ENGLISH

'నెక్ట్స్ ఏంటి' మూవీ రివ్యూ & రేటింగ్

07 December 2018-20:04 PM

తారాగణం: సందీప్ కిషన్, తమన్నా, నవదీప్, పూనమ్ కౌర్, శరత్ బాబు & తదితరులు
సంగీతం: లియాన్ జోన్స్
ఎడిటర్: అనిల్ కుమార్ బొంతు
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
నిర్మాత: నవీన్ చౌదరి
దర్శకత్వం: కునాల్ కోహ్లీ

రేటింగ్: 2.5/5

4 జీ జ‌న‌రేష‌న్ ఇది. చూపుల‌తో ప్రేమించుకోవ‌డాలు, మూగ‌గా ఆరాధించుకోవ‌డాలు లేనే లేవు.  చూపుల‌కంటే ముందు శరీరాలు క‌లుస్తున్నాయి. సెక్స్ అనేది ప్రేమ‌లో ఓ భాగంగా మారిపోయింది. ఆ మాట‌కొస్తే.. సెక్స్ లోనే ప్రేమ భాగంలా క‌నిపిస్తోంది.  కేవ‌లం ప్రేమ విష‌యంలోనూ కాదు, అన్ని అంశాల్లోనూ చాలా మార్పు క‌నిపిస్తోంది. అబ్బాయిల నుంచి అమ్మాయిలు, అబ్బాయిల నుంచి అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. అవ‌న్నీ... తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేసింది `నెక్ట్స్ ఏంటి`?  ఫ‌నా లాంటి హృద్య‌మైన చిత్రాల్ని అందించిన కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం - త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌డంతో `నెక్ట్స్ ఏంటి`పై ఆస‌క్తి క‌లిగింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  న‌వ‌త‌రం భావాల్ని ఎంత వ‌ర‌కూ ప్ర‌తిబింబించింది?

క‌థ‌

ప్రేమ వేరు, సెక్స్ వేరు అని న‌మ్మే అమ్మాయి... టానీ (త‌మ‌న్నా).  ప్రేమ‌లోనే సెక్స్ ఉంద‌ని, సెక్స్ తోనే ప్రేమ ప‌రిపూర్ణం అవుతుంద‌ని భావించే అబ్బాయి సంజూ (సందీప్ కిష‌న్‌). వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. అభిప్రాయ బేధాల‌తో విడిపోతారు. టానీకి క్రిష్ (న‌వ‌దీప్‌) ప‌రిచ‌యం అవుతాడు. క్రిష్‌కి అప్ప‌టికే పెళ్లయి, ఆరేళ్ల పాప కూడా ఉంటుంది. టానీ - క్రిష్ అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో క‌ల‌సిప్ర‌యాణం చేస్తారు. మ‌రోవైపు..  సంజూకి రోషిణి అనే అమ్మాయితో నిశ్చితార్థం జ‌రుగుతుంది. దాదాపుగా వీరిద్ద‌రి భావాలూ ఒకేలా ఉంటాయి. మ‌రి... ఈ కొత్త జంట‌ల‌తో వాళ్ల ప్ర‌యాణం ఎలా సాగింది?  చివ‌ర‌కు ఎవ‌రు ఏం తెలుసుకున్నారు?  అనేదే క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు..

త‌మ‌న్నా గ్లామ‌ర్ ఎప్పుడైనా ఆక‌ట్టుకునే అంశ‌మే. అయితే ఈసారి త‌మ‌న్నా గ్లామ‌ర్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది. కేవ‌లం త‌న‌లోని న‌టిని చూపించే ప్ర‌య‌త్నం చేసింది. అయితే అది కూడా అంతంత మాత్రంగానే సాగింది. పాత్ర ప్ర‌వ‌ర్తించే విధానంలోనే కంటిన్యుటీ లేక‌పోవ‌డం ప్ర‌ధాన‌మైన లోపం. న‌వ‌దీప్ చాలా డీసెంట్‌గా ఉన్నాడు. త‌న పాత్ర హుందాగా ఉంది. దానికి విరుద్ధంగా సందీప్ కిష‌న్ అల్ల‌రి చేశాడు. అక్క‌డ‌క్క‌డ హ‌ద్దులు దాటి న‌టించాడు. శ‌ర‌త్‌కుమార్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. పూన‌మ్ కౌర్ స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది.

విశ్లేష‌ణ‌...

ప్రేమ - పెళ్లి - సెక్స్ త‌దిత‌ర విష‌యాల్లో న‌వ‌త‌రం అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెర పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఆ ఆలోచ‌న బాగుంది. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా నచ్చుతుంది కూడా. అయితే... దాన్ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్న‌మే ఏమాత్రం అత‌క‌లేదు. పాత్ర‌ల స్వ‌భావాల్లోనే చెప్ప‌లేనంత గంద‌ర‌గోళం ఉంది. ఏ పాత్ర ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో?  ఎప్పుడు ఎవ‌రివైపు వ‌కాల్తా పుచ్చుకుంటుందో ఏమాత్రం అర్థం కాదు. పైగా స‌న్నివేశాల‌న్నీ స్పీచులు ఇస్తున్న‌ట్టు సుదీర్ఘంగా సాగాయి.

ద‌ర్శకుడు ఈ నాలుగు ప్ర‌ధాన పాత్రల ద్వారా ఒకే విష‌యం అటు తిప్పి ఇటు తిప్పి చెప్ప‌డంతో.. నీర‌సం ఆవ‌హిస్తుంది.  క‌థ‌ని ప్రారంభించిన విధాన‌మే బోరింగ్‌గా ఉంటుంది. త‌మ‌న్నా - సందీప్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ అస్స‌లు కుద‌ర్లేదు. వాళ్ల మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాలూ అంతంత‌మాత్ర‌మే. ఒకేసీన్ మ‌ళ్లీ మ‌ళ్లీ చూసిన‌ట్టు అనిపిస్తుంది. సెక్స్ గురించి మాట్లాడుకునే సీన్ ఒక్క‌టే.. కాస్త బోల్డ్‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

శ‌ర‌త్‌బాబు - త‌మ‌న్నా మ‌ధ్య సాగే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ఇలాంటి తండ్రి ఉంటే బాగుంటుంది క‌దా... అని నేటి త‌రం అమ్మాయిలు అనుకునేలా ఉంటుంది. అయితే సంప్ర‌దాయ వాదులు ఈ పాత్ర‌నీ వేలెత్తి చూపించే అవ‌కాశం ఉంది. ద్వితీయార్థంలో ఎక్కువ భాగం త‌మ‌న్నా - న‌వ‌దీప్‌ల‌పై సాగుతుంది. ఒక‌రంటే ఒక‌రికి ఎందుకు ప్రేమ క‌లిగింది?  న‌వ‌దీప్‌ని వ‌దిలేసి త‌మ‌న్నా ఎందుకు వెళ్లిపోయింది అనే విష‌యాల్లో క్లారిటీ లేదు. స‌న్నివేశాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంటాయి.

వినోదం, ఎమోష‌న్‌, కెమిస్ట్రీ... ఇవ‌న్నీ భూత‌ద్దం పెట్టుకుని వెదికినా క‌నిపించ‌వు. ఏ క‌థ‌కైనా సంఘ‌ర్ష‌ణ అవ‌స‌రం. ఇందులో అదీ లేదు.  ద‌ర్శ‌కుడు నేటిత‌రం అమ్మాయిలు, అబ్బాయిల‌పై ఓ అభిప్రాయాన్ని ఏర్ప‌ర‌చుకుని, దాన్ని చెప్ప‌డానికి ఓ సినిమా తీసేశాడేమో అనిపిస్తుంది. నెక్ట్స్ ఏంటి?  అనే ఆస‌క్తిగానీ, ఆత్రుత గానీ ఏమాత్రం క‌ల‌గ‌వు. అలాంట‌ప్పుడు ఈ పేరు ఎందుకు ఎంచుకున్నాడో ద‌ర్శ‌కుడికే తెలియాలి.

సాంకేతిక వర్గం...

కునాల్ కోహ్లి సినిమా అంటే బాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో ఊహిస్తారంతా. కానీ అంత లేదిక్క‌డ‌. సీరియ‌ల్‌, వెబ్ సిరీస్ ల క్వాలిటీలో సాగింది సినిమా. విదేశాల్లో తీసిన సినిమా కాబ‌ట్టి ఆమాత్రం రిచ్ నెస్ క‌నిపించింది. త‌క్కువ లొకేష‌న్ల‌లో సినిమాని చుట్టేయాల‌న్న తాప‌త్ర‌యం తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా - క‌థ‌నం మాత్రం పేల‌వంగా సాగి ప్రేక్ష‌కుల స‌హ‌నానికి పరీక్ష పెట్టింది.

* ప్ల‌స్ పాయింట్స్‌

త‌మ‌న్నా

* మైన‌స్ పాయింట్స్‌ 

క‌థ‌నం
బోరింగ్ స‌న్నివేశాలు

పైన‌ల్ వ‌ర్డిక్ట్‌: నెక్ట్స్ ఏంటి - ఏమీ లేదు

రివ్యూ రాసింది శ్రీ.

ALSO READ: 'నెక్ట్స్ ఏంటి' మూవీ ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి