ENGLISH

పవన్ రెండు పడవల ప్రయాణం.. ఎందాకా.?

27 January 2021-09:46 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎవరూ ఊహించని విధంగా రెండు పడవల మీద ప్రయాణాన్ని అత్యంత చాకచక్యంగా కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో క్షణం తీరిక లేకున్నా, సినిమాల్లోనూ అంతకు మించిన ‘బిజీ వ్యవహారాలతో’ కొనసాగాల్సి వస్తోంది. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తయిపోగా, ప్రస్తుతం మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వచ్చేశాయి.

 

ఇంతలోనే, ఆంధ్రపదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కొత్త సవాల్ విసురుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు విసిరే సవాళ్ళకు సమాధానం చెప్పాల్సి రావడం, మిత్రపక్షంతో సంబంధాలు కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులేయాల్సి రావడం.. వీటితోపాటు, ఒప్పుకున్న సినిమాలు వేగంగా పూర్తి చేయడం.. ఎలా చూసుకున్నా, ఇది పవన్ కళ్యాణ్‌కి కత్తి మీద సాము లాంటి వ్యవహారమే.

 

ఇదిలా వుంటే, పవన్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో చాలా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.. తమ అభిమాన నటుడి నుంచి ఎడా పెడా కొత్త సినిమాల ప్రకటనలు, అందుకు సంబంధించిన ముచ్చట్లు వెలుగు చూస్తుండడంతో. ఇటు సినిమాకి సంబంధించిన విషయాలు, అటు రాజకీయ సంబంధిత విషయాలతో పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ‘నావల్ల కాలేదు రెండు పడవల మీద ప్రయాణం. కానీ, నా తమ్ముడికి అది సాధ్యమే..’ అని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పిన విషయం ఇప్పుడు నిజమని తేలుతోంది.

ALSO READ: ఆహాకి `క్రాక్‌` న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిందా?