ENGLISH

'కొండపొలం' మూవీ రివ్యూ & రేటింగ్

08 October 2021-12:22 PM

నటీనటులు: వైష్ణవ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాస్ రావు తదితరులు
దర్శకత్వం: క్రిష్
నిర్మాత‌లు: రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫర్: జ్ఞాన శేఖర్ వి.ఎస్
ఎడిటర్: శ్రావణ్ కాటికనేని 


రేటింగ్: 3/5


క్రిష్ మంచి కధకుడు. ప్రేక్షకులకు మంచి కధని చూపించాలనే తపన పడే దర్శకుడు. గమ్యం నుంచి ఇప్పటి వరకూ ఆయన ప్రయాణం వైవిధ్యంగా సాగింది. ఈసారి ఆయన ఓ నవలని సినిమాగా మార్చారు. అదే కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవలాధారంగా తెరకెక్కించారు. వైష్ణవ్‌ తేజ్‌- రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించారు. తెలుగు నవల సినిమాగా మారి చాలా రోజులైయింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఉప్పెన తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో అటు మెగా ఫ్యాన్స్ ఆసక్తి కూడా పెరిగింది. పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తున్న క్రిష్ . దానికి గ్యాప్ ఇచ్చి మరీ కొండపొలం చేశారు. మరి ఇంత ఆసక్తిరేగించిన కొండపొలం ఎలా వుందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే. 


కథ:


రవీంద్ర యాదవ్ (వైష్ణవ్‌ తేజ్‌)ది రాయలసీమలోని ఓ కరువు ప్రాంతం. రవీంద్ర తండ్రి గొర్రెల కాపరి. రవీంద్రని బాగా చదివిస్తాడు. పట్నం వచ్చిన రవీంద్ర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించిన ఉద్యోగం రాదు. కమ్యునికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ప్రతి చోట నిరాకరణ ఎదురౌతుంది. దీంతో ఊరు బాట పడతాడు. ఊర్లో కరువు తాండవిస్తుంటుంది. మనుషులు తాగడానికే సరిగ్గా నీళ్ళు దొరకని పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటి కరువు పరిస్థితిలో కుటుంబానికి జీవనాధారమైన గొర్రెలు కాపాడుకోవడం కోసం కొండపొలం వెళ్లాలని నిర్ణయించుకుంటారు.


పది మందల గొర్రెలు కొండపొలం పయనం అవుతాయి. అయితే కొండపొలం ప్రయాణం అంత సులభం కాదు. మళ్ళీ వర్షాలు కురిసేవరకూ అడవిలోనే బ్రతకాలి. ప్రతి క్షణం క్రూరమృగాలతో ముప్పు పొంచివుంటుంది. మరి కొండపొలం ప్రయాణం ఎలా సాగింది? గొర్రెలు, గొర్రెల కాపరులకు ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి. కొండపొలంలో ఓబులమ్మ (రకుల్ ) రవీంద్రల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? కొండపొలం నేర్పిన పాఠాలు రవీంద్ర ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిక కావడానికి ఎలా దోహదపడ్డాయి ? అనేది మిగిలిన కధ.


విశ్లేషణ:


 కొండపొలం చదువరులని విపరీతంగా ఆకట్టుకున్న నవల. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సీమ స్థితిగతులు, అడవి, దాని చుట్టూ అల్లుకున్న నేపధ్యాలని అద్భుతంగా చిత్రీకరించారీనవలలో. దర్శకుడు క్రిష్ కూడా అంతే నిజాయితీతో వెండితెరపైకి తీసుకొచ్చారు. కొండపొలం అనుభవమే చాలా మందికి కొత్త. నవల చదివినప్పుడు కూడా ఇదే అనుభూతి కలుగుతుంది. తెరపై కూడా కొత్త అనుభూతి కలిగింది. నవలలో ప్రతి పాత్రకి ప్రాధాన్యత వుంటుంది. సినిమాలో కూడా పరిచయమైన ప్రతి పాత్రకి కూడా కధతో ముడిపెడుతూ స్క్రీన్ ప్లేయ్ రాసుకోవడం బావుంది.


మూల కధలో కి వెళ్ళడానికి కొంత సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఎప్పుడైతే కొండపొలం ప్రయాణం మొదలౌతుంది కధ మరో స్థాయికి వెళుతుంది. గొర్రెలు మేపడమే కాకుండా అడవి చుట్టూ జరుగుతున్న కధని చూపించారు. చెట్లు నరకడం, మూగ జీవాలు .. ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్లారు. ప్రతి కధలో ఒక విలన్ ఉంటాడు. అయితే కొండపొలం లో విలన్ మాత్రం పులి. పులితో వచ్చిన సన్నీవేషాలు హాలీవుడ్ సీన్లు గుర్తుకు తెస్తాయి. నవలలో ఓబులమ్మ పాత్ర లేదు. అయితే రకుల్ పాత్రని కొత్తగా రాసుకొని ఆ ప్రేమ కధని కూడా నిజాయితీగా చూపించగలిగాడు దర్శకుడు. రవీంద్ర పాత్రలో ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతాడు. అడవి అంటే భయపడే వ్యక్తి ఆ అడవిని అర్ధం చేసుకుని నడిచే ప్రయాణం కొండపొలంలో ఆవిష్కరించాడు దర్శకుడు. ఇదొక పర్శనాలిటీ డెవలాప్మెంట్ పాఠంలా కూడా ఉపయోగపడుతుంది. 


నటీనటులు:


వైష్ణవ్‌ తేజ్‌ కి రెండో సినిమానే, కానీ చాలా అనుభవం వున్న నటుడిలా కనిపించాడు. చాలా సెటిల్ గా చేశాడు. ఈ కధని ఎంచుకోవడం వైష్ణవ్‌ తేజ్‌ అభిరుచి అద్దం పడుతుంది. వైష్ణవ్‌ తేజ్‌ కెరీర్ లో చెప్పుకోదగ్గ పాత్ర ఇది. రకుల్ మొదటిసారి డీగ్లామర్ రోల్ చేసింది. ఓబులమ్మ పాత్ర ఆమెకు కూడా గుర్తుండిపోతుంది. సాయి చంద్ మరోసారి తన అనుభవంతో అద్భుతమైన నటన కనబరిచాడు. కోటా పాత్ర చిన్నదే. అయితే చాలా రోజుల తర్వాత ఆయన్ని తెరపై చూసే అవకాశం దొరికింది. మిగతా నటులు పరిధి మేర నటించారు


సాంకేతిక వర్గం : కొండపొలంలో అద్భుతమైన సినిమాటోగ్రఫీ కుదిరింది. అడవిని అద్భుతంగా చిత్రీకరించారు. యాక్షన్ సీన్స్ చాలా నేచురల్ గా తీశారు. ఎంఎం కీరవాణీ నేపధ్య సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. రెండు పాటలు చూడ్డానికి, వినడానికి బావున్నాయి. సీమ డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సీమ యాస చక్కగా పలికించారు. నిర్మాణ విలువలు బావున్నాయి 


ప్లస్ పాయింట్స్


వైవిధ్యమైన కధ 
అడవి నేపధ్యం 


మైనస్ పాయింట్స్


నెమ్మదించిన కధనం 
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం  


ఫైనల్ వర్డిక్ట్ : కొండపొలం ..అద్భుతమైన దృశ్యకావ్యం

ALSO READ: ‘కొండపొలం’ తప్పకుండా అవార్డులు, రివార్డులు సాధిస్తుంది - మెగాస్టార్