ENGLISH

వీర భోగ వ‌సంత రాయులు రివ్యూ & రేటింగ్

26 October 2018-15:17 PM

తారాగణం: నారా రోహిత్, శ్రియ, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీనివాస రెడ్డి & తదితరులు
నిర్మాణ సంస్థ: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ K రాబిన్
ఛాయాగ్రహణం: S వెంకట్ & నవీన్ యాదవ్
ఎడిటర్: శశాంక్ మలి
నిర్మాణ సంస్థ: అప్పారావు బెల్లన
రచన-దర్శకత్వం: ఇంద్రసేన R  

రేటింగ్:1/5

కొత్త‌గా ఏదైనా చెప్పాలి అనే ప్ర‌య‌త్నం, ఆలోచ‌న త‌ప్పు కాదు. కానీ... ఆ కొత్త రోత‌గా ఉండ‌కూడ‌దు. ప్ర‌యోగం పేరిట‌... విక‌ట ప్ర‌య‌త్నాలు చేయ‌కూడ‌దు. అతి తెలివితేట‌ల‌తో సినిమా తీస్తే... ఏం జ‌రుగుతుందో గ‌త చిత్రాల ప‌రాభ‌వాలు నిరూపించాయి. అందులోంచి న‌వ ద‌ర్శ‌కులు పాఠాలు నేర్చుకోవ‌డం లేదేమో అనిపిస్తోంది. ఆ అనుమానానికి మ‌రింత బ‌లం చేకూర్చిన సినిమా `వీర భోగ వ‌స‌రంత రాయులు`.  టైటిల్, కాంబినేష‌న్‌, ట్రైల‌ర్ ఇవ‌న్నీ క‌లిపి ఆస‌క్తి రేకెత్తించిన చిత్ర‌మిది. మ‌రి ఫ‌లితం ఎలా ఉంది..??  ఈ సినిమా నేర్పిన పాఠ‌మేంటి?

* క‌థ‌

శ్రీ‌లంక నుంచి ఇండియా వ‌స్తున్న ఓ విమానం ఆచూకీ దొర‌క్కుండా పోతుంది.  అందులోని వాళ్లంతా చ‌నిపోయి ఉండొచ్చ‌ని ప్ర‌భుత్వం అనుమానిస్తుంది. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇచ్చేంత‌లోగా... ఓ అగంత‌కుడి నుంచి ఫోక్ కాల్ వ‌స్తుంది. ప్ర‌యాణికులంతా త‌న ద‌గ్గ‌ర క్షేమంగా ఉన్నార‌ని, వాళ్ల‌ని విడిచిపెట్టాలంటే.. మూడొంద‌ల మంది హంత‌కుల్ని, నేర‌స్థుల్ని, తీవ్ర‌వాదుల్ని మ‌ట్టుపెట్ట‌మ‌ని ష‌ర‌తు విధిస్తాడు. మ‌రి ప్ర‌యాణికుల కోసం మూడొంద‌ల‌మందిని ప్ర‌భుత్వం ఎన్‌కౌంట‌ర్ చేసిందా?  లేదా?  అస‌లు ఆ అగంత‌కుడు ఎవ‌రు?  దేని కోసం ఇదంతా చేస్తున్నాడు?  అనేదే క‌థ‌.

* న‌టీన‌టులు

నారా రోహిత్‌, విష్ణు, సుధీర్‌బాబు.. ఈ ముగ్గురూ క‌లిసి న‌టించారంటే ఈ సినిమాపై ఆస‌క్తి పెర‌గ‌డం ఖాయం. కానీ క‌థ‌లో మాత్రం అంత విష‌యం లేదు. ఏం న‌చ్చి ఈ క‌థ‌కు ఓకే చెప్పారో వీళ్ల‌కే తెలియాలి. ఈ ముగ్గురూ చేసింది కూడా ఏమీ లేదు. సుధీర్ బాబుకి ఎవ‌రో డ‌బ్బింగ్ చెప్పారు. ఆ స‌న్నివేశాలు చూస్తుంటే డ‌బ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. శ్రియ డ‌బ్బింగ్ కూడా నాశిర‌కంగా ఉంది.

* విశ్లేష‌ణ‌

స్థూలంగా క‌థ ఇదీ.. అని చెప్పిన‌ప్ప‌టికీ ఇందులో చాలా పొర‌లుంటాయి. తీవ్ర‌వాదం, కిడ్నాపులు, హైజాకులు. ఇల్లు మాయ‌మైపోయిన విచిత్రాలు.. ఇలా చాలా ఉంటాయి. వాట‌న్నింటినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఆ ప్ర‌య‌త్నం మంచిదే. కానీ.. దాన్ని వెండి తెర‌పైకి తీసుకురావ‌డానికి ద‌ర్శ‌కుడు ఎంచుకున్న విధానం మాత్రం గంద‌ర‌గోళంగా త‌యారైంది.  

ద‌ర్శ‌కుడు క‌థ‌ని బాగానే మొద‌లెట్టాడు. ఒక్కో పొర వ‌చ్చి చేరుతూ ఉండ‌డంతో చిక్కుముళ్లు ప‌డుతూ.. స్ట్రాంగ్‌గానే ముందుకు సాగుతుంది. ఆ త‌ర‌వాతే.. క‌థ గాడి త‌ప్పుతుంది. తెర‌పై ఏవేవో సంగతులు జ‌రుగుతూ ఉంటాయి.. దేనికీ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాడు. వీర బోగ వ‌సంత రాయులు ఆశ‌యం ఏమిటో, ల‌క్ష్య‌మేమిటో, దేని కోసం  ఇదంతా చేస్తున్నాడో చివ‌రి వ‌ర‌కూ దాచి పెట్టారు. ఆ సంగ‌తి తెలిసినా, అందులో ట్విస్టులున్నా... అప్ప‌టికే ప్రేక్ష‌కుడ్ని నీర‌సం ఆవ‌హిస్తుంది. 

దానికి తోడు.. లాజిక్కులు లేని స‌న్నివేశాలు బోలెడున్నాయి.  హైజాక్ జ‌రిగితే.. చేసిన‌వాడ్ని ప్ర‌భుత్వ అధికారులు బ‌తిమాలుకోవ‌డం ఏమిటో??  అర్థం కాదు. ఓ ద‌శ‌లో... హైజాక్ చేసింది వీర భోగ వ‌సంత రాయులు కాద‌ని తెలిసిపోతుంది. అయినా స‌రే.. వాడి డిమాండ్ల‌కు త‌లొగ్గ‌డం విచిత్రంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే మ‌రింత క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంటుంది. అవ‌న్నీ ద‌ర్శ‌కుడి తెలివితేట‌లు అనుకున్నాడో ఏమో.. చూస్తున్న‌వాళ్ల‌కి మాత్రం దాదాపు పిచ్చెక్క‌డం ఖాయం.  

ఇవ‌న్నీ చాల‌ద‌న్న‌ట్టు `పార్ట్ 2` తీస్తామ‌ని కూడా వేసుకున్నారు.  ఇక్క‌డ మిస్ అయిన లాజిక్కులు అందులో చూపిస్తారేమో మ‌రి.

* సాంకేతిక వ‌ర్గం

త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసిన సినిమా ఇది. కాబ‌ట్టి సాంకేతికంగా మెరుపులేం ఆశించ‌కూడ‌దు. త‌క్కువ లొకేష‌న్లలో పూర్తి చేశారు. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్ర‌మే. కెమెరా, ఎడిటింగ్‌.. మిగిలిన సాంకేతిక విభాగాలేవీ... స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌లేకపోయాయి. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ మంచిది కావొచ్చు. కానీ దాన్ని ఇంత గంద‌రగోళంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

* ప్ల‌స్ పాయింట్ 

కాంబినేష‌న్‌

* మైన‌స్ పాయింట్ 

క‌న్‌ఫ్యూజ‌న్‌

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: బోరు కొట్టిన‌... వ‌సంత రాయులు. 

రివ్యూ రాసింది శ్రీ