ENGLISH

'సీత‌' మూవీ రివ్యూ & రేటింగ్

24 May 2019-14:30 PM

నటీనటులు: కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోను సూద్, మన్నరా చోప్రా, బిత్తిరి సత్తి, తనికెళ్ళ భరణి తదితరులు.
దర్శకత్వం: తేజ 
నిర్మాతలు: అనిల్ సుంకర
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సినిమాటోగ్రఫర్: సిర్ష రే 
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు 
విడుదల తేదీ: మే 24, 2019

 

రేటింగ్‌: 2.5/ 5

 

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ట్రాక్ త‌ప్పి చాలా రోజులైంది. భారీ హంగుల్ని, పెద్ద ద‌ర్శ‌కుల్ని న‌మ్ముక‌న్నా ఫ‌లితం రావ‌డం లేదు. హీరోయిజాన్ని ఎంత ఎలివేట్ చేద్దామ‌నుకున్నా తేలిపోతున్నాడు. అందుకే తొలిసారి హీరోయిజాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి ఓ స్వాతిముత్యంలాంటి పాత్ర చేయ‌డానికి ముందుకొచ్చాడు. అదే.. `సీత‌`. ఈసారి హీరోయిజం పండించే బాధ్య‌త కాజ‌ల్ తీసుకుంది.  తేజ లాంటి ద‌ర్శ‌కుడు ఈ కాంబినేష‌న్‌కి తోడ‌వ్వ‌డంతో `సీత‌`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి వాటిని `సీత‌` అందుకుందా?  బెల్లంకొండ కొత్త ప్ర‌య‌త్నం నెర‌వేరిందా?  `నేనే రాజు.. నేనే మంత్రి`తో ఫామ్ లోకి వ‌చ్చిన తేజ - `సీత‌`తో మ‌రో విజ‌యాన్ని అందుకున్నాడా?

 

* క‌థ‌

 

సీత (కాజ‌ల్‌) ఒట్టి డ‌బ్బు మ‌నిషి. డ‌బ్బుల కోసం ఏమైనా చేస్తుంది.  చివ‌రికి బ‌స‌వ‌రాజు (సోనూసూద్‌) అనే ఎం.ఎల్‌.ఏ ప‌క్క‌లో ప‌డుకోవ‌డానికి కూడా రెడీ అయిపోతుంది.  కానీ త‌న అవ‌స‌రం తీరాక‌... బ‌స‌వ‌రాజుని కూడా ప‌క్క‌న పెట్టేస్తుంది. దాంతో అహం దెబ్బ‌తిన్న బ‌స‌వ‌రాజు.. ఎలాగైనా స‌రే సీత‌ని లొంగ‌దీసుకోవాల‌ని చూస్తాడు. ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తాడు. సీత అప్పుల్లో కూరుకుపోతుంది. మ‌రోవైపు పోలీసులు ఆమె కోసం వెదుకుతుంటారు. నాన్న (భాగ్య‌రాజా) కూడా చ‌నిపోతాడు. తండ్రి ఆస్తి త‌న‌కే ద‌క్కుతుంది అనుకుంటే.. ఆ ఆస్తి పూర్తిగా బావ రామ్ (బెల్లంకొండ‌) చేతికి వెళ్లిపోతుంది. తాను భూటాన్‌లో ఉంటాడు. త‌నో స్వాతిముత్యం.

 

చిన్న‌ప్ప‌టి నుంచీ `సీత‌ని నేను చూసుకోవాలి, సీత న‌న్ను చూసుకుంటుంది` అంటూ ఎదురు చూస్తుంటాడు. అలాంటి రామ్‌ని కూడా సీత త‌న అవ‌స‌రాల కోసం వాడుకోవాల‌ని చూస్తుంది. రామ్ పేరుమీదున్న ఆస్తిని త‌న పేర మీద రాసుకుని వ‌దిలించుకోవాల‌నుకుంటుంది. మ‌రి సీత ప్ర‌య‌త్నం నెరవేరిందా?  రామ్ సీత మ‌న‌సుని మార్చ‌గ‌లిగాడా??  కోరిక‌తో ర‌గిలిపోతున్న బ‌స‌వ‌రాజు... సీత‌ని ద‌క్కించుకున్నాడా?  అనేది తెర‌పై చూడాలి.

 

* న‌టీన‌టులు

 

కాజ‌ల్ పాత్ర ఈ సినిమాకి ప్రాణం. త‌న పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అందులో త‌న న‌ట‌నా న‌చ్చుతుంది. అయితే డ్ర‌స్సింగ్‌, మేక‌ప్ కాస్త మితిమీరిన‌ట్టు అనిపిస్తాయి. బెల్లంకొండ‌కు ఛాలెంజింగ్ పాత్ర ఇది. కాక‌పోతే.. అమాయ‌కుడిగా త‌న న‌ట‌న అంత‌గా మెప్పించ‌దు. కొన్ని చోట్ల ఓవ‌రాక్ష‌న్ చేసిన‌ట్టే అనిపిస్తుంది. సోనూసూద్ ఆక‌ట్టుకుంటాడు. ఇలాంటి విజ‌నిజం పాత్ర‌లు త‌న‌కు కొట్టిన పిండే. త‌నికెళ్ల భ‌ర‌ణి డైలాగులు బాగున్నాయి. ఈ సినిమాలో కామెడీ రిలీఫ్ అదొక్క‌టే. బిత్తిరి స‌త్తి కూడా విసిగించేస్తాడు.

 

* సాంకేతిక వ‌ర్గం

 

టెక్నిక‌ల్ గా సినిమా బాగుంది. భూటాన్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు బాగా తీశారు. పాట‌లూ క‌థ‌కు అనుగుణంగానే సాగాయి. నేప‌థ్య సంగీతం కూడా ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌లో విష‌యం ఉన్నా, నీర‌స‌మైన క‌థ‌నంతో తేజ విసిగిస్తాడు. కేవ‌లం పాత్ర‌ల‌పై దృష్టి పెట్టిన తేజ‌, ఆ పాత్ర‌ల్ని గుర్తుండిపోయేలా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు.  ఆర్‌.ఎక్స్ భామ‌తో చేయించిన ఐటెమ్ సాంగ్ మాస్‌ని మెప్పిస్తుంది కానీ, సినిమాలో మాత్రం అతికిన‌ట్టే అనిపిస్తుంది.

 

* విశ్లేష‌ణ‌

 

క‌థ‌ని బ‌ట్టి పాత్ర‌ల్ని సృష్టించ‌డం ఒక ప‌ద్ధ‌తి. ముందు పాత్ర‌ల్ని అనుకుని దాని చుట్టూ క‌థ‌ని అల్లుకోవ‌డం మ‌రో ప‌ద్ధ‌తి. ఈత‌రం సినిమా.. రెండో విధానాన్నే పాటిస్తుంది. అందుకే క‌థ కంటే, పాత్ర‌లే బ‌లంగా ఉంటున్నాయి.  తేజ కూడా అదే చేశాడు. మూడు పాత్ర‌ల్ని సృష్టించుకుని, ఆ పాత్ర‌ల్ని లింకు చేసుకుంటూ `సీత‌` క‌థ‌ని అల్లుకున్నాడు. ఓ డ‌బ్బు మ‌నిషి, స్వాతిముత్యంలాంటి హీరో, ఓ అమ్మాయిని అనుభ‌వించాల‌నుకునే ప్ర‌తియాకుడు... వీళ్ల మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. క‌థానాయిక పాత్ర‌ని ఇంత స్వార్థ‌ప‌రురాలిగా చూపించ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. పైకి హీరోలా త‌న‌ని తాను ఊహించుకునే విల‌న్ పాత్ర కూడా కొత్త‌గానే ఉంటుంది.

 

అయితే.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య కొత్త సన్నివేశాల్ని రాసుకోవ‌డంలో మాత్రం తేజ పూర్తిగా విఫ‌లం అయ్యాడు. అదే పాయింట్‌ని ప‌ట్టుకుని పాత చింత‌కాయ ప‌చ్చ‌డి త‌యారు చేశాడు. హీరోని స్వాతిముత్యంలా తీర్చిదిద్ద‌డం వ‌ర‌కూ బాగుంది. అయితే హీరో అతి మంచిత‌నంతో ఓ సంద‌ర్భంలో ప్రేక్ష‌కుల‌కూ విసుగొస్తుంది. అది ముందే ఊహించి... `మీ అతి మంచితనం కూడా టార్చ‌ర్ పెడుతోంది` అంటూ ఓ డైలాగ్ చెప్పించాడు కూడా.  తొలి స‌న్నివేశాల్లో సీత పొగ‌రు, బ‌స‌వ‌రాజు స‌ర‌దా విల‌నిజం బాగుంటాయి. క్ర‌మంగా.... అవి కూడా మాయం అయిపోతాయి. బెల్లంకొండ పాత్ర ప్ర‌వేశించిన తొలి అయిదు నిమిషాలూ.. న‌వ్విస్తాడు. ఆ త‌ర‌వాత‌.. అందులోనూ సారం త‌గ్గిపోతుంది. ద్వితీయార్థంలో రామ్ అతి మంచిత‌నం విసిగిస్తుంది. పతాక స‌న్నివేశాల్లో ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడు సుల‌భంగా ఊహిస్తాడు. అయితే క్లైమాక్స్‌లో హింస మితిమీరింది. హీరోని కొట్టి, బుల్లెట్ల‌తో కాల్చి, హాస్ప‌ట‌ల్‌కి వెళ్తున్న‌ప్పుడు యాక్సిడెంట్ చేసి, చివ‌రికి ఫొటోకి దండేసి - ఇలా చాలా చాలా హింసిందించాడు.

 

అదంతా ఎమోష‌న్‌ని పండించిన‌డానికే అని ద‌ర్శ‌కుడు అనుకున్నాడు. కానీ ఎమోష‌న్ పండ‌లేదు స‌రిక‌దా, థియేట‌ర్‌లోంచి ఎప్పుడు వెళ్లిపోదామా అని ప్రేక్ష‌కుడు ఫీల‌య్యే స్థాయికి తీసుకెళ్లాడు. ప్ర‌తీ పాత్ర‌లోనూ మార్పు కృత‌కంగానే ఉంటుంది.  పోలీస్ ఆఫీస‌ర్ ఎందుకు మారాడో అర్థం కాదు. త‌నికెళ్ల భ‌ర‌ణి పాత్ర ఎందుకు అంత రియ‌లైజ్  అయ్యిందో తెలీదు. ఆఖ‌రికి సీత లో మార్పు కూడా అంతుప‌ట్ట‌డు. ఇలా.. అనేక ఒడిదుడుకుల మ‌ధ్య ఈ సీత ప్ర‌యాణం సాగింది.

 

* ప్ల‌స్ పాయింట్స్‌

 

+కాజ‌ల్‌
+టెక్నిక‌ల్ పాయింట్స్‌

 

* మైన‌స్ పాయింట్స్

 

- ఓవ‌రాక్ష‌న్‌
- స్క్రీన్ ప్లే

 

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: బెల్లంకొండ రాత‌ని మార్చ‌లేని - సీత‌

 

- రివ్యూ రాసింది శ్రీ.

ALSO READ: సీత ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి