ENGLISH

దేవ‌దాస్‌ మూవీ రివ్యూ & రేటింగ్

27 September 2018-14:09 PM

తారాగణం: నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక, కునాల్ కపూర్ & తదితరులు
నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యాందత్
నిర్మాత: అశ్వినీదత్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య 

రేటింగ్: 2.75/5 

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలంటే అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజానే. అందునా స‌మ‌కాలీన హీరోలిద్ద‌రూ చేసే మ‌ల్టీస్టార‌ర్ కంటే అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చే కాంబినేష‌న్‌లు ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని పెంచుతాయి. నాగార్జున‌, నాని కాంబినేష‌న్ అలాంటిదే. కెరీర్‌లో ఆరంభం నుంచి న‌వ్య‌మైన క‌థ‌ల‌కు పెద్ద‌పీట వేస్తారు నాగార్జున‌. క‌థ బాగుంటే యువ‌హీరోల‌తో క‌లిసి న‌టించ‌డానికి వెన‌కాడ‌రు. క‌థానాయ‌కుడిగా ప‌తాకస్థాయి విజ‌యాల్ని ఆస్వాదిస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న ప‌లు చిత్రాల్లో అతిథి పాత్ర‌ల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఊపిరి చిత్రంలో కార్తీతో క‌ల‌సి న‌టించి మంచి విజ‌యాన్ని అందుకున్నారు. 

దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత దేవ‌దాస్ చిత్రం ద్వారా నాగార్జున మ‌రో మ‌లీస్టార‌ర్ చిత్రానికి సిద్ధ‌మ‌య్యారు. వ‌రుస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో వున్న నాని ఆయ‌న‌కు తోడ‌య్యారు. దీంతో దేవ‌దాస్ ప్రాజెక్ట్ నిర్మాణ ద‌శ నుంచే వార్త‌ల్లో నిలిచింది. వైజ‌యంతీ మూవీస్ వంటి అగ్ర సంస్థ నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భ‌లే మంచి రోజు, శమంత‌క‌మ‌ణి వంటి సినిమాల‌తో న్యూఏజ్ ఫిల్మ్ మేక‌ర్‌గా స‌త్తాచాటిన శ్రీ‌రామ్ ఆదిత్య తొలిసారి ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల్ని డైరెక్ట్ చేయ‌డం కూడా ఆస‌క్తినిరేకెత్తించింది. ఇంత‌టి అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల‌ముందుకొచ్చిన దేవ‌దాస్ ప్రేక్ష‌కుల్ని ఏ మేర‌కు మెప్పించింది? నాగార్జున, నాని ఛ‌రిష్మాటిక్ కాంబినేష‌న్ వెండితెర మీద అభిమానుల్ని ఎంత‌వ‌ర‌కు మెప్పించిందో తెలుసుకోవాలంటే దేవ‌దాస్ క‌థ‌లోకి వెళ్లాల్సిందే...

క‌థేమిటంటే..

దేవ (నాగార్జున‌)మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్‌. ప‌దేళ్ల‌పాటు హైద‌రాబాద్‌కు  దూరంగా ఉన్న‌దేవ తిరిగి హైద‌రాబాద్‌లో అడుగుపెడ‌తాడు. దాస్ (నాని) మెడిసిన్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన డాక్ట‌ర్‌. ఓ కార్పొరేట్ హాస్పిట‌ల్‌లో జాయిన్ అవుతాడు. అయితే ప్ర‌తి విష‌యంలో నిజాయితీగా వ్య‌వ‌హ‌రించ‌డంతో అక్క‌డి డిపార్ట్‌మెంట్ హెడ్ ఆగ్ర‌హానికి గురై ఉద్యోగం నుంచి ఉద్వాస‌న‌కు గుర‌వుతాడు. ధూల్‌పేట‌లో సొంతంగా ఓ క్లినిక్‌ను ఓపెన్ చేస్తాడు. 

ఓ రోజు దేవాపై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డంతో గాయ‌ప‌డ‌తాడు. వైద్యం కోసం అనూహ్య‌ప‌రిస్థితుల్లో దాస్ క్లినిక్‌లో జాయిన్ అవుతాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య చ‌క్క‌టి స్నేహం ఏర్ప‌డుతుంది. ప్రాణాలు తీసే దేవ‌, ప్రాణాలు పోసే దాస్‌ల మ‌ధ్య ఏర్ప‌డ్డ అనుబంధం ఎలా సాగింది?  దేవ‌లో ప‌రివ‌ర్త‌న క‌ల‌గ‌డానికి దాస్ ఏం చేశాడు?  దేవ‌, దాస్‌ జీవితాల్లో  టీవీ న్యూస్‌రీడ‌ర్ జాహ్న‌వి (ఆకాంక్ష‌సింగ్‌)కి,  పోలీస్ ఇన్‌స్పెక్టర్ పూజ (ర‌ష్మిక‌) ఎలా ఎంట‌ర‌య్యారు? ఈ న‌లుగురు మ‌ధ్య  ఉన్న సంబంధం ఏమిటి?  చివ‌ర‌కు దాస్ తాను అనుకున్న లక్ష్యం సాధించాడా? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధాన‌మే మిగ‌తా క‌థ‌..

న‌టీన‌టుల ప‌నితీరు...

నాగార్జున అర‌వై వసంతాల‌కు చేరువ‌వుతున్నాడు. అయినా ఆయ‌న‌లో ఆ ఛాయ‌లు ఇసుమంతైనా క‌నిపించ‌లేదు. ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ చూస్తే నాగ్ ఫిట్‌నెస్ ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతుంది. గ్యాంగ్‌స్ట‌ర్ దాస్ పాత్ర‌లో నాగార్జున చ‌క్క‌టి ఒదిగిపోయాడు. ఎలాంటి గాంభీర్యం లేకుండా అద్బుత‌మైన కామెడీ ట‌చ్‌తో త‌న పాత్ర‌ను ర‌క్తిక‌ట్టించాడు. యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో సూపర్ అనిపించాడు.   పాట‌ల్లో చాలా స్టైలిష్‌గా క‌నిపించాడు.

 

ఇక నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.  త‌న‌దైన సెన్సాఫ్ హ్యూమ‌ర్‌, మంచి డైలాగ్ టైమింగ్‌తో మెప్పించాడు. 

దాదాగా శ‌ర‌త్‌కుమార్ అతిథి పాత్ర‌లో క‌నిపించాడు. బాలీవుడ్ న‌టుడు కునాల్ క‌పూర్ స్టైలిష్ విల‌న్‌గా మెప్పించాడు. కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌కు మంచి రోల్ ద‌క్కింది. క‌థానాయిక‌ల పాత్ర‌ల‌కు అంత‌గా ప్రాధాన్య‌త ద‌క్క‌లేదు. వెన్నెల కిషోర్‌, న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్య‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర‌కు బాగానే చేశారు.

విశ్లేష‌ణ‌..

ప్రాణాలు తీసే డాన్‌, ప్రాణాలు పోసే డాక్ట‌ర్..భిన్న వైరుధ్యాల క‌లిగిన ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఓ సంఘర్ష‌ణ‌, చివ‌ర‌కు ఓ స‌దాశ‌యం కోసం వారు చేసే ప్ర‌యాణమే క్లుప్తంగా దేవ‌దాస్ క‌థ‌లోని పాయింట్‌. ఇలాంటి కాంట్రాస్టింగ్ హీరోల క్యార‌క్ట‌రైజేష‌న్ తీసుకొని ఆ క‌థ‌కు చ‌క్క‌టి ప‌ర్ప‌స్‌ను జోడించి వాణిజ్య అంశాల‌తో సినిమాను తీర్చిదిద్ద‌డం మంచి స‌క్సెస్‌ఫుల్ ఫార్ములా. దేవ‌దాస్ సినిమా కోసం ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఇదే పాయింట్‌ను ఎంచుకున్నాడు. 

నాగార్జున‌, నాని పాత్ర‌ల‌ను బాగా డిజైన్ చేశాడు. అయితే ప్ర‌థ‌మార్థంలో క‌థ‌కుడిగా పూర్తిగా తడ‌బ‌డ్డాడు. దేవ‌, దాస్ మ‌ధ్య అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాడ‌నిపించింది. ఈ క్ర‌మంలో మాఫియా సెట‌ప్ తాలూకు స‌న్నివేశాలు అసంద‌ర్భంగా అనిపిస్తాయి. పేరుమోసిన మాఫియా డాన్‌గా దేవ పాత్రను ప్రొజెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు కానీ దానిని క‌న్విన్స్ చేసేలా బ‌ల‌మైన స‌న్నివేశాల్ని అల్లుకోలేక‌పోయారనిపించింది. దేవ బ‌య‌ట స్వేచ్చ‌గా తిరుగుతున్నా అత‌ని ప‌ట్టుకోవ‌డానికి అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌డం, ఇందుకోసం పోలీస్‌లు ప్ర‌య‌త్నించే ఎపిపోడ్స్ ఎలాంటి లాజిక్‌లేకుండా క‌నిపిస్తాయి. 

జాహ్న‌వితో దేవ‌కు సంబంధించిన ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నాగార్జున‌ను చిత్ర విచిత్ర‌మైన జుల‌పాట జుట్టుతో చూపించడం ఎబ్బెట్టుగా అనిపించింది. ప‌దేళ్ల క్రితం అంటూ 70ల నాటి రెట్రో హెయిర్‌స్టైల్‌ను చూపించ‌డం, అది కూడా అథెంటిక్‌గా లేక‌పోవ‌డం పెద్ద త‌ప్పిదంగా అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్థంలో దేవ‌, జాహ్న‌వి- దాస్‌, పూజ మ‌ధ్య రొమాంటిక్ ఎపిసోడ్ అంత‌గా ఆక‌ట్టుకోదు. ద్వితీయార్థంలోనే ప్రేక్ష‌కులు క‌థ‌లో ఎంట‌ర‌వుతారు. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న నాలుగేళ్ల పిల్లాడిని చూసి డాన్ దేవ‌లో ప‌రివ‌ర్త‌న ఆరంభ‌మ‌వుతుంది. అక్క‌డి నుంచే కథ‌లో ఎమోష‌నల్ ఫీల్ క్యారీ అయింది. దేవ‌ను మార్చ‌డానికి దాస్ చేసే ప్ర‌య‌త్నం..ఈ క్ర‌మంలో వ‌చ్చి స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నాయి. 

డ‌బ్బు, ప‌వ‌ర్  చేరువ‌వుతున్న మ‌ర‌ణాన్ని ఎంత‌వ‌ర‌కు కాపాడ‌గ‌ల‌వు? వ‌ంటి సంభాష‌ణ‌లు బాగున్నాయి.  ఈ సినిమా మొత్తంలో దేవ తాలూకు మాఫియా సెట‌ప్‌, పోలీసుల అండ‌ర్‌క‌వ‌ర్ ఆప‌రేష‌న్ క‌థ‌కు అంత అవ‌స‌రం లేద‌నిపిస్తాయి. ఆ ఎపిసోడ్స్ లేకుండానే క‌థ‌ను మ‌రింత అర్థ‌వంతంగా న‌డిపించ‌వ‌చ్చ‌నే భావ‌క క‌లుగుతుంది. ప్రీక్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్‌ను బాగా డిజైన్ చేశారు. ప‌తాక ఘ‌ట్టాల్లో నాగార్జున పాత్ర విష‌యంలో  స‌స్పెన్స్‌ను క్రియేట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. 

ప్ర‌థ‌మార్థం నిస్సారంగా సాగిన‌ప్ప‌టికీ దేవ‌, దాస్ పాత్ర‌ల్లో కామెడీని పండించ‌డం కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ హ్యాంగోవ‌ర్‌లో ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్ని రాసుకున్నాడ‌నిపించింది. ఓవ‌రాల్‌గా ఈ క‌థ‌కు మంచి పాయంట్ కుదిరింది. వాణిజ్య అంశాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇద్ద‌రు పెద్ద‌స్టార్స్ ఉన్నారు. అయినా అనుకున్న‌రీతిలో స‌మ‌ర్థ‌వంత‌గా సినిమాను తీర్చిదిద్ద‌లేద‌నిపించింది. ద్వితీయార్థం సినిమాను నిల‌బెట్టింద‌ని చెప్పొచ్చు. నాగార్జున‌, నాని సూప‌ర్ స్ర్కీన్‌ప్ర‌జెన్స్ వ‌ల్ల మామూలు స‌న్నివేశాలు కూడా బాగా అనిపించాయి. 

సాంకేతికంగా ..

శ్యామ్‌ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. స‌న్నివేశాల‌కు అనుగుణంగా ప్ర‌తీ ఫ్రేమ్‌ను డిఫ‌రెంట్ క‌ల‌ర్ ఫార్మెట్‌లో తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకుంది. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర‌చిన  కొన్ని పాట‌లు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విష‌యంలో మ‌ణిశ‌ర్మ త‌న‌దైన మార్క్‌ను  చాటారు. దేవ క‌నిపించిన‌ప్పుడు థీమ్ బీజీఎమ్ బాగుంది. ఎడిటింగ్ విష‌యంలో కొంచెం శ్ర‌ద్ధ తీసుకొని వుంటే బాగుండేది. నిర్మాణ విలువ‌లు చ‌క్క‌గా ఉన్నాయి. త‌మ సంస్థ ఇమేజ్‌కు త‌గిన‌ట్లుగా ఎక్క‌డా రాజీలేకుండా వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించింది. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య క‌థ‌పై మ‌రింత వ‌ర్క్ చేస్తే బాగుండేది. 

ప్లస్ పాయింట్స్:

+ నాగార్జున & నాని

+పాయింట్ 

+ సినిమాటోగ్ర‌ఫీ

మైనస్ పాయింట్స్:

- కథనం

- ప్రధమార్ధం

ఆఖరి మాట: దేవ‌దాస్ ఓ యావ‌రేజ్ ఎంట‌ర్‌టైన‌ర్‌..  

రివ్యూ రాసింది శ్రీ