ENGLISH

'రాగల 24 గంట‌ల్లో' మూవీ రివ్యూ & రేటింగ్!

22 November 2019-14:10 PM

నటీనటులు:  సత్య దేవ్, ఇషా రెబ్బ తదితరులు.
దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
నిర్మాతలు: కానూరు శ్రీనివాస్
సంగీతం: రఘు కుంచె
విడుదల తేదీ: నవంబర్ 22,  2019

 

రేటింగ్‌: 2.75/5

 

వినోదాత్మ‌క చిత్రాలు తీయ‌డంలో సిద్ద‌హ‌స్తుడు అనిపించుకున్నాడు శ్రీ‌నివాస‌రెడ్డి. త‌న నుంచి సినిమా వ‌చ్చి చాలా కాలం అయ్యింది. పైగా ఫామ్‌లో లేడు. కామెడీ సినిమాల‌కు కాలం చెల్లిపోతున్న ఈ త‌రుణంలో ఆయ‌న మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టాడు. `రాగ‌ల 24 గంట‌ల్లో` సినిమా కోసం. అయితే ఇది కామెడీ సినిమా కాదు. తెలివిగా జోన‌ర్ మార్చి.. థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకున్నారు. మ‌రి ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృతం అయ్యింది. శ్రీ‌నివాస‌రెడ్డి ఫామ్‌లోకి వ‌చ్చాడా?  లేదా? అస‌లు ఈ 24 గంట‌ల క‌థేమిటి?


* క‌థ‌

 

జైలు నుంచి త‌ప్పించుకున్న ముగ్గురు నేర‌స్థులు ఓ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అది రాహుల్ (స‌త్య‌దేవ్‌) విద్య (ఇషా రెబ్బా)ల ఇల్లు. కొత్త‌గా పెళ్ల‌యిన జంట అది. ఓ గంటసేపు మీ ఇంట్లో ఉంటాం. అరిస్తే చంపేస్తాం అంటూ విద్య‌ని బెదిరిస్తారు ఖైదీలు. అయితే.. అదే ఇంట్లో అప్ప‌టికే ఓ శ‌వం క‌నిపిస్తుంది. అది.. రాహుల్‌ది. `నా భ‌ర్త‌ని నేనే చంపాను` అంటూ ఖైదీల‌కు త‌న క‌థ వినిపిస్తుంది. త‌న‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహుల్‌ని దివ్య ఎందుకు చంపాల్సివ‌చ్చింది?  ఏమా క‌థ‌..?  ఈ విష‌యాలు తెలియాలంటే రాగ‌ల 24 గంట‌ల్లో సినిమా చూడాల్సిందే.
 

* న‌టీన‌టులు


ఈ సినిమాకి ప‌ర్‌ఫెక్ట్ కాస్టింగ్ కుదిరింద‌ని చెప్పొచ్చు. ఈషారెబ్బా చ‌క్కగా ఒదిగిపోయింది. గ్లామ‌ర్‌గానూ క‌నిపించింది. స‌త్య‌దేవ్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. నెగిటీవ్ ఛాయ‌లున్న పాత్ర‌ని స‌మ‌ర్థ‌వంతంగా పోషించాడు. శ్రీ‌రామ్‌, గ‌ణేష్ రాఘ‌వ‌న్ మెప్పిస్తారు. కృష్ణ భ‌గ‌వాన్ కామెడీ చేయాల‌ని చూశాడు. కానీ ప్రేక్ష‌కుల‌కు మాత్రం విసుగొస్తుంది. నిర్మాత‌ని సైతం ఓ చిన్న పాత్ర‌లో ఇరికించేశాడు ద‌ర్శ‌కుడు.

 

* సాంకేతిక వ‌ర్గం


క‌థ‌లో కావ‌ల్సిన‌న్ని మ‌లుపులున్నాయి.క‌థ ప‌రంగా లోటేం లేదు. దాన్ని తెర‌కెక్కించిన విధానం కూడా బాగుంది. కొన్ని స‌న్నివేశాలు లెంగ్తీగా ఉండ‌డం మైన‌స్‌. ర‌ఘు కుంచె నేప‌థ్య సంగీతం, కెమెరా ప‌నితం బాగున్నాయి. కృష్ణ భ‌గ‌వాన్ మాట‌లు అందించిన సినిమా ఇది. ఆయ‌న శైలి ఛ‌మ‌క్కు మిస్ అయ్యింది.

 

* విశ్లేష‌ణ‌

 

ఓ మంచి థ్రిల్ల‌ర్ వండ‌డానికి కావ‌ల్సిన దినుసుల‌న్నీ ఈ క‌థ‌లో ఉన్నాయి. చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలో జ‌రిగే క‌థ ఇది. అయినా స‌రే..కావ‌ల్సినన్ని మ‌లుపులు ఉన్నాయి.  ఆమ‌లుపులే ఈ క‌థ‌కు కీల‌కం. క‌థ‌ని ప్రారంభించిన ప‌ద్ధ‌తి ఆస‌క్తి క‌లిగిస్తుంది. తొలి స‌న్నివేశంలోనే `నా భ‌ర్త‌ని నేనే చంపాను` అని క‌థానాయిక ఒప్పుకుంటుంది. అస‌లు భ‌ర్త‌ని ఎందుకు చంపాల్సివ‌చ్చింది?  అనేది ఆస‌క్తిక‌ర‌మైన కోణం. ఫ్లాష్  బ్యాక్‌లోని తొలి స‌న్నివేశాలు మ‌రీ రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ రాహుల్ వింత ప్ర‌వ‌ర్త‌న‌, త‌న‌లోని సైకోయిజం మ‌ళ్లీ ఈ క‌థ‌పై ఆస‌క్తిని రేకెత్తించేలా చేస్తాయి. ఇంట్ర‌వెల్‌లో పెద్ద ట్విస్టేం లేక‌పోయినా.. ఫ‌ర్లేదులే అన్న ఫీలింగ్ మాత్రం వ‌స్తుంది.


ద్వితీయార్థంలోనూ ద‌ర్శ‌కుడు క‌థ‌ని ప‌ట్టుత‌ప్ప‌కుండా న‌డిపించ‌గ‌లిగాడు. ఆహా.. ఓహో అనుకున్నంత అద్భుత‌మైన ట్విస్టులు, సన్నివేశాలూ ఏమీ ఉండ‌వు గానీ.. ఉన్నంత వ‌ర‌కూ ఆక‌ట్టుకుంటాయి. ప్రేక్ష‌కుల్ని కూర్చోబెడ‌తాయి. కొంత‌మంది క్లైమాక్స్‌ని గెస్ చేసే అవ‌కాశం ఉంది. కాక‌పోతే చాలామందిని హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది చివ‌రి వ‌ర‌కూ ఫ‌జిల్‌గానే మిగిలిపోతుంది. పాట‌లు లేకుండా గ్రిప్పింగ్‌గా ఈ క‌థ‌ని న‌డిపించాడు. తొలి స‌గంలో ఓ పాట‌, రెండో స‌గంలో మ‌రో పాట వ‌స్తాయి. అయినా ఇబ్బంది పెట్ట‌వు. ఖైదీల‌కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా త్వ‌ర‌గా ముగించేసిన‌ట్టు అనిపిస్తుంది. విల‌న్ త‌న‌కు తానే వ‌చ్చి గోతులో ప‌డ‌తాడు. దాని కోసం ఎవ‌రూ ఏమీ ప్ర‌య‌త్నించ‌రు. అదే క్లైమాక్స్‌ని బాగా డల్‌గా మార్చేసింది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

క‌థ‌నం
మ‌లుపులు


* మైన‌స్ పాయింట్స్

క్లైమాక్స్‌
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: 2 గంట‌ల కాల‌క్షేపం

- రివ్యూ రాసింది శ్రీ

ALSO READ: 'జార్జ్ రెడ్డి' మూవీ రివ్యూ & రేటింగ్.