ENGLISH

'ఖైదీ' మూవీ రివ్యూ & రేటింగ్!

25 October 2019-17:30 PM

నటీనటులు: కార్తీ, నరేన్, దీన, మరియం జార్జ్ త‌దిత‌రులు
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాణం:  డ్రీం వారియర్ పిక్చర్స్, శ్రీ సత్య సాయి ఆర్ట్స్
సంగీతం: సామ్ సి ఎస్
సినిమాటోగ్రఫర్: సత్యన్ సూర్యన్ 
విడుదల తేదీ: అక్టోబర్ 25,  2019

 

రేటింగ్‌: 3/5

 
విభిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ త‌న ప్ర‌యాణం మొద‌లెట్టాడు కార్తీ. యుగానికి ఒక్క‌డు, నా పేరు శివ‌, ఆవారా లాంటి సినిమాలు చూస్తే కార్తీ టేస్ట్ ఏమిటో అర్థం అవుతుంది. కానీ కొంత‌కాలంగా కార్తీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌వైపే దృష్టి పెట్టాడేమో అనిపిస్తుంది. దానికి త‌గ్గ‌ట్టే ఫ‌లితాలూ దారుణంగా వ‌చ్చాయి. ఆ త‌ప్పుల్ని తెలుసుకుంటూ, కార్తీ మ‌ళ్లీ త‌న మూలాల్లోకి వెళ్లి ఎంచుకున్న క‌థ‌.. `ఖైదీ`. మ‌రి ఈసారైనా కార్తీ ప్ర‌య‌త్నం నెర‌వేరిందా?  తాను మ‌ళ్లీ ఓ హిట్టు కొట్ట‌గ‌లిగాడా, లేదా?

 

* క‌థ‌

 

దాదాపు ఎనిమిది వంద‌ల కోట్ల విలువైన డ్ర‌గ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకుంటాడు. వాటిని ఎస్‌.పి ఆఫీసులో దాస్తారు. ఆ స‌రుకుని స్వాధీనం చేసుకోవ‌డానికి ఓ ముఠారంగంలోకి దిగుతుంది. ఆ ముఠాని అడ్డుకోవ‌డానికి ఓ పోలీస్ అధికారి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఆ అధికారి అనుకోని ప‌రిస్థితుల్లో ఢిల్లీ (కార్తి) స‌హాయం తీసుకోవాల్సివ‌స్తుంది. ఢిల్లీ జీవిత ఖైదు అనుభ‌వించి, జైలు నుంచి విడుద‌లైన ఓ ఖైదీ. త‌న కూతుర్ని చూడాల‌న్న ఆశ‌తో ఉంటాడు. కానీ ఇచ్చిన మాట కోసం పోలీస్ అధికారికి స‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఆ నిర్ణ‌యం వ‌ల్ల ఢిల్లీ ఎన్ని స‌మ‌స్య‌ల‌లో  చిక్కుకోవాల్సివ‌స్తుంది?  అనేవి తెలియాలంటే ఖైదీ చూడాల్సిందే.
 

* న‌టీన‌టులు


కార్తీ న‌ట‌న అత్యంత స‌హ‌జంగా ఉంది. ఖైలు నుంచి విడుద‌లైన ఖైదీ ఇలానే ఉంటాడేమో, ఇలానే ఆలోచిస్తాడేమో అన్నంత‌గా కార్తీ ఇమిడిపోయాడు. భోజ‌నం చేసే సన్నివేశం ద‌గ్గ‌ర్నుంచి, కూతురి కోసం చెవి క‌మ్మ‌లు చేయించి, దాచుకుని, అవి కూతురికి అందుతాయే లేదో అని అల‌మ‌టించిన స‌న్నివేశం వ‌ర‌కూ.. ప్ర‌తీ చోటా న‌చ్చేస్తాడు. కార్తీ ని మిన‌హాయిస్తే అంద‌రూ కొత్త‌వాళ్లే. వాళ్లంతా ద‌ర్శ‌కుడు చెప్పింది చేశారు. పాత్ర‌ల్ని పండించారు.


* సాంకేతిక వ‌ర్గం


ఇది ద‌ర్శ‌కుడి సినిమా. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ని మిగిలిన విభాగాలు ప‌క్కాగా అమ‌లుప‌రిచాయి. కెమెరా వ‌ర్క్‌, నేప‌థ్య సంగీతం ఇవ‌న్నీ చ‌క్క‌గా కుదిరాయి. ఓ రాత్రి జ‌రిగే క‌థ ఇది. ఆ రాత్రి కూడా ఈ క‌థ‌లో ఓ భాగం అయిపోయింది.

 

* విశ్లేష‌ణ‌

 

నాలుగు గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే క‌థ ఇది. దాన్ని బ‌ట్టి స్క్రీన్ ప్లే ఎంత వేగంగా న‌డిపాడో అర్థం చేసుకోవొచ్చు. అనుకుండా, త‌న‌ది కాని స‌మ‌స్య‌లో ప‌డిపోయిన క‌థానాయ‌కుడు, ఆ స‌మ‌స్య‌లోంచి బ‌య‌ట‌ప‌డడానికి ఎంత క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది, ఆ ప్ర‌యాణంలో ఎన్ని ప్ర‌మాదాలు ఎదుర్కోవాల్సివ‌చ్చింద‌న్న‌దే క‌థ‌. తొలి స‌న్నివేశం నుంచే ఆస‌క్తి రేకెత్తించ‌డంలో ద‌ర్శ‌కులు స‌క్సెస్ అయ్యాడు. ఎనిమిది వంద‌ట కోట్ల విలువైన స‌రుకు, అది బ‌ట్టుప‌డ‌డం, దాన్ని తిరిగి ద‌క్కించుకోవ‌డానికి విల‌న్ గ్యాంగ్ వేసే ఎత్తులు, ఎస్ పీ బంగ్లాలో జ‌రిగే పార్టీ, అక్క‌డ హీరో ప‌రిచ‌యం.... ఇవ‌న్నీ చ‌క చ‌క సాగిపోతుంటాయి.

 

సినిమా మొద‌లైన 20 నిమిషాల వ‌ర‌కూ హీరోనే క‌నిపించ‌డు. కానీ ఓ ఇంటెన్స్ మాత్రం ర‌న్ అవుతూ ఉంటుంది. అది విశ్రాంతి స‌న్నివేశం వ‌ర‌కూ అలా సాగుతూనే ఉంటుంది. ఇది అన‌వ‌స‌రం అనిపించే ఒక్క ఫ్రేమ్ కూడా లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. క‌థ చాలా సింపుల్‌. కానీ కాంప్లికేటెడ్ విష‌యాలు చాలా ఉన్నాయి. వాటిని డీల్ చేస్తూ, వాటి మ‌ధ్య ఓ ఎమోష‌న్ ర‌న్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఎంత ప‌క‌డ్బందీ స్క్రీన్ ప్లే రాసుకున్నా, ద‌ర్శ‌కుడు ఎక్క‌డో ఓ చోట  దొరికిపోతాడు. అందుకే  ద్వితీయార్థంలో కొన్ని లోపాలు క‌నిపిస్తుంటాయి. ఈ సినిమాని ఇంకెంత సేపు  సాగ‌దీస్తాడు?  అనే భావ‌న మొద‌ల‌వుతుంది. కానీ మ‌ళ్లీ ప‌తాక స‌న్నివేశాల ముందు ద‌ర్శ‌కుడు ఫామ్ లోకి వ‌చ్చేస్తాడు. క్లైమాక్స్ లో `దిల్లీ ఇదంతా ఎందుకు చేశాడు` అనే ప్ర‌శ్న‌ని రేకెత్తించి, ముగించాడు. అంటే.. సీక్వెల్‌కి రెడీ అవుతున్నార‌న్న‌మాట‌.

 

ఈ సినిమాలో మ‌రో గొప్ప విష‌యం ఏమిటంటే.. కేవ‌లం హీరో ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించే సినిమా మాత్ర‌మే కాదు. త‌మ‌ది కాని స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న స్నేహితుల బృందం, అప్పుడే డ్యూటీలోకి చేరిన కానిస్టేబుల్‌, అండ‌ర్ కాప్‌గా పనిచేస్తూ, ఆ ప‌నిలోనే ప్రాణాలు విడిచిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ త్యాగాలు కూడా ఈ క‌థ‌లో క‌నిపిస్తాయి. ఆ పాత్ర‌ల్ని అంత బ‌లంగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

క‌థ‌నం
కార్తీ న‌ట‌న‌
సాంకేతిక విభాగం


* మైన‌స్ పాయింట్స్

మితిమీరిన యాక్ష‌న్‌ 
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: రియ‌లిస్టిక్ అప్రోచ్‌..

 

- రివ్యూ రాసింది శ్రీ

ALSO READ: 'విజిల్‌' మూవీ రివ్యూ & రేటింగ్!