ENGLISH

2017లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన భారీ వివాదాలు ఇవే

29 December 2017-15:19 PM

ప్రతి పరిశ్రమలో విజయాలు, వివాదాలు కామన్. అయితే చిత్ర పరిశ్రమలో ఏ చిన్న వివాదమైన అది బూతద్దంలో కనిపిస్తుంది. ఎందుకంటే రంగుల ప్రపంచం కబుర్లు అందరికీ కావాలి. మీడియా ప్రధాన ఫోకస్ కూడా సినీ పరిశ్రమ వివాదమే. అందుకే చిత్ర పరిశ్రమ కూడా సాధ్యమైనంత వరకూ వివాదాలకు అవకాశం ఇవ్వదు. ఎవరికి వారు జాగ్రత్త పడి.. వివాదాలకు దూరంగా వుండటానికే ప్రయత్నిస్తుంటారు. ఇలా ఉన్నప్పటికీ 'వివాదం' తన ఉనికి చాటుతూనే ఉటుంది. ఈ ఏడాది కూడా చాలా వివాదాలు చిత్ర పరిశ్రమను చూట్టుముట్టాయి.

 

2017లో టాలీవుడ్ ఎదుర్కున్న అతి పెద్ద వివాదం డ్రగ్స్ కేసు. ఈ కేసులో దాదాపు 12మంది సినీ ప్రముఖులు విచారణ ఎదురుకున్నారు. పూరి జగన్నాధ్, రవితేజ, ఛార్మీ.. లాంటి ప్రముఖులు ఈ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కోవడం పెను సంచలనం రేపింది. 'టాలీవుడ్ మత్తు'లో వుందని మరోవైపు మీడియా వరుస కధనాలతో విరుచుకుపడింది. దాదాపు ఒక పదిహేను రోజులు ఇంక ఏ వార్తలు లేవు. డ్రగ్స్..డ్రగ్స్..డ్రగ్స్.. ఇలా సాగిందీ కేసు. అసలు ఈ కేసు ఏమిటో, ఎందుకు విచారణ పిలిచారో చాలా వరకు క్లారిటీ లేకుండానే మీడియా తీర్పులు చెప్పేసింది. అయితే ఇంత సంచలనం రేపిన ఈ కేసు తర్వాత ఎందుకో చల్లబడిపోయింది.

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 2014,2015,2016 సంవ‌త్సరాల‌కి గాను ప్రకటించిన నంది అవార్డులు టాలీవుడ్ లో మరో వివాదం. ఈ ప్రక‌ట‌న త‌ర్వాత కొంద‌రికి నందులు రాక‌పోవ‌డంపై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ద‌ర్శకులు, నిర్మాత‌లు జ్యూరీపై మండి ప‌డ్డారు. న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వర‌రావు న‌టించిన ఆఖ‌రు సినిమా 'మ‌నం'కి నంది అవార్డు రాక‌పోవ‌డంపై కూడా అభిమానులు ఆవేద‌న వ్యక్తం చేశారు. అటు రుద్రమదేవికి అవార్డు రాకపోవడంపై దర్శకుడు గుణశేఖర్ ఏకంగా ఏపీ సర్కార్ ను నిలదీశాడు. కొందరు ఈ అవార్డులను 'కమ్మ' అవార్డులుగా అభివర్ణించారు. ఇక పోసాని కృష్ణమురళి లాంటి నటులు ఈ అవార్డులను తిరస్కరించారు కూడా. ఒకప్పుడు అవార్డు రాకపోతే.. ఎదో తమ సర్కిల్ లోనే చెప్పుకొని బాధపడే వారు. కాని ఈసారి మాత్రం తమ అవేదన ఏకంగా మీడియాకి ఎక్కించారు. ప్రజలతోనే చెప్పుకున్నారు. మొత్తంమ్మీద మరక మంచిదే అన్నట్లు.. నంది అవార్డుల విషయంలో చెలరేగిన వివాదంతో ప్రభుత్వం ఈసారి అవార్డులు ప్రకటించినపుడు మొత్తం జ్యూరీ సభ్యులకే విడిచిపెట్టేయకుండా ప్రేక్షకాభిప్రాయ సేకరణ కూడా చేయాలనే వాస్తవాన్ని గుర్తుంచినట్లయింది.  

 

సినీ రూపకర్తలకు రివ్యూలకు మధ్య వివాదం ఇప్పటిది కాదు. ఎప్పుడూ నడిచే వివాదమే. అసలు మీ రివ్యూ ఎవడికి కావాలి ? అని పైకి అంటారేకానీ.. రివ్యూలు ఏ మాత్రం తేడాగా రాసిన నెగిటివ్ సెన్స్ కనిపించినా నానా హంగామా జరిగిపోతుంటుంది. ఈ ఏడాది కూడా సినీ రూపకర్తలకు రివ్యూలకు మధ్య వివాదాలు నడిచాయి. మా సినిమా భవిష్యత్ ను నిమిషాల్లో తేల్చేస్తున్నారు కనీసం ఒక వారం కూడా సమయం ఇవ్వడం లేదు అంటూ దర్శక నిర్మాత హీరో ఘనం రివ్యూ రైటర్లపై అసహనం వ్యక్తం  చేసిన సందర్భాలు అనేకం వున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ 'పేషంట్- డాక్టర్' కధ చెప్పాడు దీనిపై. అలాగే అల్లు అర్జున్ తన డిజే సినిమా పై వచ్చిన నెగిటివ్ రివ్యూలు చూసి అసలు మీకు సినిమా చూడ్డం వచ్చా ? అని ప్రశ్నించాడు. ఎవరు ఎన్ని విధాల చెప్పుకున్నప్పటికీ రివ్యూ అనేది సినిమా ఫలితాన్ని మార్చలేదనేది యూనివర్షల్ ట్రూత్.

 

బయోపిక్ ల ట్రెండ్ బాలీవుడ్ మొదలై పాతైపోయింది. ఇప్పటికే ఒక డజను బయోపిక్ లు వచ్చాయి అక్కడ. ఇంకో అరడజను సెట్స్ పై వున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ లో ఈ జోనర్ ఊపందుకుంది. సావిత్రి బయోపిక్ రెడీ అవుతుంది. విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా కూడా సినిమా రాబోతుంది. అయితే ఇది ఒక్క సినిమా కాదు ఏకంగా మూడు బయోపిక్ లు. రామ్ గోపాల్ వర్మ లక్ష్మిస్ ఎన్టీఆర్ అని ఓ సినిమా చూపించబోతున్నాడు. అటు.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో ఓ బయోపిక్ రానుంది. కేతి రెడ్డి అనే దర్శకుడు 'లక్ష్మి వీర గ్రంధం' అని లక్ష్మిస్ ఎన్టీఆర్ కి కౌంటర్ గా ఓ సినిమా తీస్తున్నాడు. ఈ మూడు కూడా వివాదాల సుడిగుండాలే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర చూపిద్దాం అని లక్ష్యం ఎవరికీ కనిపించడం లేదు. ఎవరి ప్రయోజలు వారికి వున్నాయి. అటు సావిత్రి బయోపిక్ ని అధునూతన సాంకేతికత వుపయోగించుకొని నాటి వాతావరణం సృష్టించి అద్భుతంగా తెరకెక్కిస్తుంటే ఎన్టీఆర్ సినిమా మాత్రం సొంత ప్రయోజనాలతో ఇలా వివాదాల చుట్టూ తిరుగుతుంది.

 

మహేష్ కత్తి వెర్సస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .

మామూలు రచ్చ కాదిది. రాష్ట్రంలో మారే సమస్య లేనట్లు టీవీ ఛానళ్ళు వీరి వివాదాన్ని హైలెట్ చేసి చూపించాయి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కాదు.. నేను ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అంటూ మహేష్ కత్తి కొన్ని కామెంట్స్ చేయడం.. దానికి పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చి అతగాడిని ఫోన్లతో విసిగించడం, సహనం కోల్పోయిన కత్తి మీడియాకు ఎక్కడం, అక్కడ పవన్ కళ్యాణ్ ని మరింత టార్గెట్ చేయడం, దీంతో ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోవడం, ఆయన కూడా వెనక్కి తగ్గకపోవడం.. ఇలా సా.. గు... తుందో మహేష్ కత్తి వెర్సస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే సూచనలు అయితే కనిపించడం లేదు.

 

బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ నిర్మాతే కాదు.. బ్లాక్ బస్టర్ వివాదాలు కూడా సృష్టిస్తుంటాడు. ఆయన బేసిగ్గా ఏది మాట్లాడిన  ఓపెన్ గా ఉటుంది. కొన్ని సార్లు ఓపెన్ గా కాంట్రవర్షిలకు తావిస్తుంటాడు. ఈ ఏడాది కూడా  బండ్ల వివాదాల్లో నిలిచాడు. సచిన్ జోషికి బండ్ల కి 'నీ జతగా' సినిమా సమయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం ఈ ఏడాది కూడా నడిచింది. బండ్లను 'లోఫర్' అని కామెంట్ చేశాడు సచిన్ జోష్. ఇక ఈ మధ్య రచయిత వక్కంతం వంశీ, బండ్లపై చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఈ కేసులో బండ్లకు జైలు శిక్షకూడా విధించింది కోర్టు. అయితే వెంటనే బెయిల్ వచ్చిందనుకొండి. అది వేరే విషయం. ఇటివలే వైసీపీ ఎమ్మెల్యే నటి రోజాను ఉద్దేశించి ఒక లైవ్ షోలో పరుష పదజాలంతో విరిచుకుపడ్డాడు బండ్ల. ఈ విషయంలో కూడా రచ్చ రచ్చ జరిగిపోయింది.

 

సినిమా ఎంత వసూల్ చేసింది ? అసలు సిసలైన లెక్క ఇదేనా ? ఇలాంటి ప్రశ్నలు ప్రేక్షకులకు ఎప్పుడూ వుంటాయి. ఒక పెద్ద సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే.. రెండో రోజే ఒక పెద్ద ఫిగర్ వినిపిస్తుంది. స్వయంగా నిర్మాతలే హింట్లు వదులుతారు. కాని చివరికి వచ్చేసరికి అంతా బుస్. దీంతో సినిమా కలెక్షన్స్ అనేది అంతు చిక్కని దేవరహస్యంగా మిగిలిపోతుంది. సినిమాకి హైప్ తీసుకురావడానికి ఫేక్ కలెక్షన్ ని చెప్పడం కూడా  ప్రమోషన్ లో భాగంగా మారిపోయిందిప్పుడు. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు ఇలా ఫేక్ కలెక్షన్స్ చూపించిన దాఖలాలు వున్నాయి. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధమ్ మొదటి వారానికే వందకోట్లని చెప్పారు. కాని తర్వాతే ఆసలు బొమ్మ తెలిసింది. స్వయంగా నిర్మాత దిల్ రాజు డిజే తో తనకు ఒరిగిందేమీ లేదని తన సర్కిల్ లో చెప్పుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, మహేష్ స్పైడర్ కి కూడా అదిరిపోయే ఫిగర్లు చెప్పారు. కాని అవి కాకమ్మ లెక్కలని తేలిపోయింది.

ALSO READ: 2017లో వచ్చిన ఫ్లాప్ చిత్రాల జాబితా ఇదే