ENGLISH

విశ్వ‌రూపం 2 మూవీ రివ్యూ & రేటింగ్

10 August 2018-12:54 PM

తారాగణం: కమల్ హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ తదితరులు
నిర్మాణ సంస్థలు: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ & ఆస్కార్ ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్
సంగీతం: జిబ్రన్
ఎడిటర్: మహేష్ నారాయణ్ & విజయ్ శంకర్
ఛాయాగ్రహణం: సను వర్గీస్ & శ్యాందత్
రచన-నిర్మాత-దర్శకత్వం: కమల్ హాసన్

రేటింగ్: 2/5

విశ్వ‌రూపం ఎన్నో వివాదాల్ని సృష్టించింది.  దాంతో పాటు విజ‌య‌మూ ద‌క్కించుకుంది. అదో స్పై థ్రిల్ల‌ర్‌.  ద‌క్షిణాదిన ఇలాంటి క‌థ‌లు చూడ‌డం చాలా అరుదు. కాబ‌ట్టి కొత్త‌గా అనిపించింది. దానికి తోడు క‌మ‌ల్ కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అందుకే... విశ్వ‌రూపం 2 పై ఆశ‌లు పెరిగాయి. 

ఆ సినిమా  వాయిదాలు ప‌డుతూ, ప‌డుతూ... విడుద‌ల‌కు ఐదేళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. దాంతో ఆసక్తి కాస్త స‌న్న‌గిల్లింది. అయితే.. సినిమా బాగుంటే ఈ ఆల‌స్యం కూడా విష‌యం కాదు. మ‌రి... `విశ్వ‌రూపం 2` ఎలా ఉంది?   తొలి భాగాన్ని మించి మురిపించిందా?  లేదంటే... అంచ‌నాల‌కు దూరంగా ఉండిపోవాల్సివ‌చ్చిందా?

* క‌థ‌

విశ్వ‌రూపం క‌థ ఎక్క‌డ ఆగిందో, అక్క‌డి నుంచే పార్ట్ 2 మొద‌లైంది. వాసిమ్ (క‌మ‌ల్ హాస‌న్‌) ఓ గూఢ‌చారి. శ‌త్రువ‌ల‌తో ఉంటూ, వాళ్ల ర‌హ‌స్యాల్ని మ‌న‌దేశం చేర‌వేస్తుంటాడు. లాడెన్‌ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో కీల‌క స‌మాచారం అందిస్తాడు. ఆ ఆప‌రేష‌న్ పూర్త‌వ్వ‌డంతో... యూకే వెళ్తాడు. అక్క‌డ మ‌రో ఆప‌రేష‌న్ మొద‌ల‌వుతుంది. 

స‌ముద్ర గ‌ర్భంలో ఉన్న మార‌ణాయుధాల్ని పేల్చి.. విధ్వంసం సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న తీవ్ర‌వాదుల చ‌ర్య‌ల‌ను అడ్డుకుంటాడు. ఇదే స‌మ‌యంలో  వాసిమ్ మీద‌, అత‌ని భార్య‌పైనా దాడులు జ‌రుగుతుంటాయి. వాటి నుంచి త‌న‌ని తాను ఎలా కాపాడుకున్నాడు?  ఈ దేశాన్ని ఎలా ర‌క్షించాడు?  అనేదే `విశ్వ‌రూపం 2` క‌థ‌.

* న‌టీన‌టులు

క‌మ‌ల్ హాసన్ గురించి కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. అత‌ని అభినయంలో దోషాలు వెదికే సాహ‌సం చేయ‌లేం. వహీదా రెహ‌మాన్‌తో ఉన్న స‌న్నివేశంలో త‌ప్ప క‌మ‌ల్ న‌ట‌న‌కు ప‌రీక్ష ఎదుర‌వ్వ‌లేదు. 

ఆండ్రియా యాక్ష‌న్ సీన్‌లో అద‌ర‌గొట్టింది. చిలిపిగానూ క‌నిపించింది. పూజా ఆంటీలా క‌నిపిస్తోంది. క‌మ‌ల్ పక్క‌న క‌థానాయిక అంటే ఆ మాత్రం వ‌య‌సుండాల్సిందే అనుకున్నారేమో. వ‌హిదా రెహ‌మాన్‌ని తెర‌పై చూడ‌డం ఆమె అభిమానుల‌కు న‌చ్చుతుంది.

* విశ్లేష‌ణ‌

విశ్వరూపం వ‌చ్చి నాలుగేళ్లు దాటింది. ఇప్పుడు పార్ట్ 2 క‌థ చెప్పాల‌నుకోవ‌డం ఓ ర‌కంగా సాహ‌స‌మే. ఎందుకంటే విశ్వ‌రూపం క‌థ, అప్పుడు ఏం జ‌రిగింది?  అనేది జ‌నాలు ఈ పాటికే మ‌ర్చిపోయారు. విశ్వ‌రూపం సినిమాని పిచ్చిగా ప్రేమించి, నాలుగైదు సార్లు చూస్తే త‌ప్ప ఆ క‌థ గుర్తుండ‌దు. విశ్వ‌రూపం 2 స‌మ‌స్య అదే. 

తొలిభాగం గుర్తు లేనివాళ్ల‌కు. ఆ సినిమా చూడ‌ని వాళ్ల‌కు ఇప్పుడు ఏం జ‌రుగుతుందో, ఎందుకు జ‌రుగుతుందో అర్థం కాదు. ఏ పాత్ర‌ని పాజిటీవ్‌గా తీసుకోవాలో, ఏ పాత్ర‌ని నెగిటీవ్‌గా తీసుకోవాలో క‌న్‌ఫ్యూజ్ మొద‌ల‌వుతుంది. పైగా ఇందులో వాసిమ్ చేసే ఆప‌రేష‌న్లేం ఆస‌క్తిగా ఉండ‌వు. ఈ క‌థ‌ని ఓ గ‌మ్యం లేక‌పోవ‌డంతో స్క్రీన్ ప్లే కూడా ప‌ట్టు త‌ప్పిపోయింది. 

తొలి భాగంలో క‌నిపించే స‌స్పెన్స్‌, యాక్ష‌న్ డ్రామా పార్ట్ 2లో లోపించాయి.యూకెలో వాసిమ్‌పై ఎందుకు దాడులు జ‌రుగుతున్నాయి అనే విష‌యంలోనూ స్ప‌ష్ట‌త ఉండ‌దు. ద్వితీయార్థంలో మ‌ద‌ర్ సెంటిమెంట్‌కి చోటిచ్చారు. నిజానికి ఈ క‌థ‌కి అది కూడా అన‌వ‌స‌ర‌మే. సీన్లు పెంచుకోవ‌డానికి త‌ప్ప ఎందుకూ ఉప‌యోగ‌ప‌డ‌లేదు.  

తొలి భాగంలో ఉమ‌ర్ (రాహుల్ బోస్‌) వ‌చ్చేంత వ‌ర‌కూ.. క‌థ ఓ త్రాడుపై న‌డ‌వ‌దు. ఉమ‌ర్ వ‌చ్చేట‌ప్ప‌టికే క్లైమాక్స్ త‌రుముకొచ్చేస్తుంది. దాంతో థ్రిల్ త‌గ్గిపోయింది.  నిజానికి ఈ క‌థ‌ని ఒకే భాగంగా తీసుంటే బాగుండేది. నిడివి పెరిగింద‌ని.. రెండు భాగాలుగా చేయ‌డంతో రెండో భాగం ఎలాంటి ఆస‌క్తి లేకుండా చ‌ప్ప‌గా సాగింది.

* సాంకేతికంగా

ద‌ర్శ‌కుడిగా, స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా క‌మ‌ల్ విఫ‌ల‌మ‌య్యాడు. రెండో భాగం నిరాశ‌క్తంగా తీర్చిదిద్దాడు. సాంకేతికంగానూ ఈ సినిమా గొప్ప‌గా లేదు. సీజీ వ‌ర్క్ లు పేల‌వంగా ఉన్నాయి. పాట‌లు అర్థం కావు. నేప‌థ్య సంగీతం అదోర‌కంగా ఉంది. తొలి భాగం చూడ‌క‌పోతే... ఈ సినిమా అస్స‌లు బుర్ర‌కు ఎక్క‌దు.

* ప్ల‌స్ పాయింట్

+ క‌మ‌ల్‌హాస‌న్‌

* మైన‌స్ పాయింట్స్

- మిగిలిన‌వ‌న్నీ

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: విష‌యం లేని... విశ్వ‌రూపం. 

రివ్యూ రాసింది శ్రీ