ENGLISH

కొత్త కొత్తగా నాగశౌర్య: పక్కా యాక్షన్‌ మోడ్‌.!

12 December 2019-12:19 PM

నాగశౌర్య అంటే పక్కింటబ్బాయ్‌ గుర్తొస్తాడు. లేదంటే, రొమాంటిక్‌ కుర్రోడు గుర్తొస్తాడు. కానీ, ఈ సారి నాగశౌర్య చాలా కొత్తగా కనిపించబోతున్నాడట. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వత్ధామ'. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారంటున్నారు. అన్నట్లు ఈ సినిమాతో నాగశౌర్య రైటర్‌గా కూడా మారాడు. ఈ సినిమాకి తానే స్వయంగా కథ సిద్ధం చేసుకున్నాడు. రమణ తేజ అనే కొత్త దర్శకుడికి ఛాన్సిచ్చి ప్రోత్సహించాడు. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. అందాల భామ మెహ్రీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

 

దాదాపు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. జనవరి నెలాఖరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతవరకూ ఫ్యామిలీ మూవీస్‌కే పరిమితమైన నాగశౌర్యని ఈ సినిమా చూశాక యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కీ ఫిట్‌ అనిపించుకుంటాడని అభిప్రాయ పడుతున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ జరిగిందట. 'కేజీఎఫ్‌' సినిమాకి యాక్షన్‌ అందించిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. మొత్తానికి 'అశ్వత్థామ' కోసం నాగశౌర్య కొత్త అవతారమెత్తబోతున్నాడన్న మాట.

ALSO READ: సూపర్‌ స్టార్‌తో 'శృతి' కలపనుందా.?