ENGLISH

'మ‌ణిక‌ర్ఱిక‌' మూవీ రివ్యూ & రేటింగ్

25 January 2019-18:19 PM

తారాగణం: కంగనా రనౌత్, అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి తదితరులు
సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్
ఎడిటర్: రామేశ్వర్ భగత్
సినిమాటోగ్రఫీ: జ్ఙానశేఖర్
నిర్మాత: కమల్ జైన్
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్
విడుద‌ల‌: 25 జ‌న‌వ‌రి 2019

రేటింగ్‌: 2.75/5

ఈమ‌ధ్యకాలంలో ఎక్కువ‌గా వినిపించిన సినిమా పేరు.. `మ‌ణిక‌ర్ణిక‌`. తెలుగువారు త‌మ పుస్త‌కాల్లో నాడ్ డిటైల్డ్‌గా చ‌దువుకున్న ఓ వీర‌నారి క‌థ ఇది. కంగ‌నా రనౌత్ ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌గా న‌టించింది. తెలుగు ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి క‌థ అందించారు. అదీ కాగ తెలుగు ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ సినిమా చుట్టూ కొన్ని వివాదాలూ న‌డిచాయి. క్రిష్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాక‌.. ఈ సినిమా స్క్రిప్టు కూడా మారిపోయింది. కంగ‌నా సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మొద‌లెట్టింది. అలా... `మ‌ణిక‌ర్ఱిక‌`కు కావ‌ల్సినంత ప్ర‌చారం దొరికింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి మ‌ణిక‌ర్ణిక అంచ‌నాల్ని అందుకుందా? ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ గురించి చరిత్ర‌లో ఉన్న‌ది ఉన్న‌ట్టుగా తీశారా? క‌ల్ప‌న‌లు జోడించారా?

క‌థ‌

మణికర్ణిక (కంగనా రనౌత్‌) ఝాన్సీ చక్రవర్తి గంగాధర్‌ రావు (జిషు సేన్‌గుప్తా) ని వివాహం చేసుకుంటుంది. అప్ప‌టి నుంచి మ‌ణిక‌ర్ణిక కాస్త లక్ష్మీబాయిగా మారిపోతుంది. ఆమె చ‌తుర‌త‌, ధీర‌త్వంతో రాజ్య మ‌న‌సుని గెలుచుకుంటుంది. స‌రిగ్గా అప్పుడే భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తుంటుంది. ఝాన్సీ ని కూడా కైవ‌సం చేసుకోవ‌డానికి ప‌న్నాగం ప‌న్నుతారు. ఈ కుట్ర‌ని లక్ష్మీబాయి తిప్పికొడుతుంది. బ్రిటీష్ వారు స్నేహ హ‌స్తం అందించినా నిరాక‌రిస్తుంది. దాంతో బ్రిటీష్‌ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ వశం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. ఝాన్సీని బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ల‌కుండా.. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ ఎలా కాపాడింది? ర‌వి అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క వ‌నిత ఎలా గ‌డ‌గ‌డ‌లాడించింది? అనేదే క‌థ‌.

న‌టీన‌టుల పనితీరు​

మ‌ణిక‌ర్ణిక‌గా కంగ‌నా ప్రాణం పోసింది. ఆమె కెరీర్‌లో మ‌ర్చిపోలేని పాత్ర‌ల‌లో ఇదొక‌టిగా మిగిలిపోతుంది. భావోద్వేగ‌భ‌రిత‌మైన స‌న్నివేశాల్లో, యుద్ధ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న‌.. అన‌న్య సామాన్యంగా క‌నిపిస్తుంది. ఈ పాత్ర కోసం ఆమె ఎంత క‌ష్ట‌ప‌డిందో అర్థమ‌వుతూనే ఉంటుంది. కంగ‌న పాత్ర‌తో పోలిస్తే మిగిలిన పాత్ర‌ల‌కు అంత ప్రాధాన్యం లేద‌నే చెప్పాలి. సేన్‌గుప్తా, డానీ డెంగోజపా, అంకితా లోఖండే... ఇలా అనుభ‌వ‌జ్ఞులంతా తెర‌పై క‌నిపించ‌డంతో నిండుద‌నం వ‌చ్చింది.

విశ్లేష‌ణ‌

చ‌రిత్ర‌ని ఎప్పుడూచ‌రిత్ర‌లా తీయలేం. అలా తీస్తే డాక్యుమెంట‌రీ అవుతుంది. డ్రామా కోసం కాస్త క‌ల్ప‌న జోడించాల్సిరావొచ్చు. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌, ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కాస్త చొర‌వ తీసుకున్నార‌నే చెప్పాలి. మ‌నం చ‌దువుకున్న చ‌రిత్ర పాఠానికి ఇంకాస్త క‌ల్ప‌న జోడించి తీసిన సినిమా ఇది. మ‌ణిక‌ర్ణిక బాల్యం, ఆమె ఎదిగిన విధానం.. ఝాన్సీ రాణీగా అవ‌త‌రించ‌డం... ఇలా తెర‌పై ఈ క‌థ ఓ పాఠంలా సాగిపోతుంటుంది. బ్రిటీష్ వారితో ఎప్పుడైతే యుద్ధం ప్ర‌క‌టించిందో అప్పుడు ఈ క‌థ మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారుతుంది.

ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ఈ చరిత్ర పాఠంలో క‌నిపిస్తాయి. దేశం గర్వించే ఓ మ‌హిళ క‌థ‌ని చూస్తున్నాం అన్న ఉద్విగ్న‌త క‌లిగిస్తాయి. మ‌ణిక‌ర్ణిక జీవితం సాగిన విధానం, ఆమె జీవితంలో ఎదురైన స‌మ‌స్య‌లు, అంతఃఘ‌ర్ష‌ణ‌, వీర‌త్వం, యుద్ధాలు...ఇలా ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా స్క్రీన్ ప్లేతో ప‌రుగులు పెట్టించాడు. కొన్ని స‌న్నివేశాలు చూస్తుంటే సంజ‌య్ లీలా బ‌న్సాలీ సినిమా చూస్తున్నామా? అనిపిస్తుంటుంది. ఆ భారీద‌నం, ఎమోష‌న్ సినిమాలో క‌నిపిస్తుంటుంది.

అయితే రాను కాను.. క‌థ‌లో, క‌థాగ‌మ‌నంలో న‌త్త‌న‌డ‌క మొద‌ల‌వుతుంది. చూసిన స‌న్నివేశ‌మే మ‌ళ్లీ చూస్తున్నామా? అనిపిస్తుంది. ఎంత‌సేపూ.. మ‌ణిక‌ర్ణిక ఎలివేష‌న్స్‌పైనే దృష్టి పెట్టిన ద‌ర్శ‌కుడు, మిగిలిన పాత్ర‌ల్ని మాత్రం ప‌ట్టించుకోకుండా వ‌దిలేశాడు. ఇది చ‌రిత్ర‌లో జ‌రిగిందా? అనే అనుమానాలూ కొన్ని సార్లు క‌లుగుతుంటుంది. అంటే.. అక్క‌డ ద‌ర్శ‌కుడు మితిమీరిన స్వేచ్ఛ తీసుకున్నాడ‌న్న‌మాట‌. మ‌ణిక‌ర్ణిక ఓ వీర‌నారి క‌థ‌. దేశం కోసం పోరాడిన ఓ వ‌నిత ధీర‌గాధ‌. అణువ‌ణువూ.. దేశ‌భ‌క్తి ఉప్పొంగేలా తీయాల్సిన సినిమా ఇది. ఆ ల‌క్ష‌ణం మాత్రం ఈ సినిమాలో క‌నిపించ‌దు.

సాంకేతిక వ‌ర్గం

చరిత్ర క‌థ‌ని చెప్ప‌డం అంత సామాన్య‌మైన విషయం కాదు. ఆ కాలంలోకి ప్రేక్ష‌కుడ్ని తీసుకెళ్లాలి. సెట్స్‌, కెమెరా వ‌ర్క్ ఆ ప‌నిచేశాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆక‌ట్టుకుంటాయి. సంగీతం అంత‌ర్జాతీయ స్థాయిలో ఉంది. కాస్ట్యూమ్ విభాగం కూడా చాలా చ‌క్క‌గా ప‌నిచేసింది. పాట‌లు అంత ర‌క్తిక‌ట్ట‌వు. తెలుగులో విన్న‌ప్పుడు మ‌రీ కృతకంగా అనిపిస్తాయి. మాట‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. ఎక్కువ‌గా వీర‌త్వాన్ని సూచించేవే వినిపిస్తాయి.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ నేప‌థ్యం
+ కంగ‌న న‌ట‌న‌
+ సాంకేతిక విభాగం
+ యుద్ధ స‌న్నివేశాలు

* మైన‌స్ పాయింట్స్‌

- పాట‌లు
- ఎమోష‌నల్ గా క‌నెక్ట్ అవ్వ‌క‌పోవ‌డం

ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: కంగ‌న కోసం చూడాల్సిందే

రివ్యూ రాసింది శ్రీ.

ALSO READ: 'మిస్ట‌ర్ మ‌జ్ను' మూవీ రివ్యూ & రేటింగ్