ENGLISH

ఒక్క క్షణం మూవీ రివ్యూ & రేటింగ్స్

28 December 2017-13:56 PM

తారాగణం: అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల, దాసరి అరుణ్ కుమార్
నిర్మాణ సంస్థ: లక్ష్మి నరసింహ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మణిశర్మ
మాటలు: అబ్బూరి రవి
ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు
నిర్మాతలు: చక్రి & దిరేష్
రచన-దర్శకత్వం: VI ఆనంద్  

యావరేజ్ యూజర్ రేటింగ్: 2.75/5

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప‌ట్టం క‌డుతున్న రోజులు ఇవి.  బ‌డ్జెట్ చిన్న‌దా, పెద్ద‌దా?  హీరో తెలిసిన వాడా, స్టారా?  అని చూడ‌డం లేదు. కాన్సెప్ట్ బాగుంటే.. అంద‌లం ఎక్కిస్తున్నారు ప్రేక్ష‌కులు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా తో అలా ఓ చ‌క్క‌టి కాన్సెప్ట్‌తో క‌థ రాసుకొని హిట్టు కొట్టాడు వి.ఐ ఆనంద్‌. ఇప్పుడు స‌మాంత‌ర జీవితాలు అనే మ‌రో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.  శ్రీ‌ర‌స్తు - శుభ‌మ‌స్తు తో ఓ హిట్టు కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చిన శిరీష్ కి ఈ కాన్సెప్ట్ కిక్ ఇచ్చిందా,  వీఐ ఆనంద్ చెప్పాల‌నుకున్న స‌మాంత‌ర జీవితాలు అనే క‌థ ఎంత వ‌ర‌కూ ఓకే అనిపించుకుంది??  చూద్దాం.. 

* క‌థ‌

జీవా( అల్లు శిరీష్) తొలి చూపులోనే జో (సుర‌భి)ని చూసి ప్రేమిస్తాడు. సుర‌భి కూడా.. జీవాని ఇష్ట ప‌డుతుంది. అయితే..  శ్రీ‌నివాస్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌) జీవితంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయో.. స‌రిగ్గా అవే సంఘ‌ట‌న‌లు జీవా జీవితంలోనూ జ‌రుగుతుంటాయి. జీవా ప్రేమ‌క‌థ‌లానే.. శ్రీ‌నివాస్ ప్రేమ‌క‌థ కూడా జ‌రుగుతుంటుంది. అయితే... శ్రీ‌నివాస్ తాను ప్రేమించి అమ్మాయి స్వాతి (సీర‌త్ క‌పూర్‌)ని చంపేస్తాడు. మ‌రి.. జీవా కూడా తాను ప్రేమించిన జోని చంపేస్తాడా??  అస‌లు శ్రీ‌నివాస్ స్వాతిని ఎందుకు చంపాల్సివ‌చ్చింది?  ఈ స‌మాంత‌ర జీవితాల వెనుక ఉన్న క‌థేంటి??  అనేది తెరపై చూసుకుని తెలుసుకోవాల్సిందే.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

శిరీష్ కాస్త కాస్త ఇంప్రూవ్ అవుతున్నాడు. కొన్ని యాంగిల్స్ లో చూస్తుంటే అల్లు అర్జున్‌లా అనిపిస్తున్నాడు. ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాలి. 

సుర‌భి గ్లామ‌రెస్‌గా ఉంది. సీర‌త్ క‌పూర్ కి న‌టించే స్కోప్ వ‌చ్చింది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌కీ ఇది కొత్త త‌ర‌హా పాత్రే.  

దాస‌రి అరుణ్ కుమార్ చివ‌ర్లో వ‌చ్చాడు విల‌న్ గా. త‌నకు ఇచ్చిన డ‌బ్బింగ్ మ‌రీ గంభీరంగా ఉంది. దాని ముందు దాస‌రి అరుణ్ కుమార్ తేలిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

* విశ్లేష‌ణ‌

స‌మాంత‌ర జీవితాలు అనే పాయింట్ కొత్త‌ది. ఒకరి జీవితంలో జ‌రిగే విష‌యాలు మ‌రొక‌రి జీవితంలోనూ జ‌ర‌గ‌డం ఉత్కంఠ‌త‌ని రేకెత్తించే అంశం. దాని చుట్టూ క‌థ అల్లు కోవ‌డం బాగుంది. అయితే పాత్రల ప‌రిచ‌యం చేయ‌డం ద‌గ్గ‌ర్నుంచి.. స‌మాంత‌ర జీవితం అనే పాయింట్ వ‌ర‌కూ ఈ క‌థ‌ని తీసుకెళ్ల‌డానికే స‌గం సినిమా అయిపోతుంది. పాత్ర‌ల ప‌రిచ‌యానికి, క‌థ‌లోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు తీసుకున్న స‌మ‌యం ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టేదే. విశ్రాంతి ముందు.. స‌మాంత‌ర జీవితాలు అనే పాయింట్ వ‌స్తుంది. అక్క‌డి నుంచి మ‌ర్డ‌ర్ ఎలిమెంట్ మేళ‌వించాడు ద‌ర్శ‌కుడు. దాంతో.. క‌థ‌పై ఆస‌క్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో ఆ టెంపోని అదే విధంగా కంటిన్యూ చేశాడు. స్వాతి చావు వెనుక కార‌ణం తెలుసుకొనే ద‌గ్గ‌ర నుంచి స‌స్పెన్స్ ప‌తాక స్థాయికి చేరుతుంది. అయితే.. అక్క‌డి నుంచి క‌థ ని ఇంకాస్త వైవిధ్యంగా రాసుకోవాల్సింది.

 

ఓ రొటీన్‌ క్రైమ్ ఎపిసోడ్ జోడించి... ఈ కొత్త క‌థ‌ని కాస్త క‌లుషితం చేశాడు. అక్క‌డి నుంచి క్లైమాక్స్ వ‌ర‌కూ క‌థ మామూలుగానే సాగింది. ఇక్క‌డ ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌ల‌చుకున్న పాయింట్ కొత్త‌ది. అయితే దాన్ని పాత ప‌ద్ధ‌తిలో చూపించ‌డం మాత్రం బాగోలేదు. స‌మాంత‌ర జీవితాలు అనే కాన్సెప్ట్‌ని ప్రేక్ష‌కులు అర్థం చేసుకోవ‌డానికి ద‌ర్శ‌కుడు టైమ్ తీసుకొని ఉండొచ్చు. అయితే.. సింపుల్‌గా రెండు స‌న్నివేశాల్లో చూపించాల్సిన దాన్ని.. స‌గం సినిమా  న‌డిపించేశాడు. పాయింట్ తో క‌లిసి న‌డ‌వ‌కుండా... చివ‌ర్లో ఓ మ‌ర్డ‌ర్ ఎలిమెంట్ జోడించాడు. ఇవి.. క‌థ‌లో న‌వ్య‌త‌పై ప్ర‌భావం చూపించే విష‌యాలే.

* సాంకేతిక వ‌ర్గం

మ‌ణిశ‌ర్మ పాట‌లు ఓ మోస్త‌రుగా ఉన్నాయి. కానీ నేప‌థ్య సంగీతం అక‌ట్టుకుంది. కెమెరా ప‌నిత‌నం, సంభాష‌ణ‌లు మెరిశాయి. ద‌ర్శ‌కుడు అనుకున్న  పాయింట్ కొత్త‌ది. దాన్ని కొత్త‌గానూ చెప్పాల‌నుకున్నాడు. కానీ.. ఆ ప్ర‌య‌త్నం ఆద్యంతం ఒకేలా సాగ‌లేదు. ఫ‌స్టాఫ్ లో ఓ సినిమా.. సెకండాఫ్‌లో మ‌రో సినిమా చూసిన‌ట్టైంది.

* ప‌స్ల్ పాయింట్స్‌

+ కాన్సెప్ట్‌
+ సుర‌భి గ్లామ‌ర్‌
+ ప్రీ క్లైమాక్స్‌

* మైన‌స్ పాయింట్స్‌

- సినిమా ప్రారంభం
- క్లైమాక్స్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్ :  ఒక్క క్ష‌ణం..  పాస్ మార్కుల‌తో గ‌ట్టెక్కేసింది

రివ్యూ బై శ్రీ