రిల్లర్. ఇలాంటి కథలకు మలుపులు, ఆసక్తి కలిగించే సన్నివేశాలు తోడవ్వాలి. ప్రతి సన్నివేశం ఊహకు అందకుండా మలచాలి. అందుకు అనువైన వేదిక దొరికింది కూడా. ఐతే దర్శకుడు తిరు దాన్ని అంతగా సద్వినియోగ పరచుకోలేదు అనిపిస్తోంది. కథని ప్రారంభించిన విధానం బాగుంది. అండర్ కవర్ ఆపరేషన్ సన్నివేశంతో కథానాయకుడి, తన టీమ్ నీ పరిచయం చేస్తాడు దర్శకుడు. సినిమా అంతా అదే టెంపో లో సాగుతుందని అనిపిస్తోంది.


అయితే.. ఆ వెంటనే బ్యాంకు సన్నివేశాలు, లవ్ ట్రాక్ మొదలవుతుంది. కథలో ఉన్న ఆసక్తి ఆయా సీన్లు తగ్గించేస్తాయి. కుక్కల సంభోగం కోసం సృష్టించిన కామెడీ మరీ బీ గ్రేడ్ తరహాలో సాగుతాయి. పాటలు టెంపో కి అడ్డు తగులుతాయి. ఈ సినిమా ఇక అంతేనా అనుకుంటున్న దశలో.. హీరోపై విలన్ ఎటాక్ చేస్తాడు. అక్కడి నుంచి కథలో వేగం వస్తుంది. కరాచీ లో హీరో చేసే విన్యాసాలు ఈ సినిమాకి మూలం. అదే బలం. ఆయా సన్నివేశాలు సరిగా తెరకెక్కించిన గలిగితే తప్పకుండా దర్శక నిర్మాతల ప్రయత్నం నెరవేరే ది. 


కానీ అది జరగలేదు. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం కొత్త‌గా అనిపిస్తాయి. ప‌ద్మ‌వ్యూహం లాంటి ర‌ణ‌రంగంలోకి అడుగుపెట్టిన క‌థానాయ‌కుడు.... చాక‌చ‌క్యంగా ఎలా త‌ప్పించుకున్నాడు అనేది బాగా చూపించారు. ప‌తాక స‌న్నివేశాల్లో ఇచ్చిన ట్విస్టు కూడా బాగుంది. ప్ర‌ధ‌మార్థం కంటే, ద్వితీయార్థం ఎన్నో రెట్లు న‌యం. కానీ... సినిమా మొత్తంగా చూసిన‌ప్పుడు మాత్రం తేలిపోయిన‌ట్టు అనిపిస్తుంది. చాణిక్య అనే పేరుకు తగ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు తెలివితేట‌ల్ని చూపించి ఉంటే బాగుండేది. అవి లేక‌పోవ‌డంతో... నిస్సారమైన స్పై థ్రిల్ల‌ర్‌గా మిగులుతుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌ 

గోపీచంద్‌
క్లైమాక్స్ ట్విస్టు

 

* మైన‌స్ పాయింట్స్

ముత‌క కామెడీ
స్క్రీన్ ప్లే

 
* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  చాణిక్యుడి ప‌థ‌కం పారింది.

 

- రివ్యూ రాసింది శ్రీ

ALSO READ: సైరా రివ్యూ: చరిత్రలో నిలిచిపోయే చిత్రం.