ENGLISH

దర్శకుడు మూవీ రివ్యూ & రేటింగ్స్

04 August 2017-16:27 PM

తారాగణం: అశోక్, నోయెల్, ఈశా, పూజిత
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: ప్రవీణ్
నిర్మాణ సంస్థ: సుకుమార్ రైటింగ్స్
నిర్మాతలు: విజయ కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర
రచన-దర్శకత్వం: జక్కా హరి ప్రసాద్ 

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.25/5

చిన్న సినిమాల్లో ఈమ‌ధ్య ప్ర‌మోష‌న్ల‌తో ఊద‌ర‌గొట్టేసిన సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది 'ద‌ర్శ‌కుడు `సినిమానే. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాత కావ‌డం వ‌ల్ల‌.. వ‌ద్ద‌న్నా భారీ ప్ర‌మోష‌న్ వ‌చ్చి ప‌డిపోయింది. దానికి తోడు ఈ సినిమాపై అంచ‌నాలూ బాగానే ఉన్నాయి. సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి వ‌చ్చిన తొలి చిత్రం కుమారి 21 ఎఫ్ మంచి విజ‌యాన్ని అందుకోవ‌డంతో.. ద‌ర్శ‌కుడు పైనా ఫోక‌స్ పెట్టింది చిత్ర‌సీమ‌. మ‌రి ఈ ద‌ర్శ‌కుడు ఎలా ఉన్నాడు?  ప్రేక్ష‌కుల అంచ‌నాల్ని నిజం చేశాడా?  నిర్మాత‌గా సుకుమార్ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా?

* క‌థ‌..

మ‌హేష్ (అశోక్‌) కి సినిమాలంటే పిచ్చి. ద‌ర్శ‌కుడ‌వ్వాల‌న్న‌ది అత‌ని క‌ల‌.. ఆశయం. అందుకోస‌మే అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతుంటాడు. ద‌ర్శ‌కుడయ్యే అవ‌కాశం వ‌స్తుంది. ఈలోగా న‌మ్ర‌త (ఈషా)తో ప‌రిచయం అవుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. అయితే న‌మ్ర‌త‌తో ప్రేమాయ‌ణం కూడా సినిమా దృష్టి కోణంలోనే చూస్తుంటాడు మ‌హేష్‌. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ట‌న‌ల్ని త‌న స్క్రిప్టుకి అనుగుణంగా మార్చుకొంటుంటాడు. త‌న‌ని ప్రేమిస్తుంది.. ద‌ర్శ‌కుడ‌వ్వాల‌న్న స్వార్థంతోనే అనే విష‌యం ఈషాకి తెలిసి దూరం అవుతుంది. అటు సినిమా, ఇటు ప్రేమ రెండూ దూర‌మైన మ‌హేష్ ఎలా స్పందించాడు??   త‌న ప్రేమ‌నీ, ఆశ‌యాన్నీ ఎలా గెలిపించుకొన్నాడు?  అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు.. 

క‌థానాయకుడి క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూ న‌డిచే క‌థ ఇది. ఆ పాత్ర క‌థ‌కు కీల‌కం. త‌న భుజ స్కందాల‌పై ఈ క‌థ‌ని న‌డిపించ‌గ‌ల స‌మ‌ర్థ‌త అశోక్‌లో క‌నిపించ‌లేదు. చూడ్డానికి ఎంత యావ‌రేజ్‌గా ఉన్నాడో, న‌ట‌న కూడా అంతే యావ‌రేజ్‌గా ఉంది.  అశోక్ స్థానంలో రాజ్ త‌రుణ్ లాంటివాడున్నా.. కాస్త జోష్ వ‌చ్చేది. ఈషా త‌న వ‌ర‌కూ న్యాయం చేసింది. అందంగా ఉంది. ప‌ద్ధ‌తిగా న‌టించింది. మిగిలిన‌వాళ్ల‌లో ఎవ్వ‌రి పాత్ర‌కీ అంత స్కోప్ లేదు.

* విశ్లేష‌ణ‌..

ఓ ద‌ర్శ‌కుడి ప్రేమ‌క‌థ ఇది. త‌న ప్రేమ‌కీ, అభిరుచికీ మ‌ధ్య ఎలా న‌లిగిపోయాడు, ఎంత సంఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు?  అనే అంశాల చుట్టూ న‌డుస్తుంది. పేప‌ర్ పై చూస్తే క‌థ త‌మాషాగానే క‌నిపిస్తుంది. అయితే `తీత‌`లో ఆ వైవిధ్యం క‌నిపించ‌దు. తొలి ప‌ది నిమిషాల్లోనే క‌థ ఎలా సాగుతుంది?  ఏం జ‌ర‌గ‌బోతోంది?  అనే విష‌యాల‌పై క్లారిటీ వ‌చ్చేస్తుంది. అక్క‌డ్నంచి రొటీన్ స‌న్నివేశాల‌తోనే న‌డిపించాడు. సుకుమార్ క‌థ‌ల్లో, తీత‌లో కొత్త‌ద‌నం క‌నిపిస్తుంటుంది. అది.. ద‌ర్శ‌కుడిలో బాగా మిస్స‌య్యింది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాకి కీల‌కం. దాని చుట్టూ త‌మాషా స‌న్నివేశాలు రూపొందించుకోవొచ్చు. కామెడీ సృష్టించొచ్చు. కానీ.. ద‌ర్శ‌కుడు వాటిపై దృష్టి పెట్ట‌లేదు. ప్రేమ‌కీ - లక్ష్యానికీ మ‌ధ్య న‌లిగిపోయే స‌న్నివేశాల్ని కూడా హృద‌యానికి హత్తుకొనేలా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు. ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థం మ‌రీ డ్రైగా ఉంటుంది. వినోదానికి స్కోప్ లేదు. పైగా.. క‌థానాయ‌కుడి పాత్ర మ‌రీ నీర‌సంగా సాగుతుంది. ద‌ర్శ‌కుడంటే ఇంత డ‌ల్‌గా ఉండాలేమో, క్రియేట‌ర్లంతా నీర‌సంగానే ఉంటారేమో అన్నంత చాద‌స్తంగా ఆ పాత్ర‌ని తీర్చిదిద్దారు. ప‌తాక సన్నివేశాల్లో కాస్త క్లారిటీ వ‌స్తుంది. అయితే అప్ప‌టికే ఆస‌ల్యం అయిపోయింది. ఓ బల‌హీన‌మైన క‌థ‌ని, అంతే నీర‌స‌మైన స్క్రీన్ ప్లేతో, క్యారెక్ట‌రైజేష‌న్‌తో తీర్చిదిద్ద‌డం వ‌ల్ల‌.. `ద‌ర్శ‌కుడు` మ‌రీ డ‌ల్ అయిపోయాడు.

* సాంకేతిక వ‌ర్గం

 

చిన్న సినిమా. అయినా క్వాలిటీ బాగుంది. పాట‌లు, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకొంటాయి. ఫొటోగ్ర‌ఫీ నీట్‌గా ఉంది. ఇన్ని ఉన్నా ఏం లాభం??  తొలి ప్ర‌య‌త్నం చేస్తున్న ద‌ర్శ‌కుడు హ‌రి ప్రసాద్ చేతులెత్తేశాడు. ఈ క‌థ‌ని న‌డిపించ‌గ‌ల సామ‌ర్థ్యం.. ద‌ర్శ‌కుడిలో క‌నిపించ‌లేదు. క‌థ‌, క‌థ‌నాల్లో ఉన్న లోపాలు శాపాల‌య్యాయి. వినోదం లేక‌పోవ‌డం మ‌రో పెద్ద మైన‌స్‌.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ ఈషా
+ సంగీతం

* మైన‌స్ పాయింట్స్‌

- అన్నీ

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  ఓ ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యం

రివ్యూ బై శ్రీ

ALSO READ: దర్శకుడు ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి