ENGLISH

చి.ల.సౌ మూవీ రివ్యూ & రేటింగ్

03 August 2018-08:30 AM

తారాగణం: సుశాంత్, రుహాణి శర్మ, రోహిణి, వెన్నెల కిషోర్, విధ్యులేఖ రామన్, రాహుల్ రామకృష్ణ, అను హాసన్ తదితరులు
నిర్మాణ సంస్థలు: అన్నపూర్ణ ప్రొడక్షన్స్ & మనం ఎంటర్ప్రైజ్స్ & సిరుణి సినీ కార్పొరేషన్
సంగీతం: ప్రశాంత్ కే విహారీ
ఎడిటర్: చోటా కే ప్రసాద్
నిర్మాతలు: నాగార్జున & జస్వంత్
రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

రేటింగ్: 3/5

హీరోలు దర్శకులుగా మారడమనేది చాలా అరుదుగా చూస్తుంటాము. తాజాగా అలాంటిదే ఒక సంఘటన మన తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగింది, ఇంతకి అలా హీరో నుండి దర్శకుడిగా మారింది రాహుల్ రవీంద్రన్ కాగా ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం చి.ల.సౌ.

ఇక ఈ చిత్రంలో హీరోగా సుశాంత్ నటించగా హీరోయిన్ గా రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయమవుతున్నది. మరి ఫ్లాపులతో సతమతవుతున్న సుశాంత్ కి ఈ హీరో కమ్ దర్శకుడు హిట్ ఇస్తాడా లేదా అనేది ఈ క్రింద చిలసౌ సమీక్షలో చూద్దాం...

కథ:

జీవితంలో కొన్ని లక్ష్యాల, కోరికలు ఉన్న 27 ఏళ్ళ కుర్రాడు అర్జున్ (సుశాంత్). అయితే అతను తన తల్లిదండ్రులు పెళ్ళి చేసుకోమని ఎంత ఒత్తిడి తెచ్చినా మరో అయిదేళ్ళ వరకు పెళ్ళి చేసుకోనని చెప్పేస్తాడు. ఇక మొత్తం కుటుంబాన్ని తన భుజాల పైనే మోస్తూ తన కాళ్ళ పైన తను నిలబడిన అమ్మాయి అంజలి (రుహాణి శర్మ).

ఇక వీరిరువురు వీరి పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూపులలో కలుస్తారు. అప్పుడు ఇద్దరు పెళ్ళి పైన తమ తమ అభిప్రాయలు చెప్పుకుంటారు. అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని అర్జున్.. అంజలిని పెళ్ళి చేసుకుంటాడా? లేక వీరి అభిప్రాయాలు కలవక విడిపోతారా? అనేది సినిమా చూస్తే మీకే తెలిసిపోతుంది.

నటీనటుల పనితీరు..

సుశాంత్: సుశాంత్ కి ఇది తొలి చిత్రమైతే అతని కెరీర్ మరోలా ఉండేది అనే కచ్చితంగా చెప్పొచ్చు. అర్జున్ పాత్రలో చాలా సహజంగా నటించాడు అనేదానికంటే ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పాలి. కథకి, పాత్రకి తగట్టుగా సుశాంత్ అభినయం ఉండడంతో ప్రేక్షకుల తో ఈ సినిమాకి మంచి మార్కులే వేయించుకుంటాడు అని చెప్పొచ్చు.

రుహాణి శర్మ: ఈ సినిమా కథ ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అంతటి బలమైన పాత్రకి రుహాణి నూటికి నూరుశాతం న్యాయం చేసింది. తోలిచిత్రమైనప్పటికి కూడా అభినయంలో చాలా అనుభవం ఉన్న నటిలా చాలా సునాయాసంగా నటించేసింది.  ఈ సినిమా తరువాత రుహాణికి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం.

వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, అను హాసన్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ:

చాలా సాధారణ కథని తీసుకుని దానికి అత్యంత సహజంగా కథనం అల్లుకుని.. ఈ రెంటితో పాత్రలకి న్యాయం చేసే నటులని జత చేసి ఒక చక్కటి సినిమాని మనకి అందించిన రాహుల్ కి ముందుగా అభినందనలు తెలపాలి.

ఒక రాత్రిలో జరిగే కథని ఎక్కడ బోర్ కొట్టకుండా, రొటీన్ గా ఉంది కదా అని అనిపించకుండా అదే సమయంలో కమర్షియల్ చిత్రాలలో ఉండే ఫైట్లు, పాటల జోలికి పోకుండా ఓ సాధారణ కథని చూడచక్కగా ఆవిష్కరించేశాడు దర్శకుడు.

రాహుల్ రాసిన కథ, కథనాలకి సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు న్యాయం చేశారు అనే చెప్పాలి. సినిమాలో ఏ పాత్ర కూడా అతి చేసినట్టుగా అనిపించకపోవడం అటు దర్శకుడి ఇటు నటీనటుల కృషి అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రాహుల్ రాసుకున్న సంభాషణలు సన్నివేశానికి సరిగ్గా సరిపోయాయి.

ప్రేమ అంటే అది ఒక “అలవాటు” అని రాసిన మాట ధియేటర్ లో అందరిచేత చప్పట్లు కొట్టించింది. ఈ సినిమా చూసాక మాత్రం రాహుల్ దర్శకుడిగా మారడానికి అనవసరంగా ఎక్కువ సమయం తీసుకున్నాడు అని అంటారు.

సాంకేతిక వర్గం:

సుకుమార్ కెమెరాపనితనం సినిమా తాలుకా మూడ్ కి సరిపోయేలా ఉంది. ప్రశాంత్ ఇచ్చిన నేపధ్య సంగీతం, రెండు పాటలు సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. దర్శకుడిగా కన్నా రచయతగా రాహుల్ ఒక మార్క్ ఎక్కువ వేయించుకున్నాడు అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:

+ సహజమైన పాత్రలు, నటన
+ రచన
+ దర్శకత్వం

మైనస్ పాయింట్:

- కొన్ని సన్నివేశాలలో కనిపించిన సాగదీత

ఆఖరి మాట: చి.ల.సౌ.- సూటిగా.. సుత్తిలేకుండా.. తీసిన మంచి చిత్రం...

రివ్యూ రాసింది సందీప్.

ALSO READ: చి.ల.సౌ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి