ENGLISH

నా నువ్వే రివ్యూ & రేటింగ్

14 June 2018-12:09 PM

తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళ భరణి తదితరులు
నిర్మాణ సంస్థ: కూల్ బ్రీజ్ సినిమాస్
సమర్పణ: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
సంగీతం: శరత్
ఛాయాగ్రహణం: PC శ్రీరాం
నిర్మాతలు: కిరణ్ & విజయ్ కుమార్
రచన-దర్శకత్వం: జయేంద్ర

రేటింగ్: 2/5

ఈ సంవత్సరం సగం పూర్తయేసరికి ఈ చిత్రంతో కలిపి కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు (MLA & నా నువ్వే) విడుదల చేయగలిగాడు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఒక లవర్ బాయ్ గా మీసాలని ట్రిమ్ చేసి ఒక కొత్త మేక్ ఓవర్ తో మనముందుకి వచ్చాడు. అలాగే తమన్నా కూడా మొదటిసారిగా కళ్యాణ్ పక్కన నటిస్తుండడంతో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ తోడైంది. యాడ్ ఫిలిం మేకర్ గా మంచి పేరు ఉన్న జయేంద్ర ఈ చిత్రానికి రచన-దర్శకత్వం వహించారు. 

మరి ఈ చిత్రం వీరందరితో పాటు సినిమా చూసే ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుందా లేదా అన్నది ఈ క్రింద నా నువ్వే సమీక్షలో తెలుసుకుందాం...

కథ:

రైలు ప్రయాణంలో మీరా (తమన్నా)కి అనుకోకుండా ఒక పుస్తకం దొరుకుతుంది, అయితే దానిని అదే ట్రైన్ లో విడిచిపెట్టేస్తుంది. కాని ఆ పుస్తకం అటు ఇటు చేతులు మారుతూ పదే పడే మీరా చేతికి వస్తుంటుంది. అలా వచ్చిన క్రమంలోనే అందులో ఒక అబ్బాయి ఫోటోని చూస్తుంది, తరువాత జరిగిన సంఘటనల వల్ల ఆ అబ్బాయే తన ‘లక్కీ చార్మ్’ అని ఇదంతా “విధిరాత” అని నమ్ముతుంది. దీనితో అతనిని ఎలాగైనా కలుసుకోవాలని, అతని పైన తనకి ఉన్న ప్రేమని చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది.

ఇంతకి ఆ అబ్బాయే వరుణ్ (కళ్యాణ్ రామ్). చాలా రోజులు వెతికాక ఒకరోజు మీరాకి వరుణ్ కనిపిస్తాడు. అయితే “విధిరాత” అనేది ఏమి ఉండదు అని నమ్మే వరుణ్.. మీరాకి ఒక పరీక్ష పెడతాడు. అందులో గనుక మీరా గెలిస్తే, విధిరాత ని తాను కూడా నమ్ముతాను అనే షరతు పెడతాడు.

ఇంతకి ఆ పరీక్ష ఏంటి? అందులో మీరా నేగ్గిందా? చివరికి కలుసుకున్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం సినిమా చూస్తే మీకే తెలుస్తాయి.

 

నటీనటుల పనితీరు:

కళ్యాణ్ రామ్: తాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే పంథాని మార్చుకుని ఈ సినిమా చేశాడు. అందుకు కళ్యాణ్ రామ్ ని అభినందించాల్సిందే. అయితే తమన్నా తో రొమాంటిక్ సీన్స్ లో గాని డాన్స్ లో గాని ఇంకాస్త మెరుగ్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది.

తమన్నా: ఈ చిత్రం ఒక రకంగా మొత్తం తన చుట్టే తిరుగుతుంది. విధిరాతని బలంగా నమ్మే అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. ఇటు నటనపరంగానే కాకుండా అటు గ్లామర్ పరంగా కూడా సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది అనే చెప్పాలి.

తనికెళ్ళ భరణి, పోసాని, బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ అక్కడక్కడ మెరిసారు.  

విశ్లేషణ:

ప్రేమ కథలకు మన సినీ పరిశ్రమలో కొదవేలేదు అని చెప్పొచ్చు. అయితే అలాంటి ఒక ప్రేమ కథకి “విధిరాత” అనే అంశాన్ని జోడించి ఈ సినిమాని తీశారు. కథ వరకు కొద్దిగా ఆసక్తి కలిగించేలానే తీసుకున్నా అది తెరకెక్కించే ప్రయత్నంలో మాత్రం అంతగా కృతకృత్యులయినట్టుగా కనపడలేదు.

దర్శకుడు జయేంద్ర యాడ్ ఫిలిమ్ మేకర్ గా చాలా పేరు గడించాడు. అయితే ఆయన సినిమా తీస్తున్నప్పుడు కూడా ఆయనకి “ యాడ్ ఫిలిం మేకింగ్” పద్ధతి నుండి బయటకి వచ్సినట్టుగా అనిపించలేదు. యాడ్ ఫిలిం అలాగే సినిమా తీయడం రెండు వేరు వేరు అలాంటిది ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకి ఒక హై క్వాలిటీ యాడ్ ఫిలిం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది.

సినిమా కథనంలో ఉండే భావోద్వేగాలు ఈ సినిమాలో అంతగా కనిపించవు, ఒకవేళ ఉన్నా అది ప్రేక్షకులని కట్టిపడేసేలా లేదు. చాలా సన్నివేశాలు చాలా నెమ్మదిగా వెళ్ళినట్టుగా అనిపిస్తాయి, అయితే సినిమా నిడివి రెండు గంటలకే కుదించడం దర్శకుడు చేసిన ఒక తెలివైన పనిగా చెప్పొచ్చు.

పాటల చిత్రీకరణలో కూడా సహజత్వానికి దూరంగా CGలలోనే ఎక్కువగా తీయడంతో సాహిత్యం బాగున్నా పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. చివరగా ఈ సినిమా ఒక రెండు గంటల హై క్వాలిటీ యాడ్ ఫిలిం అని చెప్పొచ్చు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఛాయాగ్రహణంలోనే ఒక లెజండరీ అనే పిలవబడే PC శ్రీరాం మరోసారి తన మార్కుని ఈ చిత్రంలో చూపిస్తాడు. విజువల్స్ చాలా బాగుంటాయి. ఇక సంగీతానికి వస్తే, మొత్తం ఆల్బమ్ లో రెండు పాటలు వినడానికి బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా శరత్ బాగానే కంపోజ్ చేశాడు. సెట్టింగులు చూస్తే నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా ఉన్నట్టు మనకి అర్ధమవుతుంది.

బలాలు:

+ తమన్నా
+ ఛాయాగ్రహణం

బలహీనతలు:

- సినిమాటిక్ ఫీల్ లేకపోవడం
- కథనంలో లోపాలు

ఆఖరి మాట: నా నువ్వే- ఈ సినిమా రాత ప్రేక్షకుల చేతిలో ఉంది...

రివ్యూ రాసింది సందీప్

 

ALSO READ: కళ్యాణ్‌రామ్‌ - తమన్నా కెమిస్ట్రీ అంతకు మించి..