ENGLISH

గేమ్ చేంజ‌ర్ సినిమాపై అంజలి కామెంట్స్

28 January 2025-12:18 PM

అచ్చ తెలుగు అందం అంజలి టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో సత్తా చాటుతోంది. మొదటి నుంచి అంజలికి కోలీవుడ్ నటనకి ఆస్కారమున్న పాత్రలు లభించాయి. తెలుగులో ఏవో ఒకటి రెండు సినిమాలు మాత్రమే నటనకి స్కోప్ ఉన్నాయి. మిగతా సినిమాలు పెద్దగా గుర్తింపు దక్కలేదు. స్టార్ హీరోలతో చేసిన మూవీస్ తక్కువ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒక్కటే అంజలికి పేరు తెచ్చి పెట్టింది. తాజాగా 'గేమ్ చేంజ‌ర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంజలి.

ఈ మూవీలో చెర్రీ రెండు పాత్రల్లో కనిపించాడు. అందులో ఒకటి అప్పన్న పాత్ర. అప్పన్నకి జోడిగా అంజలి నటించింది. అంజలి నటనకి మంచి మార్కులే పడ్డాయి. తమిళంలో అంజలి నటించిన 'మదగజరాజా' మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఎప్పుడో 13 ఏళ్ళ కిందట రావాల్సిన మూవీ ఇపుడు వచ్చినా హిట్ టాక్ తెచ్చుకుని అంజలికి గుర్తింపు తెచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అంజలిని 'గేమ్ చేంజర్' ఫ్లాప్ తో మీరు నిరాశ పడ్డారా ? అని అడగ్గా  అంజలి రిప్లై ఇస్తూ గేమ్ చేంజ‌ర్ మంచి సినిమా కానీ ఎందుకో  ఆడ‌లేద‌ని, దానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని, అవ‌న్నీ చెప్పాలంటే స‌మ‌యం స‌రిపోద‌ని, ఇంకో ఇంట‌ర్వ్యూ పెట్టుకోవాల‌ని సెటిల్డ్ గా రిప్లై ఇచ్చింది.

అంతే కాదు తన దగ్గర ఆడియన్స్ ఎవరు మాట్లాడినా మంచి సినిమా అన్నారని చెప్పింది. పైగా సినిమా బాగుంది అనటం వేరు, మంచి సినిమా అనటం వేరు అని క్లారిటీ ఇచ్చింది. గేమ్ చేంజ‌ర్ చాలా ఇష్ట‌ప‌డి చేశా. 200 % ఎఫర్ట్ పెట్టి చేశా అంతవరకే నా బాధ్యత, ఫ‌లితం నా చేతుల్లో ఉండ‌దు. మంచి సినిమా చేసారు, నీ పాత్ర బాగుంది అని ప్రశంస సంతృప్తినిచ్చింది అని పేర్కొంది అంజలి.