ENGLISH

కాజల్‌ అగర్వాల్‌కి కొంత టైం కావాలట!

21 October 2020-10:30 AM

పెళ్ళి పనుల్లో బిజీగా వున్న కాజల్‌ అగర్వాల్‌, తిరిగి సినిమా షూటింగులకి ఎప్పటినుంచి హాజరవుతుంది.? అన్న ఆందోళన టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్‌లోనూ వుంది. నిజానికి, కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే కాజల్‌ చేయాల్సిన సినిమాలకు సంబంధించి టెన్షన్‌ ఎక్కువ కనిపిస్తోంది. కాజల్‌ అగర్వాల్‌, తెలుగులో ‘ఆచార్య’ సినిమా చేయాల్సి వున్న విషయం విదితమే. అయితే, కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. కరోనా సీజన్‌లోనే కాజల్‌ని హీరోయిన్‌గా అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. తొలుత ఈ సినిమా కోసం త్రిషని హీరోయిన్‌గా అనుకున్నారు.

 

అయితే, కొన్ని ఈక్వేషన్స్‌ సెట్‌ అవకపోవడంతో త్రిష ప్లేస్‌లోకి కాజల్‌ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. రావ్ు చరణ్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా, కాజల్‌ ఈ ఏడాది ఏ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదంటూ ఓ ఆసక్తిరమైన గాసిప్‌ ప్రచారంలోకి వచ్చింది. జనవరి తర్వాతే కాజల్‌ ఏ సినిమా షూటింగ్‌ అయినా పాల్గొనవచ్చనీ, పెళ్ళి తర్వాత కొద్ది రోజులపాటు ఆమె సినిమా షూటింగులకు దూరంగా వుంటుందనీ అంటున్నారు. అదే నిజమైతే, ‘ఆచార్య’ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశమే లేదన్నమాట. మరోపక్క, కాజల్‌ విషయమై తమిళంలోనూ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. అక్కడ రెండు మూడు సినిమాల్లో కాజల్‌ నటించాల్సి వుంది. వాటిల్లో ‘భారతీయుడు’ సీక్వెల్‌ కూడా ఒకటి.

ALSO READ: Kajal Latest Photoshoot