ENGLISH

టచ్ చేసి చూడు మూవీ రివ్యూ & రేటింగ్స్

02 February 2018-15:57 PM

తారాగణం: రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డి డరువాల, మురళి శర్మ, సత్యం రాజేష్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుహాసిని మణిరత్నం
నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్
సంగీతం: JAM8
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్ & చోటా కె నాయుడు
ఎడిటర్: గౌతం రాజు
కథ: వక్కంతం వంశీ
కథనం: విక్రమ్ సిరికొండ & దీపక్ రాజ్
మాటలు: శ్రీనివాస రెడ్డి, రవి రెడ్డి & కేశవ్
నిర్మాతలు: నల్లమల్లపు బుజ్జి & వల్లభనేని వంశీ మోహన్
దర్శకత్వం: విక్రమ్ సిరికొండ 

రేటింగ్: 2/5

ఏ సినిమాకైనా క‌థే మూలాధారం. ఎంత స్టార్ గ‌ణం ఉన్నా, ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టినా క‌థ‌లో బ‌లం లేక‌పోతే... ఆప్ర‌య‌త్న‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే.  క‌థ‌లో త‌ప్పులు చేసినా.. క‌నీసం క‌థ‌న‌మైనా ఆస‌క్తిక‌రంగా ఉండాలి. ఇవి రెండూ తేలిపోతే.. ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా నిలిచిన చిత్రం.. `ట‌చ్ చేసి చూడు`. `రాజా ది గ్రేట్‌` తో ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ‌.. సినిమా ఇది. దాంతో.. కాస్త అంచ‌నాలుపెంచుకుని థియేట‌ర్‌కి వెళ్లాడు ప్రేక్ష‌కుడు. మ‌రి ర‌వితేజ ట‌చ్ చేసిన పాయింట్ ఏమిటో.. చూస్తే...

* క‌థ‌ 

పాండిచ్చెరి లో స్థిర‌ప‌డిన‌ కార్తికేయ(రవితేజ)కు  కుటుంబమే ప్రపంచం. అక్క‌డ ఇండ్ర‌స్ట్రీ ఏర్పాటు చేసుకుని.. త‌న ఫ్యామిలితో ఏ లోటూ రాకుండా గ‌డిపేస్తుంటాడు. అనుకోకుండా కార్తికేయ‌  చెల్లెలు ఓ  హత్యను కళ్లారా చూసి సాక్ష్యంగా నిలుస్తుంది. ఆమె చెప్పిన పోలిక‌ల‌తో ఓ ఊహా చిత్రం త‌యారు చేస్తారు. అది.. ఇర్ఫాన్ లాలా (ఫ్రెడ్డీ దారువాలా)ది. 

అయితే త‌ను చ‌నిపోయి అప్ప‌టికే నాలుగేళ్ల‌య్యింద‌ని పోలీసు రికార్డుల ద్వారా స్ప‌ష్టమ‌వుతుంది.  ఇర్ఫాన్‌ని చంపింది ఎవ‌రో కాదు.. కార్తికేయ‌నే. అస‌లు ఇర్ఫాన్‌కీ కార్తికేయ‌కు ఉన్న లింకు ఏమిటి?  కార్తికేయ ఎవ‌రు?  త‌న నేప‌థ్యం ఏమిటి?  అనేదే `ట‌చ్ చేసి చూడు` సినిమా. 

* న‌టీన‌టులు ఎలా చేశారు?

ర‌వితేజ మ‌రోసారి ఒంటిచేత్తో ఈసినిమాని లాగించేద్దాం అనుకున్నాడు. త‌న వ‌ర‌కూ ఏ లోటూ లేకుండా క‌ష్ట‌ప‌డినా.. క‌థ‌, క‌థ‌నాలు, త‌న పాత్ర చిత్ర‌ణ అందుకు స‌హ‌క‌రించ‌లేదు. కొన్ని స‌న్నివేశాల్లో, మ‌రీ ముఖ్యంగా పాట‌ల్లో ర‌వితేజ స్క్రీన్ ప్రెజెన్స్ ఏమాత్రం ఆక‌ట్టుకోదు. 

రాశీఖ‌న్నా తొలిసారి కామెడీ చేసింది. ర‌వితేజ - రాశీఖ‌న్నా ల కాంబోలో వ‌చ్చిన సీన్లు ఆక‌ట్టుకుంటాయి. సీర‌త్‌ది ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌. మిగిలిన‌వాళ్లంతా ఓకే అనిపిస్తారు. ఇర్ఫాన్ లాలాకి ఇచ్చిన బిల్డ‌ప్ ఆ స‌న్నివేశాల్లో లేకుండా పోయింది. 

* విశ్లేష‌ణ‌..  

ర‌వితేజ అంటే ఊర మాస్ అంశాలు, కాస్త కామెడీ, యాక్ష‌న్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ట‌చ్ చేసి చూడుని నిర‌భ్యంత‌రంగా ట‌చ్ చేయొచ్చు. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్‌కి త‌గిన క‌థ ఇది.  క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా ర‌వితేజ శైలికి ఇంత క‌థ స‌రిపోతుంది. కాక‌పోతే... క‌థ‌నం ద‌గ్గ‌రే చిక్కు వ‌చ్చి ప‌డింది. ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిప‌డా స‌న్నివేశాలు రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు.  క‌థ‌న‌మే చాలా ఫ్లాట్‌గా ఏమాత్రం ఆక‌ట్టుకోనివిధంగా త‌యార‌వుతుంది. 

తొలి స‌గంలో అక్క‌డ‌క్క‌డ కామెడీ పండింది గానీ.. మొత్తంగా చూస్తే ఫ‌స్టాఫ్ గ‌డిచేస‌రికి రెండు సినిమాలు చూసినంత నీర‌సం వ‌చ్చేస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు.. ఇంట్ర‌వెల్ ముందు ఓ ట్విస్ట్ తీసుకురావ‌డం రివాజు. అదే ఆన‌వాయితీ ఇక్క‌డా క‌నిపించింది. ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ అన్న‌ది అస‌లు ట్విస్టు. కానీ ఆ సంగ‌తి థియేట‌ర్లో అడుగుపెట్టే ప్రేక్ష‌కుడికి ముందే తెలుసు. దాచాలానుకున్న ట్విస్టుని ప్ర‌చార చిత్రాల్లోనే రివీల్ చేయ‌డం ఈ సినిమాకి అతి పెద్ద మైన‌స్‌. కార్తికేయ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏమంత గొప్ప‌గా ఉండ‌దు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు లోబ‌డి రాసుకున్న స‌న్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. 

క‌థ ఓ చోటే తిరుగుతుండ‌డం, ర‌వితేజ శైలి వినోదం లేక‌పోవ‌డం, పాట‌లు పండ‌క‌పోవం, బ‌ల‌హీన‌మైన విల‌నీ.. ఇలా చెప్పుకుంటూ పోతే. బోలెడ‌న్ని లోపాలు క‌నిపిస్తాయి.  ద్వితీయార్థంలో కొద్దో గొప్పో మాస్‌ని ఆక‌ట్టుకునే స‌న్నివేశాల్ని రాసుకోగ‌లిగాడు. బీ, సీ సెంట‌ర్ల‌లో ఆ స‌న్నివేశాలే శ్రీ‌రామ‌ర‌క్ష‌. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే మొద‌లైందో... అస‌లు క‌థేంటో, ఎక్క‌డకు వెళ్లి ఆగుతుందో తెలిసిపోతుంది. ఇంత పేల‌వ‌మైన స్క్రీన్‌ప్లేతో ఓ సాధార‌ణ‌మైన క‌థ చెప్పాల‌నుకోవ‌డం ఎంత సాహ‌స‌మో అర్థ‌మ‌వుతుంది.

* సాంకేతిక వ‌ర్గం 

జామ్ 8 కంపెనీ పేరు ఎంత వెరైటీగా ఉందో.. అందులోని పాట‌లూ అంతే వెరైటీ అనుకొంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే.  పాట‌లు ఈ సినిమాకి ప్ర‌ధాన మైన‌స్‌. ఒక్క‌టంటే ఒక్క పాట కూడా ఆక‌ట్టుకోదు. మ‌ణిశ‌ర్మ ఇచ్చిన ఆర్‌.ఆర్ ఒక్క‌టే స‌న్నివేశాల్ని ఎలివేట్ చేసేలా ఉంది. నిర్మాణ విలువ‌లు కూడా అంత గొప్ప‌గా లేవు. ద‌ర్శ‌కుడు ఎంచుకొన్న క‌థ‌లో బ‌లం లేదు. ర‌వితేజ ఎన‌ర్జిని వాడుకోలేక‌పోయాడు. మాట‌లు అక్క‌డ‌క్క‌డ హుషారు పుట్టిస్తాయి.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ టైటిల్‌

* మైన‌స్ పాయింట్స్‌

- మిగిలిన‌వ‌న్నీ

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ట‌చ్ చేస్తే ఇక అంతే

రివ్యూ బై శ్రీ