ENGLISH

'రాజావారు - రాణీగారు' మూవీ రివ్యూ & రేటింగ్

29 November 2019-11:30 AM

నటీనటులు:  కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, దివ్య నార్ని, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం తదితరులు.
దర్శకత్వం: రవికుమార్ కోలా
నిర్మాతలు: మనోవికాస్ & మీడియా9 మనోజ్
సంగీతం: జయ్ కె
విడుదల తేదీ: నవంబర్ 29,  2019

 

రేటింగ్‌: 3/5

చేతిలో క‌థ ఉన్న‌ప్పుడు దాన్ని డీల్ చేయ‌డం, పాత్ర‌లు న‌డిపించ‌డం చాలా సుల‌భం. క‌థ‌గా ఏమీ లేన‌ప్పుడు కేవ‌లం స‌న్నివేశాల‌తో, చిన్న చిన్న మూమెంట్స్‌తో క‌థ న‌డుపుతూ - ప్రేక్ష‌కుల్ని కూర్చోబెట్ట‌డం చాలా క‌ష్టం. దానికి బిగుతైన క‌థ‌నం అవ‌స‌రం. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు క‌థ కంటే, క‌థ‌నానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. పాత క‌థ‌నే - ఈత‌రం కనెక్ట్ అయ్యేలా, హాయిగా ఆస్వాదించేలా అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాంటి మ‌రో క‌థే.... `రాజావారు - రాణీగారు`.


* క‌థ‌

 

`తొలిప్రేమ‌` చూశారు క‌దా?  అందులో హీరో బాలు. అను అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మ‌న‌సులో మాట చెప్పలేడు. చివ‌ర్లో ఆ అమ్మాయి చ‌దువు పేరుతో విదేశాల‌కు వెళ్లిపోతుంది. ఎయిర్‌పోర్టులో `ఐ ల‌వ్ యూ`చెప్పుకుంటారు. ఇదీ క‌థ‌.


స‌రిగ్గా `రాజావారు - రాణీగారు` క‌థ కూడా ఇంతే. ఇది కూడా తొలిప్రేమ‌లాంటి స్టోరీనే. ఇక్క‌డ అబ్బాయి పేరు రాజా. అమ్మాయి పేరు రాణీ. రాణీ అంటే రాజాకు చాలా ఇష్టం. కానీ మ‌న‌సులోని మాట చెప్ప‌లేడు. మూగ‌గా ఆరాధిస్తాడు. ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి చ‌దువు పేరుతో అమ్మ‌మ్మ‌వాళ్ల ఇంటికి వెళ్లిపోయి, మూడేళ్లకు తిరిగిస్తుంది. తిరిగొచ్చాకైనా త‌న మ‌న‌సులోని మాట చెప్పాడా, లేదా?  చెబితే ఆ అమ్మాయి రియాక్ష‌న్ ఏమిటి?  అనేదే క‌థ‌.
 

* న‌టీన‌టులు


కిర‌ణ్‌, ర‌హ‌స్య‌గోర‌ఖ్‌లు చాలా స‌హ‌జంగా న‌టించారు. ఎవ‌రూ మేక‌ప్ వేసుకోలేదు. ఎలా ఉంటే అలా క‌నిపించారు. స‌హ‌జ‌త్వం కోసం. చౌద‌రి, నాయుడుగా క‌నిపించిన న‌టులు చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేశారు. వాళ్ల టైమింగ్ స‌హజంగా ఉంది. మిగిలిన న‌టీన‌టుల్లో ఎక్కువ‌మంది కొత్త‌వారే. దాంతో... మ‌రింత స‌హ‌జ‌త్వం వ‌చ్చింది. వాళ్లూ చ‌క్క‌గా చేశారు.
 

* సాంకేతిక వ‌ర్గం


సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం ఈ సినిమాకి ప్ర‌ధాన మూల స్థంభాలు.  పాట‌లు క‌థ‌లో క‌లిసిపోయాయి. వాటిని చిత్రీక‌రించిన విధాన‌మూ బాగుంది. డైలాగులు స‌హ‌జంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడిలో కావ‌ల్సినంత ప్ర‌తిభ ఉంది. క‌థ‌గా ఏమీ లేక‌పోయినా - స‌న్నివేశాల‌తో, చిన్న చిన్న మూమెంట్స్‌తో సినిమాని న‌డిపించేశాడు. మిగిలిన సాంకేతిక వ‌ర్గం త‌న‌కు చ‌క్క‌గా స‌హ‌క‌రించింది. ప‌రిమిత‌మైన వ‌న‌రుల‌తోనే క్వాలిటీ కూడా చూపించ‌గ‌లిగాడు.

 

* విశ్లేష‌ణ‌

 

క‌థ‌లో తొలిప్రేమ ల‌క్ష‌ణాలున్నాయి. ఆ సినిమా ఓ ప‌ట్నంలో జ‌రిగితే.. ఇది ప‌ల్లెటూరుకి షిఫ్ట్ అయ్యింది. అంతే తేడా. కానీ ప‌ల్లెటూరి నేప‌థ్యం, స్నేహితుల పాత్ర‌లు ఈ క‌థ‌కు బాగా క‌లిసొచ్చాయి. హాయైన స‌న్నివేశాల‌తో సాగిన క‌థ‌నం అల‌రిస్తుంది. క‌థ‌లో, స‌న్నివేశంలో ఏమీ లేక‌పోయినా పాత్ర‌ల న‌డ‌త‌, సంభాష‌ణ‌లు, స‌హ‌జ‌మైన టేకింగ్‌తో కాల‌క్షేపం అయిపోతుంది. స‌ర‌దాగా ఓ ప‌ల్లెటూరు వెళ్లి, అక్క‌డ మ‌నుషుల్ని చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. 


ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే సినిమాల్ని ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు క‌చ్చితంగా ఆయా స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. రాణీ ఏ ఊరు వెళ్లిందో తెలుసుకోవ‌డానికి నాయుడు,చౌద‌రి చేసే ప్ర‌య‌త్నాలు - రాణీ వాళ్ల నాన్న క్లాసు పీకే స‌న్నివేశాలు, చౌద‌రి ఇంటి వ్య‌వ‌హారాలు, ఇవ‌న్నీ చాలా ఫ‌న్నీగా అనిపిస్తాయి. రాణీని ఊరు ర‌ప్పించడ‌నికి వేసే ప్లాన్స్ కూడా కాల‌క్షేపానికి ప‌నికొస్తాయి. తొలి స‌గం ఎలాంటి ఫిర్యాదులు లేకుండా హాయిగా గ‌డిచిపోయింది.

 

ద్వితీయార్థంలో కాస్త స్లో నేరేష‌న్‌తో ఇబ్బంది పెట్టాడు. క‌థ‌లో ఏమీ లేన‌ప్పుడు వ‌చ్చే ఇబ్బందే ఇక్క‌డా ఎదురైంది. స‌న్నివేశాల‌న్నీ ఒకే చోట తిరిగాయి. వినోదం కూడా కాస్త త‌గ్గింది. దాంతో - సినిమా ట్రాక్ త‌ప్పేసింది అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మాత్రం మ‌ళ్లీ  ద‌ర్శ‌కుడు అనుకున్న ఎమోష‌న్‌ని గ‌ట్టిగానే ప‌ట్టుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కూ అస్స‌లు మాట్లాడ‌ని అమ్మాయి - ఒక్క‌సారిగా త‌న ప్రేమ‌ని చూపించేయ‌డం కాస్త సినిమాటిక్‌గా అనిపించినా - ఈ క‌థ‌ని ముగించ‌డానికి అది త‌ప్ప‌లేదు. ఈమ‌ధ్య ప్రేమ పేరుతో వెకిలి స‌న్నివేశాలు చూపిస్తున్న సినిమాల మ‌ధ్య - ప‌చ్చ‌ని స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌లా వ‌చ్చిందీ చిత్రం. 


గొప్ప‌గా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకునే స‌న్నివేశాలు, అద్భుత‌మైన పాత్ర‌లు లేవు గానీ - కొన్న టికెట్‌కి గిట్టుబాటయ్యే వినోదం త‌ప్ప‌కుండా ల‌భిస్తుంది. కొత్త న‌టీన‌టులు, కొత్త సాంకేతిక నిపుణులు క‌లిసి ఇలాంటి ఓ మంచి అవుట్ పుట్ ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామం. ఈ టీమ్‌లో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భ‌విష్య‌త్తులోనూ మంచి అవ‌కాశాలు అందుకుంటార‌నిపిస్తోంది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌ 

వినోదం
స్నేహితుల పాత్ర‌లు
ప‌ల్లెటూరి నేప‌థ్యం
సాంకేతిక వ‌ర్గం


* మైన‌స్ పాయింట్స్

స్లో నేరేష‌న్‌
 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: మూగ మ‌న‌సులు

- రివ్యూ రాసింది శ్రీ

 

ALSO READ: 'రాజావారు - రాణీగారు' ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి