ENGLISH

టాలీవుడ్‌పై అమితాబ్ ఎఫెక్ట్‌.

13 July 2020-16:08 PM

షూటింగులు ఎప్పుడు మొద‌ల‌వుతాయా? అని టాలీవుడ్ మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూసింది. దానికి త‌గ్గ‌ట్టే ప్ర‌భుత్వం షూటింగులు చేసుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చింది. అయినా.. పెద్ద సినిమాలేవీ ప‌ట్టాలెక్క‌లేదు. హీరోలంతా ఇంటి ప‌ట్టునే ఉన్నారు. రిస్క్ చేద్దాం అని ఇటీవ‌లే కొంత‌మంది హీరోలు డిసైడ్ అయ్యారు కూడా. అయితే మ‌ళ్లీ ఆ ఆలోచ‌న నుంచి విర‌మించుకున్నారు. దానికి కార‌ణం.. బిగ్ బీ.. అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఇటీవ‌ల అమితాబ్ బ‌చ్చ‌న్‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బీకే కాదు.. కుటుంబం మొత్తం క‌రోనా బారీన ప‌డింది. దాంతో... బాలీవుడ్ షాక్ కి గురైంది. ఆ ఎఫెక్ట్ టాలీవుడ్ పైనా ప‌డింది.

 

అమితాబ్ కి క‌రోనా సోక‌డం, ఇంటిల్లిపాదీ ఆ వైర‌స్‌తో బాధ‌ప‌డ‌డం టాలీవుడ్ ని ఎలెర్ట్ చేసింది. `మ‌నం జాగ్ర‌త్త‌గా లేక‌పోయినా.. ఇంతే సంగ‌తులు ` అనే భ‌యం ఇప్పుడు హీరోల్లో మ‌రింత ఎక్కువైంది. షూటింగులు చేద్దాం అనుకున్న‌వాళ్లు సైతం .. ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకున్నార్ట‌. బిగ్ బీ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటారు. క‌రోనా త‌ర‌వాత‌.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చిందే త‌క్కువ‌. అలాంటి వ్య‌క్తికే క‌రోనా సోకిందంటే... మ‌న‌మెంత‌? అనే ఆలోచ‌న‌లో ప‌డిపోయార్ట టాలీవుడ్ హీరోలు. దాంతో.. షూటింగులు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయ‌న్న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది.

ALSO READ: సోసూసూద్ మ‌రోసారి 'హీరో' అయ్యాడు